టీ-జేయేసీ నేతలని దువ్వుతున్నకాంగ్రెస్ అధిష్టానం

 

కాంగ్రెస్ పార్టీ తెలంగాణాపై చేస్తున్న కసరత్తు గురించి, ఆ క్రమంలో ఎదురవుతున్న సాధక బాధకాల గురించి కేసీఆర్ కి తెలిసి ఉన్నపటికీ, అవేమి తెలియనట్లు అతను తమను నిందిస్తూ, తమ పార్టీని రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తున్నందున, కాంగ్రెస్ పార్టీ అతనిని వదిలించుకొని, ఇప్పుడు టీ-జేయేసీ నేతలని దువ్వుతోంది.

 

కేసీఆర్ తో పోలిస్తే టీ-జేయేసీ అధ్యక్షుడు ప్రొఫెసర్.కోదండరాంకి తెలంగాణా ప్రజలలో మంచి పేరుండటమే కాక, తెరాసకు ఎంత మాత్రం తీసిపోని స్థాయిలో ఆయన కుదురుకొనున్నారు. పైగా టీ-జేయేసీ నేతలు రాజకీయ పార్టీగా ఏర్పడనందున అటువంటి వారితో చేతులు కలిపినా వారి వల్ల ఎన్నికలలో తమకు ఎటువంటి నష్టము జరగదని కాంగ్రెస్ భావిస్తోంది. అందువల్ల వారికి తెలంగాణపై తను చేస్తున్న కృషిని వివరించి, వారి నుండి మరికొంత సమయం పొందే ఆలోచనలో ఉంది. వారిని గనుక ఒప్పించగలిగితే వారి ద్వారానే తెలంగాణా ప్రాంతంలో తనకనుకూల వాతావరణం సృష్టించుకోవాలని కాంగ్రెస్ ఆలోచన. తద్వారా తనకు తెలంగాణా విషయంలో మరికొంత వెసులుబాటు లబించడమే కాకుండా, తనపై తెరాస చేస్తున్న అసత్య ప్రచారాన్ని అడ్డుకొని తెరాసను రాజకీయంగా నిలువరించవచ్చని కాంగ్రెస్ ఆలోచన.

 

అందుకే, మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ.శ్రీనివాస్ కొద్ది రోజుల క్రితం టీ-జేయేసీ సమావేశం అయ్యి, వారిని డిల్లీ రప్పించగలిగారు. అయితే, వారు డిల్లీ వచ్చీ రాగానే నేరుగా కాంగ్రెస్ పార్టీతో మంతనాలు మొదలుపెడితే, అక్కడ కేసీఆర్ మంటలు విరజిమ్మితే, అతనిని తట్టుకోవడం కష్టమని, వారు ముందుగా ప్రతిపక్ష నేతలందరితో రౌండ్ టేబిల్ సమావేశం అవుతున్నారు. ప్రస్తుతం టీ-జేయేసీ నేతలు ప్రతిపక్ష నేతలతో సంప్రదింపులు జరుపుతున్నపటికీ, వారు ఆ తరువాత తెలంగాణా కోసం వినతి పత్రం ఇచ్చే మిషతో కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధిష్టానం కూడా వారితో సంప్రదింపులు జరిపేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తోంది.

 

ఒకవేళ, కాంగ్రెస్ అధిష్టానానికి వారికి మధ్య సయోధ్య కుదురితే, రాష్ట్ర కాంగ్రెస్ నేతల ద్వారా వారికి మరింత దగ్గిరయ్యే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధిష్టానం వారిని తనకనుకూలంగా మార్చుకొనగలిగితే, తెలంగాణాలో కేసీఆర్ ని, అతని తెరాస పార్టీని ఒంటరి చేసి తన టీ-కాంగ్రెస్ నేతలతోనే చెక్ పెట్టించవచ్చునని కాంగ్రెస్ ఆలోచన.

 

త్వరలో రాజకీయపార్టీ పెట్టి ఎన్నికలలో పోటీ చేస్తానంటున్న ఉస్మానియా విద్యార్దుల సంఘం, టీ-జేయేసీ, రెండూ కూడా తెరాసకు వ్యతిరేఖంగా పనిచేసినట్లయితే, అది కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా చాలా లబ్ది చేకూరుస్తుది గనుక, ముందుగా కాంగ్రెస్ పార్టీ టీ-జేయేసీ నేతలని దువ్వడం మొదలుపెట్టింది.

 

ఇక, టీ-జేయేసీ నేతలకి కూడా ఇది ఊహించని అతిపెద్ద ఆఫర్ అని చెప్పవచ్చును. దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పెద్దలతో స్నేహ సబందాలు ఏర్పరచుకోగలిగితే, అది తమ రాజకీయ జీవితాలని మలుపు తిప్పి ఉన్నత శిఖరాలకి చేర్చుతుందని వారికి తెలుసు. అందువల్ల వారుకూడా అందివచ్చిన ఈ సువర్ణావకాశాన్ని వదులుకోకపోవచ్చును. వారి మధ్య సయోధ్య కుదిరితే ఇక కేసీఆర్ కి ముందున్నది ముసళ్ళ పండుగేనని భావించవచ్చును.