కాంగ్రెస్ అతితెలివితో ఎన్నికలలో తేదేపాకు లబ్ది

 

రాష్ట్ర విభజన ద్వారా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకి, ముఖ్యంగా తెరాస,తేదేపాలకు చెక్ పెట్టాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ, తను ప్రదర్శిస్తున్నఅతితెలివికి, దురాశకి తానే బలయిపోవచ్చును.

 

కాంగ్రెస్ సంస్కృతికి భిన్నంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనను ఎంతగా దిక్కరిస్తున్నప్పటికీ ఆయనపై ఎటువంటి చర్యలు చెప్పట్టకపోగా, ‘అతను క్రమశిక్షణ గల కాంగ్రెస్ విదేయుడని, అధిష్టానం గీసిన గీతను దాటబోడని, విభజన ప్రక్రియ సజావుగా జరిగేందుకు ఆయన అంగీకరించాడని’ సాక్షాత్ దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు. అయితే ఆయన మాటలను కిరణ్ కుమార్ రెడ్డి ఖండించినప్పటికీ, సజావుగా సాగిపోతున్నవిభజన ప్రక్రియను గమనిస్తే దిగ్విజయ్ సింగ్ మాటలు నిజమేనని అర్ధం అవుతోంది.

 

ఈవిధంగా విభజన ప్రక్రియ సజావుగా పూర్తి చేసిన తరువాత ముందే అనుకొనట్లుగా ఆయన తన సమైక్య చాంపియన్ ట్రోఫీ పట్టుకొని కాంగ్రెస్ నుండి బయటపడి కొత్త పార్టీతో ప్రజల ముందుకు రావచ్చును. ఇది కాంగ్రెస్ వ్యూహంలో భాగమయినట్లయితే అప్పుడు సీమంధ్రలో కాంగ్రెస్, కిరణ్ కాంగ్రెస్, వై.కాంగ్రెస్ అని మూడు కాంగ్రెస్ పార్టీలు మేకతోలు కప్పుకొన్న నక్కలా ప్రజల ముందుకు వస్తాయి.

 

అందులో కిరణ్, వై కాంగ్రెస్ రెండూ పాజిటివ్ ఓట్లకు గాలం వేస్తే, కాంగ్రెస్ పార్టీ మిగిలిన ఓట్లను చీల్చడానికి ప్రయత్నిస్తుంది. తద్వారా తెదేపాకు చెక్ పెట్టవచ్చునని కాంగ్రెస్ ఆలోచనగా కనిపిస్తోంది.

 

అయితే సరిగ్గా ఇదే కారణంతో ప్రజలు ఈ మూడు కాంగ్రెస్ పార్టీలను తిరస్కరించి, తేదేపాకు పట్టం కట్టే అవకాశం చాలా ఉంది. ఈ మూడు కాంగ్రెస్ పార్టీలలో దేనికి ఓటేసినా కూడా అవి అంతిమంగా మళ్ళీ కాంగ్రెస్ ఖాతాలోనే జమా అవుతాయి.

 

రాష్ట్ర విభజన చేసినందుకు కాంగ్రెస్ పార్టీని గట్టిగా శిక్షించాలని భావిస్తున్న ప్రజలు ఈ మూడు మేకవన్నె కాంగ్రెస్ పార్టీలను పక్కన బెట్టి, సమర్ధమయిన పాలన అందించిన తేదేపాకు ఓటేయవచ్చును. మంచి పరిపాలన దక్షుడిగా పేరు తెచ్చుకొన్న చంద్రబాబుకి అటువంటి ఇమేజ్ కలిగి ఉన్నమోడీ కూడా ఒకవేళ తోడయినట్లయితే తెదేపా విజయావకాశాలు మరింత మెరుగుపడవచ్చును. ఇక అధికారంలో ఉన్న ప్రభుత్వాన్నిసాగనంపి మళ్ళీ ప్రత్యామ్నాయ పార్టీకి అధికారం అప్పగించే అలవాటు కారణంగా కూడా తేదేపాకు విజయవకాశాలున్నాయి.

 

బీజేపీ వైపు చూస్తున్న కేసీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీకి హ్యాండిస్తే తెలంగాణాలో కూడా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతినడం ఖాయం. ఏమయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రదర్శిస్తున్న అతి తెలివితేటలే ఆ పార్టీ కొంప ముంచడం మాత్రం ఖాయం.