నిషేధాన్ని నిషేధించటమే మార్గమా?

 

నిషేధం.. ఈ మధ్య ఈ పదం తెగ వాడబడుతోంది! దేన్ని చూసినా నిషేధించాలని చెప్పేవారు ఎక్కువైపోయారు. అందుకు తగ్గట్టే నిషేధాన్ని నిషేదించేమనే అభ్యుదయవాదులు కూడా ఎక్కువైపోయారు. ఇక ఎప్పటిలాగే సంక్రాంతి రావటంతో మరోసారి నిషేధం గోల మొదలైంది. సుప్రీమ్ కోర్టే ఈ మొత్తం కలకలానికి కారణం కావటం ఇక్కడ మరో విశేషం. మన తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల పందాలు చర్చకు దారి తీస్తే , తమిళనాడులో జల్లికట్టు పెద్ద రచ్చకే దారి తీసింది!

 

కోర్టు వద్దన్నా గోదావరి జిల్లాల్లో కోళ్ల పందాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. అన్ని పేపర్లు, ఛానల్స్ ఇదే వార్తను జనానికి అందిస్తున్నాయి. మరి కోర్టు తీర్పుని అమల్లో పెట్టాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారు? మొత్తానికి మొత్తంగా జనమంతా కోళ్ల పందాలకు అనుకూలంగా వుంటే వాళ్లు మాత్రం ఏం చేస్తారు? ప్రేక్షక పాత్రకి పరిమితం అవుతున్నారు. అటు తమిళనాట కూడా సేమ్ సిట్యుయేషన్. జల్లికట్టు వద్దని కోర్టు మూడేళ్ల కిందటే చెప్పినా యథావిధిగా కార్యక్రమం జరిగిపోతోంది. అంతే కాదు, కమల్ హసన్ లాంటి సెలబ్రిటీలు కూడా జల్లికట్టుకు మద్దతు పలుకుతున్నారు. జల్లికట్టు వద్దనే దాని కన్నా ముందు బిర్యానీ బంద్ చేయించాలని సూటిగా ప్రశ్నిస్తున్నారు! అదీ నిజమే... ప్రతీ రోజూ లక్షల కోళ్లు, మేకలు, గొర్రెలు, గోవులు చికెన్ , మటన్ షాపులు, కబేళాల్లో బలైపోతుంటే... సంవత్సరానికి ఒకసారి జరిగే సంప్రదాయ క్రీడల్లో జంతు హింస వుందనటం హాస్యాస్పదం! రెండో ముఖ్యమైన విషయం కొందరు హిందూత్వవాదులు చెబుతున్నట్టు అన్నీ నిషేధాలు, ఆజ్ఞలు మెజార్టీ జనాల పండుగలకేనా? బక్రీద్, మొహర్రం లాంటి పండుగలకి ఎలాంటి పిల్స్ వుండవు, కేసులుండవు, తీర్పులూ వుండవు. ఇది ఏకపక్షంగా వాదించే హిందూత్వవాదుల వాదనైనా... ఒక్కటి మాత్రం నిజం. కోర్టుల్ని ఆశ్రయించే వారు హిందువుల పండుగల్నే దృష్టిలో పెట్టుకుంటున్నారు. కోర్టులు కూడా మన పండుగల మీదే తీర్పులు ఇస్తున్నాయి. మిగతా మతాలు, వర్గాలు, సంస్కృతుల్లోని హింసని పట్టించుకున్న దాఖలాలు తక్కువ..

 

కోర్టు తీర్పుల్ని ఒక పరిధికి మించి ఎవ్వరూ విమర్శించటానికి వీలు లేదు కాబట్టి ఆ విషయం పక్కన పెడితే అసలు నిషేధాలు ప్రజాస్వామ్యంలో పని చేస్తాయా అన్నది పెద్ద చర్చనీయాంశం. కోర్టు కోళ్ల పందాలు, జల్లికట్టు వద్దన్నా జరుగుతూనే వున్నాయి. అలాగే ఆ మధ్య పోర్స్ సైట్లు కొన్ని బ్యాన్ చేస్తే కూడా అక్రమ మార్గాల్లో జనం చూడనే చూసేశారు. బీహార్, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో మద్య నిషేధం వుంటే ఏం జరుగుతు వుంటుందో కూడా మనకు తెలిసిందే. నిషేధం అనగానే దాన్ని తుంగలొ తొక్కే ఆలోచనలు కూడా చాలానే చేస్తుంటారు! పైగా భారతదేశం లాంటి అతి పెద్ద వ్యవస్థలో సంపూర్ణ నిషేధం దాదాపు అసాధ్యం. రాజకీయ నేతలకు ఓట్ల భయాలు, పోలీసులకి తగిన శక్తి, సామర్థ్యాలు లేని బాధలు ఇలా బోలెడు కారణాలు. ముఖ్యంగా, నిషేధం పట్ల ప్రజల్లోనే పెద్ద ఎత్తున విముఖత వున్నప్పుడు దాని ఆచరణ ఎంత మాత్రం సాధ్యం కాదు.

 

అమెరికా లాంటి దేశాలు కూడా ఒకప్పుడు మద్యం, జూదం నిషేధించాలని ప్రయత్నించి వెనక్కి తగ్గాయి. తక్కువ  జనాభ, ఎక్కువ వనరులున్న పాశ్చాత్య వ్యవస్థలే చట్ట బద్ధం చేసి నియంత్రణలో పెట్టినప్పుడు ఇండియా అ పని చేయటం తప్పేం కాదు. స్పెయిన్ లో బుల్ ఫైట్ లాగా జల్లికట్టు కూడా చట్ట బద్ధం చేయవచ్చు. అలాగే, కోళ్ల పందాలు లాంటివి కూడా కఠిన నియమాలు, నియంత్రణతో చట్ట బద్ధంగా అనుమతిస్తే నష్టం కొంతైనా తగ్గుతుంది. అలా కాకుండా తూతూ మంత్రపు నిషేధం అమలు చేస్తూ అన్నీ జరగనిచ్చేస్తే నష్టం మరింత పెరుగుతుంది. ప్రభుత్వాలకి కూడా ట్యాక్స్ రూపంలో నయా పైసా రాదు. ఇది జల్లికట్టు కోళ్ల పందాలు, జూదం లాంటి వాటి విషయంలోనే కాదు వ్యభిచారం కూడా కొన్న దేశాల్లో చట్టబద్ధం చేసింది ఇందుకే. మన దేశఃలో వ్యభిచారం చట్ట పరంగా నేరమైనా ముంబై, కోల్ కతా లాంటి నగరాల్లో దశాబ్దాలుగా దందా నడుస్తూనే వుంది. ఇలాంటివన్నీ ఋజువు చేసేది ఒక్కటే. నిషేధం దేన్ని నిషేధించలేదు. కాబట్టి నిషేధాన్ని నిషేధించి... నియంత్రణని నెత్తికెత్తుకోవాలి. అదే తెలివైన మార్గం...