కాంగ్రెస్ హస్తంలో బీజేపీ కమలం విలవిలా

 

కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యర్ధుల గత చరిత్రలను త్రవ్వి తీసి అందులో లోపాలను, వారు చేసిన తప్పులను వెతికి పట్టుకొని వారిని రాజకీయంగా దెబ్బ తీయడం కొత్తేమి కాదు. ఇంతవరకు అనేక మందిపై విజయవంతంగా ప్రయోగించిన ఈ ఆయుధాన్నేమళ్ళీ మరోమారు మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే. సింగ్ పై ప్రయోగించింది.

 

ఆయన హయాంలో ఆర్మీలో నెలకొల్పిన ఒక ప్రత్యేక గూడచార వ్యవస్థ నిధులు దుర్వినియోగం చేయడమే కాకుండా ఒమర్ అబ్దుల్లా యొక్క జమ్మూ మరియు కాశ్మీర్ ప్రభుత్వాన్ని కూలద్రోసేందుకు కుట్రలు పన్నిందని, అందువల్ల దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు సీబీఐ విచారణకు ఆదేశించాలని, లెఫ్టినెంట్ జనరల్ వినోద్ భాటియా హోంమంత్రికి మార్చ్ నెలలో ఇచ్చిన ఒక నివేదికను ప్రస్తావిస్తూ, నిన్న కేంద్ర మంత్రి మనిష్ తివారీ, “ఇది చాలా సున్నితమయిన, కీలకమయిన దేశరక్షణకు సంభందించిన విషయం. అందువల్ల దీనిపై సమగ్రం విచారణ జరిపి, ఇందులో దోషులు ప్రస్తుతం సర్వీసులో ఉన్నవారయినా రిటైర్ అయినవారయినా వదిలిపెట్టేదిలేదు,” అని మీడియాకు తెలియజేసారు.

 

కాంగ్రెస్ పార్టీ ఈ విషయం ప్రకటించేందుకు ఎంచుకొన్నసమయం గమనిస్తే అది తన ప్రత్యర్ధుల చేతిని మెలి పెట్టి లొంగ దీసుకోవాలని ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. వీకే. సింగ్, బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటింపబడిన నరేంద్ర మోడీతో కలిసి ఇటీవల రివారీలో జరిగిన ఒక బహిరంగ సభలో పాల్గొనడమే అందుకు కారణమని బీజేపీ ఆరోపిస్తోంది.