ఆమాద్మీ చీపురు దెబ్బలు సమ్మగా ఉన్నాయిట

 

డిల్లీలో 15 ఏళ్లుగా అధికారం సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ సరిగ్గా సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నఈ కీలక తరుణంలో ఆమాద్మీ పార్టీ చీపురు దెబ్బలు తిని అధికారానికి దూరమయింది. డిల్లీ ప్రజలను మళ్ళీ మంచి చేసుకోవాలంటే వారి మద్దతు ఉన్నఆమాద్మీకి తను మద్దతు ఈయడం మంచిదనే ఆలోచనతోనో, లేక నాలుగు రాష్ట్రాలలో తలకు బొప్పి కట్టినందునో తెలియదు గానీ కాంగ్రెస్ పార్టీ ఇంతకాలంగా సాగిస్తున్న తన సాంప్రదాయ రాజకీయ పద్దతులను పక్కనబెట్టి, మళ్ళీ ఆమాద్మీకే బేషరతు మద్దతు ఇచ్చేందుకు సిద్దమయింది.

 

అయితే కాంగ్రెస్ ఊహించినట్లు ఆమాద్మీ ఎగిరిగెంతేయలేదు. పైగా కాంగ్రెస్ హయాంలో గత 15ఏళ్లుగా జరిగిన కుంభకోణాలను త్రవ్వితీస్తాము. విద్యుత్ మీటర్ల గోల్ మాల్ వ్యవహారంపై దర్యాప్తు జరిపించి నేరం రుజువయిన వారినందరినీ కటకటాల వెనక్కి పంపిస్తాము. కాంగ్రెస్, బీజేపీ నేతలు డిల్లీలో సాగిస్తున్న అక్రమ నీటి మాఫియా వ్యాపారాలకు అడ్డుకట్టవేసి వారి చేత ఇంతవరకు బొక్కినదంతా కక్కిస్తాము. ఎవరు పడితే వారు ఎర్రబుగ్గ కార్లేసుకొని డిల్లీ వీదుల్లో తిరగడాన్ని నిషేదిస్తాము,” అంటూ కొమ్ములు తిరిగిన కాంగ్రెస్ పార్టీనే భయపడే విధంగా లేఖ వ్రాసి వాటికి మీకు అభ్యంతరం లేకపోతే మాకు మద్దతు ఇవ్వచ్చునంటూ ఒక లేఖ వ్రాసి ఆమాద్మీ చేతులు దులుపుకొంది.

 

అదే అమాద్మీ కాక మరొక పార్టీ అయితే కాంగ్రెస్ మరోలా వ్యవహరించేది. కానీ నాలుగు రాష్ట్రాలలో తల బొప్పికట్టిన తరువాత, ఇంత ప్రజాదారణ కల ఆమాద్మీతో కొంచెం సంయమనంగానే వ్యవహరించాలని నిశ్చయించుకొని, ఆ పార్టీ వ్రాసిన లేఖకు జవాబు ఇచ్చింది.

 

కాంగ్రెస్, డిల్లీ ఇన్-చార్జ్ షకీల్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ, “ఆమాద్మీ తన లేఖలో లేవనెత్తిన 18అంశాలలో 16 పూర్తిగా పరిపాలనా సంబందమయినవే. గనుక వాటి గురించి మేము ఎటువంటి వివరణ ఈయవలసిన అవసరం లేదు. మిగిలిన రెండు అంశాలలో డిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర ప్రతిపత్తి ఈయడానికి మాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. అయితే అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది గనుక, ఆమాద్మీ దాని గురించి ప్రభుత్వంతో చర్చించవలసి ఉంటుంది. ఇక డిల్లీలో ఇప్పటికే బలమయిన లోకాయుక్తా వ్యవస్థ ఉంది. దానిని ఇంకా బలపరచాలని ఆమాద్మీ భావిస్తే దానికోసం మమ్మల్ని సంప్రదించనవసరం లేదు,” అని అన్నారు.

 

అంటే అమాద్మీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇంత కాలంగా కాంగ్రెస్ కప్పెట్టిన కుంభకోణాలను వెలికి తీసి చర్యలు చేపడితే తమకు అభ్యంతరం లేదని కాంగ్రెస్ అంగీకరించినట్లే భావించవలసి ఉంటుంది. ఇటువంటి షరతులకి అంగీకరించడం కొరివితో తల గోక్కోవడమేనని తెలిసి ఉన్నపటికీ ఆమాద్మీ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ ముందుకు రావడం చాలా విడ్డూరమే. అయితే, తన పార్టీ నేతలను ఆమాద్మీ జైలుకి పంపిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ నిమ్మకు నీరెత్తినట్లు కూర్చొంటుందని ఆశించడం అవివేకం. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం గ్రహ స్థితి ఏమీ బాగాలేనందునే కనీసం ఆమాద్మీ చీపురు దెబ్బలు తింటేనయినా ఆ దోషం పోతుందేమోననే చిన్న ఆశతోనే బహుశః ఇందుకు అంగీకరించి ఉండవచ్చును.

 

కాంగ్రెస్ పార్టీకి తను షాక్ ఇస్తే, కాంగ్రెస్ కూడ ఈవిధంగా తన అన్ని షరతులకి అంగీకరిస్తూ ఈవిధంగా జవాబీయడంతో ఆమాద్మీ కూడా షాకయింది. అందుకే ఆ పార్టీ నేతలందరూ మళ్ళీ ఈరోజు అత్యవసరంగా డిల్లీలో తమ పార్టీ కార్యాలయంలోఈరోజు సమావేశమవుతున్నారు. రేపటితో డిల్లీ శాసనసభ కాలపరిమితి ముగియనుండటంతో, ఒకవేళ ఆమాద్మీ పార్టీ ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏర్పాటుకి చొరవ తీసుకోకపోతే డిల్లీపై రాష్ట్రపతి పాలన విదింపబడవచ్చును. అయితే, ఆమాద్మీ తనను తాను నిరూపించుకొనేందుకు దొరికిన ఈ అపూర్వమయిన ఈ అవకాశాన్ని జారవిడుచుకోదని ఆశిద్దాము.