కాంగ్రెస్ పార్టీలో అందరూ తేడాయేనా

 

కాంగ్రెస్ అధిష్టానం తన రాష్ట్ర నేతలను నియత్రించడంలో విఫలమవడం కొత్త విషయమేమీ కాదు. వారి క్రమశిక్షణా రాహిత్యానికి వారు ప్రజాస్వామ్యమని ముద్దు పేరు పెట్టుకొని సమర్ధించుకొంటారు కూడా. బహుశః కేంద్ర నాయకులలో ఈ ప్రజాస్వామ్యం కొంచెం ఎక్కువేననిపిస్తుంది. ఒకే అంశంపై పదిమంది నేతలు పది రకాలుగా మాట్లాడటం కాంగ్రెస్ సంస్కృతి అని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు అన్నమాట నిజమని ఒప్పుకోక తప్పదు.

 

రాష్ట్ర విభజనపై సీమాంధ్ర, తెలంగాణా నేతలు రెండు రకాలుగా మాట్లాడుతుంటారు. సీమాంధ్ర యంపీలు రాజీనామాలు చేద్దామని చెపుతుంటే, రాకరాక వచ్చిన మంత్రి పదవులను వదులుకొని ఏమి సాధిస్తామని కేంద్రమంత్రులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

 

ఇక వీరి పరిస్థితి ఇలా ఉంటే సోనియా గాంధీ కార్యదర్శి షకీల్ అహ్మద్ ‘రాష్ట్ర విభజన ప్రకటన చేసి తొందరపడ్డామేమో!’ అని అంటే, ‘పార్టీ నిర్ణయాన్నిప్రభుత్వం కూడా ఆమోదించింది,విభజన ఖాయం!’ అని మనిష్ తివారి కుండ బ్రద్దలు కొడతాడు. వాయలార్ రవి ‘అంటోనీ కమిటీ నివేదిక వచ్చిన తరువాతనే టీ-నోట్ క్యాబినెట్ ముందుకు వెళుతుందని’ చెప్పిన కొద్దిసేపటికే హోంమంత్రి షిండే ‘టీ-నోట్ రెడీ, త్వరలో క్యాబినెట్ ముందుకి’ అని ప్రకటిస్తారు. మరో మంత్రి గారు మధ్యలో దూరి ‘టీ-నోట్ కి అంటోనీ కమిటీకి ఒకదానితో మరొకదానికి అసలు సంబంధమే లేదని’ శలవిస్తారు.

 

దిగ్విజయ్ సింగ్ సీమాంద్రా కాంగ్రెస్ యంపీలను ఒకపక్క ఒదారుస్తూనే, ‘తెలంగాణా ప్రక్రియ ఆగే ప్రసక్తిలేదు, మాటంటే మాటే! ఎన్నికలలోగా తెలంగాణా పక్కా!’ అని గిల్లి వదిలిపెడతారు. “అలాగయితే మేము రాజీనామాలు చేస్తామని” సీమాంధ్ర నేతలు బెదిరిస్తే “ఈ తాటాకు చప్పుళ్ళకు భయపడబోమని” దిగ్విజయ్ సింగ్ బదులిస్తారు.

 

మరో చాకు లాంటి పెద్దాయన చాకో వచ్చి ‘వాళ్ళు ప్రజల పోరు పడలేక అలాగంటున్నారు గానీ వాళ్ళు నిజంగా రాజీనామాలు చేస్తారా ఏమిటీ?’ అని వారిని సమర్దిస్తునాడో లేక విమర్శిస్తునాడో తెలియకుండా గిల్లుతాడు.

 

రాష్ట్ర విభజన చేసేస్తున్నామని ప్రకటించి ఇప్పటికి 50రోజులయినా ఇంకా అడుగు ముందుకు వేయడానికి సాహసించలేని కాంగ్రెస్ నేతలు కచ్చితంగా ఎన్నికలలోగా విభజించిపడేస్తామని బల్ల గుద్ది మరీ హామీ ఇస్తున్నారు. హైదరాబాదుపై ఏమి చేయాలో పాలుపోక మా దగ్గిర మూడు ఆప్షన్స్, ముప్పై మూడు ఆప్షన్స్ ఉన్నాయని తమ అయోమయ పరిస్థితిని బయటపెట్టుకొనే పెద్దమనుషులు, ‘హైదరాబాద్ విషయంలో అందరికీ అమోదయోగ్యమయిన నిర్ణయం తీసుకొంటాము, అందరికీ న్యాయం చేస్తాము’ అంటూ మీడియా ముందు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తారు.

 

ఏవిషయంలోనైనా అనుమానాలు వస్తే ఆ అంశంపై ముందుగా మీడియాకు లీకులు ఇచ్చి జనం నాడి తెలుసుకొనే ప్రయత్నం చేసే వాళ్ళే ఇప్పుడు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నామని చెపుతుంటారు. అయినా ఎటువంటి నిర్ణయమూ తీసుకోకుండానే తీసుకొంటున్నట్లు వారు చేసే హడావుడికి మాత్రం లోటు ఉండదు. దాదాపు రెండు నెలలుగా రాష్ట్రం పూర్తిగా స్తంభించిపోయినా ‘అంతా ప్రశాంతంగా అండర్ కంట్రోల్లో’ ఉందని ప్రకటించి చేతులు దులుపుకొంటారు.

 

ఏమయినప్పటికీ అసలు ఒకే అంశంపై ఇంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడటమే చాల గొప్ప విషయమని నమ్మక తప్పదు. నిజం చెప్పాలంటే మంచి క్రియేటివిటీ ఉన్నవాళ్ళే కాంగ్రెస్ నేతలవుతారేమో! ఆ లెక్కన వీళ్ళు నటులు కాబోయి రాజకీయ నాయకులయ్యారని చెప్పవలసి ఉంటుంది.