జగన్, పవన్ నై నై.. చంద్రబాబుకే అలీ జై!!

 

గత కొద్దిరోజులుగా ఏపీ రాజకీయాల్లో బాగా నానుతున్న పేరు అలీ. బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేసిన అలీ.. కమెడియన్ గా ఆకట్టుకొని ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే రాజకీయాల్లో మాత్రం అలీ జనాల్ని తెగ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అలీ ఏ పార్టీలో చేరతారో తెలియక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. వైసీపీ, జనసేన, టీడీపీ ఈ మూడు దారుల్లో అలీ పయనం ఎటువైపో అర్ధంగాక ప్రజలు క్వశ్చన్ మార్క్ ఫేస్ లతో చూస్తున్నారు.

సినీ ప్రయాణంలో అలీ.. పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడు. పవన్ చేసిన మెజారిటీ సినిమాల్లో అలీ నటించాడు. వీరిద్దరూ మంచి స్నేహితులని సాధారణ ప్రేక్షకులకు కూడా తెలుసు. దీంతో అలీ.. పవన్ స్థాపించిన జనసేన పార్టీలో చేరతారని భావించారంతా. కానీ అలీ ఎందుకో జనసేనకు దూరం పాటిస్తూ వచ్చారు. సర్లే అలీ రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారేమో అనుకున్నారు. కానీ అనూహ్యంగా అలీ వైసీపీ అధినేత జగన్ తో భేటీ అయ్యారు. దీంతో అలీ వైసీపీలో చేరుతున్నారంటూ వార్తలు మొదలయ్యాయి. ఇదేంటి పవన్ జనసేన ఉండగా.. అలీ వైసీపీ వైపు ఎందుకు చూస్తున్నారు? అంటూ ఒకటే చర్చలు. ఒకవైపు అలా చర్చలు జరుగుతుండగానే మరోవార్త బయటికి వచ్చింది. అదే పవన్ తో అలీ భేటీ. ఇంకేముంది అలీ 'స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం' అంటూ పవన్ వైపు వచ్చారు. త్వరలో జనసేనలో చేరతారు అంటూ చర్చలు మొదలయ్యాయి. అబ్బే.. ఇంతటితో ఆగితే ఏం మజా ఉంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో లాగా ఇంకో పెద్ద ట్విస్ట్ వచ్చింది. ప్రొడ్యూసర్ అశ్వనీదత్ తో కలిసి అలీ.. చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇప్పుడు అలీ టీడీపీలో చేరుతున్నారంటూ వార్తలు. ఇలా ఈ మూడు పార్టీలలో అలీ ఏ పార్టీకి జై కొడతారో అర్థంగాక జనాలు జుట్టు పీక్కుంటున్నారు.

అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలీ టీడీపీ వైపే మొగ్గుచూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేన మొదటిసారి ఎన్నికల బరిలో నిలుస్తుంది. రాబోయే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువున్నాయి. ఇక వైసీపీ విషయానికొస్తే.. టికెట్ విషయంలో అలీకి ఆ పార్టీ నుంచి స్పష్టమైన హామీ రాలేదని తెలుస్తోంది. అసలు ప్రస్తుతం అలీ రాజకీయాల్లోకి రావాలనుకునేది ఎన్నికల బరిలోకి దిగడానికి. నిజానికి అలీ గతంలోనే టీడీపీ తరుపున పోటీ చేయాలనుకున్నారు. కానీ కేవలం ప్రచారానికే పరిమితమయ్యారు. కానీ ఈసారి ఎన్నికల బరిలోకి దిగాలని ఫిక్స్ అయ్యారు. అందుకే ఆయనికి గతంలో ఉన్న టీడీపీ సత్సంబంధాలతో చంద్రబాబుతో భేటీ అయ్యారు. అంతేకాదు ఆయనికి టీడీపీ నుంచి టికెట్ హామీ కూడా వచ్చినట్లు సమాచారం. అలీ టీడీపీ తరుపున మైనార్టీలు ఎక్కువగా ఉండే గుంటూరు 1 నుంచి పోటీ చేసే అవకాశముందని తెలుస్తోంది. మరి అలీ టీడీపీలో చేరతారో లేక ఇంకేమైనా ట్విస్ట్ ఇస్తారో చూడాలి.