జగన్ విషయంలో కూడా కాంగ్రెస్ నేతలు విభేదమేనా

 

సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తమ పార్టీకి జగన్ పార్టీకి మంచి లంకె ఉందని బల్లగుద్ది చెపుతుంటే, తెలంగాణా కాంగ్రెస్ నేతలు మాత్రం తమ మధ్య అటువంటిదేమి లేదని వాదిస్తున్నారు. అయితే తెలంగాణా విషయంలో వారు విభేదించారంటే అర్ధం ఉంది. కానీ ఈవిషయంలో కూడా వారు ఎందుకు విభేదించవలసివస్తోంది? అందరూ కాంగ్రెస్ తానులో ముక్కలే కదా?అని సందేహం కలుగుతుంది.

 

అయితే రాష్ట్ర విభజన జరిగిపోతున్నపుడు వేరే రాష్ట్రం (ఆంధ్ర ప్రదేశ్) వ్యవహారాల్లో తలదూర్చడం వలన తల బొప్పికట్టడమే కాక తమ టికెట్స్ కూడా ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. అయితే సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ అధిష్టానం తమని మోసం చేసిందని, అక్కడ జగన్, ఇక్కడ కేసీఆర్ మద్దతు కోసం అర్రులు చాస్తోందని చేస్తున్నఆరోపణల వలన, మున్ముందు తమతో కూడా పార్టీ అదే విధంగా వ్యవహరించవచ్చనే భయం లోలోన ఉంది. అయితే పరిస్థితులు ఇంకా అంతవరకు రాలేదు గనుక, పార్టీకి అటువంటి ఆవకాశం ఇవ్వకూడదనే ఆలోచనతోనే తామంతా సోనియాగాంధీ గీసిన గీత దాటకుండా పార్టీ వెంట నడుస్తామని గట్టిగా నొక్కి చెప్పేందుకే సీమాంద్రా నేతల ఆరోపణలను ఖండిస్తున్నారనుకోవచ్చును.

 

పైగా ప్రస్తుతం వారు మొదలుపెట్టిన జైత్రయాత్ర/ సోనియ,రాహుల్ గాంధీల భజన కార్యక్రమంలో సోనియాగాంధీని తెలంగాణాలో ఇంటింటి ఇలవేల్పని ప్రచారం చేస్తున్నపుడు, ఆమెపై తమ సహచర నేతలే ఈవిధంగా ఆరోపణలు చేస్తుంటే తమ భజనకి అర్ధం లేకుండా పోతుంది. అందుకే వారు గట్టిగా సోనియాగాంధీని, కాంగ్రెస్ పార్టీని వెనకేసుకు వస్తున్నారు. అయితే రేపు ఒకవేళ వాళ్లకి కూడా కాంగ్రెస్ అధిష్టానం హ్యాండ్ ఇచ్చి కేసీఆర్ కే ప్రాధాన్యం ఇచ్చి తెరాసకే ఎక్కువ టికెట్స్ కేటాయిస్తే బహుశః అప్పుడు వారు కూడా సీమాంధ్ర నేతలతో కోరస్ పాడే అవకాశం ఉంది.

 

కానీ ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే మొన్న జగన్ మోహన్ రెడ్డి సమైక్యసభలో “అమ్మా సోనియమ్మా!” అంటూ హృదయపూర్వకంగా సోనియాగాంధీని అమ్మా అని సంబోధిస్తూనే తిట్టిన తిట్టు తిట్టకుండా తిడితే కిమ్మనని తెలంగాణా కాంగ్రెస్ నేతలు, సాటి కాంగ్రెస్ నేతలు చేస్తున్నఆరోపణలను ఖండించడానికి మాత్రం చాలా పోటీలు పడుతున్నారు. అయినా అన్నలకి తెలిసిన ఇంటి గుట్లు తమ్ముళ్ళకి తెలియకుండా ఉంటుందని ఎవరూ అనుకోలేరు కదా!