అజ్ఞానమా ఎన్నికలలో ఓటమిపై నమ్మకమా

 

ఇదివరకు రోజుల్లో ప్రభుత్వాలకు సంక్షేమ ప్రభుత్వాలుగా ప్రజలలో ఒక గుర్తింపు, గౌరవం ఉండేవి. కానీ ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా లాభాలు, నష్టాలు అని మాట్లాడుతూ ఒక పెద్ద వ్యాపార సంస్థలలాగ పనిచేస్తున్నాయి. కేంద్రం పెట్రోలియం కంపెనీలకి యదేచ్చగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకోవడానికి అనుమతినిచ్చేసిన తరువాత, ఇక నిత్యం పెరిగే పెట్రోల్ డీజిల్ దరల ప్రభావంతో నానాటికి సామాన్యుడు బ్రతుకు భారంగా మారుతుంటే, ‘ప్రజలలో ఆర్ధిక శక్తి పెరిగింది గనుక ఆ మాత్రం పెంపును వారు తట్టుకోగలరని’ సాక్షాత్ ప్రధాని మంత్రే అభిప్రాయపడటం చూస్తే ప్రజల కష్టాల పట్ల ప్రభుత్వానికి ఎంత గొప్ప అవగాహన ఉందో అర్ధం అవుతోంది. ఇక రైల్వే చార్జీలు, కరెంటు చార్జీల, భూములు దరల పెరుగుదల వంటి వాటి గురించి ప్రత్యేకంగా పేర్కొనవలసిన అవసరం లేదు.

 

 పెరిగిన కరెంటు చార్జీలకి వ్యతిరేఖంగా ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించి నిరాహార దీక్షలు, ధర్నాలు చేస్తుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం, ప్రతిపక్షాలు కరెంటు సమస్యను రాజకీయం చేసి, తమ రాజకీయ ప్రయోజనాల కోసమే ఉత్తుత్తి పోరాటాలు చేస్తున్నాయని ఒక్క మాటలో తేల్చేసారు. ఒక వైపు రోము నగరం తగల బడుతుంటే తాపీగా ఫిడేల్ వాయించుకొంటూ కూర్చొన్న నీరో చక్రవర్తిని తలపిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తన స్వంత పార్టీలో నేతలే తీవ్రవిమర్శలు చేసేసరికి కొంచెం దిగి వచ్చితన ఇందిరమ్మ బాట కార్యక్రమం ముగించుకొని వచ్చేక 4, 5 తేదీలలో పెరిగిన విద్యుత్ ధరలను సమీక్షిస్తానని తాపీగా చెప్పడం ఆయన బాద్యత రాహిత్యానికి అద్దం పడుతోంది. ప్రతిపక్షాలు విద్యుత్ సమస్యను రాజకీయం చేస్తున్నాయని విమర్శించిన ముఖ్యమంత్రి, మరి తన స్వంత పార్టీ నేతలు కూడా విద్యుత్ బిల్లుల పెంపును వ్యతిరేఖించినప్పుడు మరి వారిని కూడా ఆయన అదే విధంగా ఎందుకు విమర్శించలేక పోయారు. ప్రతిపక్షాలు చేస్తే రాద్ధాంతం, స్వపక్షం చేస్తే సిద్ధాంతం అవుతుందా?

 
ఈ ప్రభుత్వాలు ప్రజలకి అవసరమయిన కరెంటు ఇవ్వలేవు, కానీ భారీగా డబ్బులు మాత్రం వసూలు చేయగలవు. పంటలు నాశనమయిపోతున్నా, వ్యాపారాలు, పరిశ్రమలు, చదువులు, చివరికి ఆసుపత్రులు కూడా మూసుకోవలసి వస్తున్నాప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేకపోవడమే కాకుండా శాసనసభలో ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ చాలా బాధ్యతా రాహిత్యంగా మాట్లాడటం చూస్తున్న ప్రజలు ఆవేశంతో రగిలిపోతున్నారు. తత్ఫలితమే ప్రతిపక్షాలు చేప్పటిన ధర్నాలకు, నిరాహర దీక్షలకు విశేష ప్రజా స్పందన కనిపిస్తోందిప్పుడు.

 

చివరికి, ఇంటిలో టీవీ చూసుకొనే భాగ్యం కూడా లేకుండా చేస్తూ, ఈ రోజు నుండి తప్పని సరిగా ప్రజలందరూ సెట్ టాప్ బాక్సులు అమర్చుకోవాలని హెచ్చరించడం పేద ప్రజలకి సైతం ఆగ్రహం తెప్పించింది. సెట్ టాప్ బాక్సులు విధిగా అమర్చుకోవాలని ప్రజలకి నిర్దిష్ట గడువు విదించినప్పుడు మరి ఇన్ని లక్షల మందికి ఒకేసారి అన్ని సెట్ టాప్ బాక్సులు మార్కెట్టులో అందుబాటులో ఉంటాయా లేదా, ఒక వేళ ఉంటే అకస్మాత్తుగా ఇంత డిమాండ్ ఏర్పడటంతో వ్యాపారులు వాటి ధరలు పెంచేసి ప్రజలను దోచుకోకుండా ఉంటారా? లేదా? అలా జరుగకుండా వారిని ఏవిధంగా నియంత్రణ చేయాలి? వంటి విషయలేమి పట్టించుకోకుండా ప్రభుత్వం అనాలోచితంగా ఏప్రిల్ 1వ తేదీ లోగా అందరూ సెట్ టాప్ బాక్సులు అమర్చుకోవాలని ప్రకటించేసింది. పైగా, మొన్న ఆర్ధిక మంత్రి చిదంబరం ప్రవేశ పెట్టిన తన బడ్జెట్లో సెట్ టాప్ బాక్సులపై 6% వరకు పన్నులు పెంచడం చాలా దారుణం. ఒకేసారి ఇన్ని లక్షల మంది ప్రజలు సెట్ టాప్ బాక్సులు అమర్చుకోవాలంటే వాటి ధరలు సామాన్యులకి కూడా అందుబాటులోకి తెకపోగా వాటిపై అమాంతం పన్ను పెంచేసి, వ్యాపారుల కంటే ముందుగానే ప్రభుత్వమే లాభాలు కళ్ళ జూసే ప్రయత్నం చేయడం చాలా దారుణం.

 

బహుశః ఈ పాటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాము వచ్చే ఎన్నికలలో ఓడిపోవడం ఖాయం అని గ్రహించడం వలననే ఇంత నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నాయని భావించాలి లేదా ప్రజలలో నానాటికి పెరుగుతున్న వ్యతిరేఖతను గుర్తించదానికి ఇష్టపడని  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ ఆత్మవంచన చేసుకొంటూ భ్రమలోనే ఉండిపోవాలని కోరుకొంటున్నట్లుగా భావించాల్సి ఉంటుంది.