ముఖ్యమంత్రి రాజీనామా వార్తలను అధిష్టానం పట్టించుకోలేదేమిటి?

 

ఈ రోజు రాష్ట్ర శాసనసభ చిట్ట చివరి సమావేశాలు ముగియగానే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయచ్చని వార్తలు వెలువడుతున్న సమయంలో, రాష్ట్ర విభజన బిల్లు వ్యవహారంతో తలమునకలయి ఉన్న కారణంగానో, లేక ఆయన రాజీనామా చేస్తే రాష్ట్రపతి పాలన విదించాలని భావిస్తుందో తెలియదు కానీ కాంగ్రెస్ అధిష్టానం మొత్తం మీద ఆ సంగతి అసలు తెలియనట్లు, అసలు పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. ఆయన రాజీనామా ఆమోదం పొందినట్లయితే, దానితోబాటు ఆయన మంత్రివర్గం కూడా పూర్తిగా రద్దయిపోతుంది. ఒకవేళ ఆయన శాసనసభ రద్దుకు కూడా సిఫారసు చేసినట్లయితే, దానిని గవర్నర్ ఆమోదిస్తే రాష్ట్రపతి పాలన అనివార్యమవుతుంది. కానీ, ఆయన ముఖ్యమంత్రి రాజినామాను ఆమోదించకుండా పెండింగులో పెట్టిన్నట్లయితే, ఈ సమస్యకు వేరే పరిష్కారాలు ఆలోచించే వెసులుబాటు కేంద్రానికి దొరుకుతుంది. పైగా ఆవిధంగా చేసినట్లయితే ఆయనను కొత్తపార్టీ పెట్టకుండా మరికొంత కాలం నిలువరించవచ్చును. ఈలోగా మరికొందరు శాసనసభ్యులు, మంత్రులు వేరే పార్టీలలోకి మారిపోతే, ఇక ఆయన కొత్త పార్టీ ఆలోచన అటకెక్కక తప్పదు. పైగా అయన రాజకీయ భవిష్యత్ కూడా ప్రశ్నార్ధకంగా మారుతుంది.

 

కానీ, ఆవిధంగా జరగడం వలన కాంగ్రెస్ పార్టీకి నష్టమే తప్ప లాభం ఉండదు. సీమాంధ్రలో తెదేపాను అధికారంలోకి రాకుండా అడ్డుకొంటూనే, కాంగ్రెస్ వ్యతిరేఖతను ఓట్లుగా మలుచుకోవడానికే కాంగ్రెస్ అధిష్టానం ఈ వ్యూహం అమలుచేస్తోంది గనుక ఆయన రాజీనామాను వెంటనే ఆమోదించి, రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందేలోగా ఆయన ప్రజలలోకి వెళ్లి మరికొంత మైలేజీ పొందేలా చేయవచ్చును.