మోడీ, రాహుల్ జీవితాలను మలుపు తిప్పే ఎన్నికలు

 

రానున్నసార్వత్రిక ఎన్నికలు యూపీయే, ఎన్డీయేలకు చాలా కీలకమయినవి. కేంద్రంలో తిరిగి యూపీయే అధికారంలోకి రాలేకపోతే ఇక రాహుల్ గాంధీ ప్రధాని పదవిపై శాస్వితంగా ఆశలు వదులుకోవలసిందే. ఎందుకంటే గుజరాత్ రాష్ట్రాన్నిఅభివృద్ధిపదంలో నడిపించినట్లే, నరేంద్ర మోడీ దేశాన్నికూడా ముందుకు నడిపించగలిగితే, కనీసం మరో పదేళ్ళపాటు కాంగ్రెస్ ప్రతిపక్షంలో కూర్చొని భజన చేసుకోక తప్పదు. ఆరోగ్య కారణాల రీత్యా సోనియాగాంధీ ఈ ఎన్నికల తరువాత రాజకీయాల నుండి తప్పుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే ఐదు లేక పదేళ్ళ పాటు ప్రతిపక్షంలో కూర్చొన్నరాహుల్ గాంధీని ఇక కాంగ్రెస్ లో లెక్కచేసేవారుండకపోవచ్చును. గనుక, ఈ ఎన్నికలలో గెలవడం యూపీయేకి అత్యావశ్యకం. అయితే, దేశమంతటా కాంగ్రెస్ ఎదురు గాలులు వీస్తున్న సంగతి మొన్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలతోనే రుజువయింది. గనుక ఎన్డీయే అధికారంలోకి రావచ్చును. పరిస్థితి తీవ్రతను గమనించిన సోనియా గాంధీ, అది పూర్తిగా చెయ్యి దాటిపోక ముందే రాహుల్ గాంధీని తప్పించి అతని స్థానంలో తన కుమార్తె ప్రియాంకా గాంధీని రంగంలోకి దింపినా ఆశ్చర్యం లేదు.

 

దేశమంతా మోడీ జపం చేస్తున్నఈ తరుణంలో ఈ సువర్ణావకాశం ఉపయోగించుకొని మోడీ ప్రధాని కాలేకపోతే ఇక ఆయనకు కూడా మళ్ళీ ఇటువంటి అవకాశం మరోసారి రాకపోవచ్చును. తన జీవితకాల ఆశయాన్నినెరవేర్చుకోవడం ఆయనకు అత్యవసరం గనుక వచ్చే ఎన్నికలలో గెలవడం ఆయనకు అత్యావశక్యమే. ఇక గత పదేళ్లుగా ప్రతిపక్షంలో కూర్చొన్నఎన్డీయేకు కూడా ఈ ఎన్నికలలో గెలవడం అత్యావశ్యకమే. లేకుంటే ప్రస్తుతం ఉన్న నేతలందరూ రాజకీయాల నుండి రిటర్మెంట్ తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చును. అందువల్ల వచ్చే ఎన్నికలలో ఏ కూటమి నెగ్గినా, రెండో కూటమిలో ప్రధాని అభ్యర్ధికి రాజకీయంగా జీవితంలో మళ్ళీ కోలుకోలేనంతగా నష్టం కలగకడం తధ్యం. ఇంతవరకు చెప్పుకొన్నదానిప్రకారం చూస్తే, మోడీ కంటే రాహుల్ గాంధీయే ఎక్కువ నష్టపోతారని అర్ధం అవుతోంది. ఒకవేళ ఎన్డీయే అధికారంలోకి రాలేకపోతే మోడీ మళ్ళీ గుజరాత్ వెళ్ళిపోయి పాలించుకోవచ్చును. కానీ రాహుల్ గాంధీకి కనీసం ఆ అవకాశం కూడా ఉండదు. ఆయన రాజకీయ జీవితం ఉన్నత దశకు చేరక మునుపే ముగింపుకి చేరుకొంటుంది.

 

అందువల్ల రానున్న ఎన్నికలు మామూలు ఎన్నికలు కావు. రెండు ప్రధాన పార్టీల, ప్రధాని అభ్యర్ధుల జీవన్మరణ పోరాటమని చెప్పుకోవచ్చును.