సీఎం రమేష్‌ ఈవెంట్లో వలసల రాజకీయం... దుబాయ్ వేదికగా బేరసారాల మంత్రాంగం

రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ కుమారుడి నిశ్చితార్థం దుబాయ్‌లో అంగరంగవైభవంగా జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుక కోసం 25కోట్ల రూపాయలను సీఎం రమేష్ ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. దాంతో, 700మంది వీవీఐపీ గెస్టులు, 15 స్పెషల్ ఫ్లైట్లు, కళ్లు చెదిరే ఏర్పాట్లతో ఎంగేజ్ మెంట్ వేడుక కనీవినీ ఎరుగనిరీతిలో జరిగింది. ఇక, ఏపీ, తెలంగాణతోపాటు పలువురు జాతీయ నేతలు, సినీ రాజకీయ పారిశ్రామిక ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే, సీఎం రమేష్‌ కుమారుడి నిశ్చితార్థం వేడుక ...రాజకీయాలకు కూడా వేదికగా మారిందని అంటున్నారు. జంపింగ్ జపాంగులు తమ చర్చల కోసం ఈ ఈవెంట్ ను వేదికగా మార్చుకున్నారని అంటున్నారు.

సీఎం రమేష్‌ కుమారుడి నిశ్చితార్థ వేడుకకు అన్ని పార్టీల నేతలూ వెళ్లారు. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అయితే, పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారంటూ బీజేపీ ఎంపీ సుజనాచౌదరి బాంబు పేల్చడం... దానికి కొనసాగింపుగా... దుబాయ్ వేదికగా వలసల రాజకీయం జరుగుతోందంటూ సీపీఐ నారాయణ వ్యాఖ్యానించడంతో... సీఎం రమేష్ కుమారుడి ఎంగేజ్ మెంట్ వేడుక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎందుకంటే, నిశ్చితార్థ వేడుక కోసం దుబాయ్ వెళ్లిన 11మంది టీడీపీ ఎమ్మెల్యేలు... బీజేపీ నేతలతో చర్చలు జరిపారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాషాయ గూటికి చేరాలని నిర్ణయించుకున్న గంటా... ఈ జంపింగ్ జపాంగులకు నాయకత్వం వహించినట్లు చెబుతున్నారు.

సీఎం రమేష్‌ కుమారుడి నిశ్చితార్థ వేడుకలో పాల్గొనేందుకు దుబాయ్‌ వెళ్లిన వైసీపీ, టీడీపీ ప్రజాప్రతినిధులంతా పార్టీ మారతారని చెప్పలేం. కానీ, దుబాయ్ వేదికగా మాత్రం జంపింగ్ జపాంగులు మంతనాలు, బేరసారాలు మాత్రం కచ్చితంగా సాగాయని అంటున్నారు. దుబాయ్ వేదికగా సాగిన పరిణామాలను గమనిస్తే ఏపీ రాజకీయాల్లో పెను సంచలనాలు ఉంటాయంటున్నారు.