ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ.. జగన్ మార్క్ పాలన

 

ఏపీలో సర్కారు బడులకు మహర్దశ వచ్చింది, మరో బృహత్తర కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. విద్యా రంగంలో మార్పులు తీసుకొచ్చేందుకు నాడు నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒంగోలు పీవీఆర్ గ్రౌండ్ నందు ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. నాడు నేడుతో విద్యారంగంలో సమూల మార్పులు, తొమ్మిది రకాల కనీస వసతులతో సర్కారు బడులకు మహర్దశ, తొలి దశలో 15715 పాఠశాలల్లో అమలు, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఏపీలోని సర్కారు బడుల రూపురేఖలు మారిపోనున్నాయి.

నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చేరువ చేసేందుకు జగన్ సర్కార్ మూడు విడతల్లో మనబడి నాడు నేడు కార్యక్రమాన్ని అమలు చేసేందుకు నడుం బిగించింది. ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మార్పు తరవాత అదే పాఠశాలల పరిస్థితిని కళ్లకు కట్టేలా ఫొటోలు తీసి మరీ ప్రజల ముందు ప్రదర్శిస్తామంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించడం ద్వారా ఈ కార్యక్రమంపై తమ చిత్తశుద్ధిని చాటుకున్నారు. మూడు సంవత్సరాల్లో రాష్ట్రం లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాల లేమి అనే మాట వినిపించకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది.

పంచాయతీ రాజ్, మునిసిపల్, పాఠశాల విద్య, గిరిజన సంక్షేమం, బీసీ సంక్షేమం, సాంఘిక సంక్షేమం, జువైనల్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 44512 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 33797 ప్రాథమిక, 4215 ప్రాథమికోన్నత, 6510 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. తొలి దశలో రాష్ట్రంలోని 17715 పాఠశాలలను ఎంపిక చేసింది ప్రభుత్వం. ఇందులో 9795 ప్రాథమిక, 3110 ప్రాథమికోన్నత పాఠశాలలు, 2810 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఆయా పంచాయతీల పరిధిలో అధికంగా విద్యార్థులున్న పాఠశాలలను నాడు నేడు కార్యక్రమంలోని మొదటి దశలో ఎంపిక చేశారు. వీటితో పాటు శిథిలావస్థలో ఉన్న పాఠశాలలు, నూతనంగా నిర్మించాల్సిన పాఠశాలలు అసంపూర్తిగా ఉన్న పాఠశాలలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు.

అదే విధంగా ఉన్నత పాఠశాలల్లో 250 మంది కన్నా ఎక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలలకు కూడా మొదటి దశలో అవకాశం కల్పించారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకు రావడం ద్వారా పేద, మధ్య తరగతి విద్యార్థులు కార్పొరేట్ విద్యా సంస్థలతో పోటీ పడేలా తీర్చి దిద్దాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం ప్రకటించింది. విద్యతో పాటు ప్రైవేటు స్కూళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా కార్పొరేట్ స్కూళ్ళను తలదన్నే రీతిలో ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపర్చాలనే సంకల్పంతో ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ లు ప్రాధాన్యతగా తీసుకోవాలని, అలాగే జిల్లాలోని మంత్రులు ఎమ్మెల్యేలను కూడా భాగస్వామ్యం చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.