తెలుగు ప్రజలతో చెలగాట మాడుతున్న కాంగ్రెస్, బీజేపీలు

 

ఎన్నికల తరువాత కేంద్రంలో అధికారం దక్కించుకోవడమే పరమావధిగా కాంగ్రెస్, బీజేపీలు సున్నితమయిన రాష్ట్ర విభజన వ్యవహారంపై వికృత రాజకీయ క్రీడ ఆడుతున్నాయి. ఆ రెండు పార్టీలు ఈ మొత్తం వ్యవహారంలో తమకే పూర్తి రాజకీయ లబ్ది కలగాలనే కోణంలోనే ఆలోచిస్తూ ఎత్తులు పైఎత్తులు వేస్తూ రాష్ట్ర విభజనకు సహకరించుకొంటూనే, ఒకదానిపై మరొకటి కత్తులు దూసుకొంటున్నాయి. ఒకవైపు రాష్ట్ర విభజన చేసి తెలంగాణాలో తమ పార్టీలకి ప్రయోజనం కలిగేలా జాగ్రత్తపడుతూనే, మరో వైపు తామే సీమాంధ్ర ప్రజల మేలు కోసం (ఎక్కువ) పరితపించిపోతున్నట్లు ఆయా పార్టీల నేతలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు.

 

కాంగ్రెస్ అధిష్టానానికి చెక్కభజన చేస్తున్న కేంద్రమంత్రులు జేడీ.శీలం వంటివారు తాము గట్టిగా పట్టుబట్టడం వలననే సీమాంధ్రకు స్వతంత్ర ప్రతిపత్తి, ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చేందుకు సోనియా, రాహుల్ గాంధీలు చాల దయతో అంగీకరించారని, అందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నామని చెప్పడం చూస్తుంటే, వారిరువురు రాష్ట్రవిభజన చేస్తున్నపటికీ, వారు దయతో ప్యాకేజీలు విదిలించినందుకు సీమాంధ్ర ప్రజలు కూడా ఎంతయినా ఋణపడి ఉండాలన్నట్లు సూచిస్తున్నట్లుంది. అంతేకాక కేవలం తాము, తమ అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ మాత్రమే సీమాంధ్రకోసం పరితపించిపోతున్నట్లుగా మాట్లాడుతూ, తమ కాంగ్రెస్ పార్టీయే రాష్ట్ర విభజన చేసిన విషయాన్ని మరుగునపరిచే ప్రయత్నం కూడా చేస్తున్నారు. పనిలోపనిగా తాము కోరిన ప్యాకేజీలనే బీజేపీ కాపీ కొట్టి, అది తమ ప్రతాపమే అన్నట్లు మాట్లాడుతోందని ఎద్దేవా చేసారు.

 

ఇక బీజేపీ నేతలు కూడా వారికి తీసిపోనట్లు తాము కాంగ్రెస్ అధిష్టానం మెడలువంచి సీమాంధ్రకు స్వతంత్ర ప్రతిపత్తి, ప్రత్యేక ప్యాకేజీలు ఇప్పించేందుకు ఒప్పించామని, అందువల్ల ఈ ‘టోటల్ ఖ్యాతి’ మొత్తం తమకే పూర్తిగా చెందాలని బిగ్గరగా వాదిస్తోంది.

 

ఈవిధంగా కాంగ్రెస్, బీజేపీలు రెండూ రాష్ట్ర విభజన చేసేందుకు ఒకదానికొకటి పరస్పరం సహకరించుకొంటూ అటు తెలంగాణాలో తమ తమ పార్టీ ప్రయోజనాలు కాపాడుకొనే ప్రయత్నం చేస్తూనే, మరోవైపు రెండూ కూడా సీమాంధ్రపై కపట ప్రేమ ఒలకబోస్తున్నాయి. అయితే రెండు ప్రాంతాలలో ప్రజలను ఆకట్టుకోవాలనే ప్రయత్నంలో అవి ఆడుతున్నఈ నాటకాలను చూసి రెండు ప్రాంతాలలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా వాటిని అసహ్యించుకొంటున్నారనే సంగతి అవి గ్రహించలేకపోవడం విచిత్రం. సున్నితమయిన ఈ అంశంతో కోట్లాది తెలుగు ప్రజల భావోద్వేగాలు ముడిపడిన సంగతిని ఏ మాత్రం పట్టించుకోకుండా రెండు పార్టీలు ఆడుతున్న నాటకాలతో అవి ఆశిస్తున్నట్లు ఏమాత్రం రాజకీయలబ్ది కలుగకపోగా సరిగ్గా అదే అంశంతో ఘోరంగా దెబ్బ తినే ప్రమాదం ఉందని గ్రహించలేకపోవడం మరీ విచిత్రం.