భూ వివాదాలకు దూరంగా ఉండండి.. పార్టీ నేతలను హెచ్చరించిన కేసీఆర్

 

భూవివాదాల్లో తలదూర్చి.. సమస్యలను కొనితెచ్చుకోవద్దంటూ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను ఆదేశించారు కేసీఆర్.  మీ కుటుంబ సభ్యులుంటే పరిష్కరించుకోవాలి కానీ ఒకవేళ వేరే వాళ్ల విషయాల్లో జోక్యం చేసుకుంటే మీకే నష్టం అంటూ హెచ్చరించారు. రియల్ ఎస్టేట్ వివాదాల్లో అస్సలు జోక్యం వద్దన్నారు. ఒక్క భూమిని నలుగురైదుగురు క్లైమ్ చేస్తున్నారని.. ఏదో ఒక పక్షం వైపు నుండి వివాదాలను కొని తెచ్చుకోవద్దన్నారు. కుటుంబ సభ్యులు ఎవరైనా వివాదాస్పద భూలావాదేవీలు చేసి ఉంటే వెంటనే పరిష్కరించుకొని పక్కకు జరగాలని లేక పోతే భవిష్యత్తులో ఆ వివాదం మీ మెడకే చుట్టుకుంటుందని హెచ్చరించారు.

అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయా రెడ్డి హత్య కేసు నిందితుడుతో మాజీ ఎమ్మెల్యేకు సంబంధాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంలో విపక్ష పార్టీలు కూడా ఓ ప్రజాప్రతినిధిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నాయి. ఆ తర్వాత ఇద్దరూ కూడా తమకు సంబంధం లేదని ప్రకటనలు చేశారు. ఈ ఘటనతో సీఎం కేసీఆర్ అప్రమత్తమయ్యారు. తహశీల్దారు హత్య తరువాత గత పది రోజులుగా దాదాపు 20 మందికి పైగా ప్రజాప్రతినిధులు సీఎంను కలిశారు. వారిలో కీలకమైన వారందరిని సీఎం అప్రమత్తం చేశారు. రెవిన్యూశాఖకు సంబంధించిన అంశాలకు దూరంగా ఉండాలని నిర్దేశించారు. రియల్ ఎస్టేట్ వివాదాల్లో తలదూర్చి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని హెచ్చరించారు. 

ప్రధానంగా హైదరాబాద్ తో పాటు శివారు జిల్లాల భూముల విలువలు అమాంతంగా పెరగడంతో భూములతో ముడిపడి ఉన్న నేరాలు శిఖర స్థాయికి చేరుకుంటున్నాయి.తహసీల్దార్ విజయారెడ్డి హత్య ఘటన తరువాత రెవెన్యూ యంత్రాంగానికి డజనుకు పైగా హెచ్చరికలు వచ్చినట్లు కేసులు నమోదయ్యాయి. కొందరు కిరోసిన్, పెట్రోల్ బాటిళ్లతో కార్యాలయానికి వస్తున్నారు. ఈ నేపధ్యంలో ఒక వైపు రక్షణ చర్యలు తీసుకుంటూనే సొంత పార్టీ ప్రజా ప్రతినిధులకు నచ్చ చెప్పే పనిలో సీఎం పడ్డారు. భూవివాదాలతో ముడిపడిన విజ్ఞప్తులు వస్తే ఎండార్స్ చేసి సంబంధిత రెవెన్యూ యంత్రాంగానికి సిఫారసు చేయరాదని..భవిష్యత్తులో ఏం జరిగినా అది రికార్డుగా మారుతుందని హెచ్చరించారు. 

తెలంగాణలో రాజకీయమంతా భూ వివాదాలతోనే ముడిపడి ఉంది. హైదరాబాద్ శివారు జిల్లా లోని అపూర్వ సోదరుల్లో ఒకరు భూములు కనిపిస్తే వదలడని.. వెయ్యి ఎకరాల దాకా ఆయన ఆధీనంలో ఉందని.. ఊర్లకు ఊర్లే మాయం చేయటంలో నేర్పరి అని పేరుంది. సైకిల్ వదిలి కారెక్కిన ఐదుగురు ప్రజాప్రతినిధులు భూవివాదాల్లో సిద్ధహస్తులన్న ఆరోపణలున్నాయి. ఒకరికి దాదాపు వంద ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉందని చెబుతున్నారు. మరో ప్రజాప్రతినిధి అయితే శిఖం భూములనూ వదిలిపెట్టరని.. అందుకే చెరువుల్లో ఆయన సంస్థల నిర్మాణాలు ఉంటాయని ప్రచారంలో ఉంది. ఇంకో ఎమ్మెల్యే అయితే వంద గజాల స్థలం కూడా వదిలిపెట్టరని ప్రతి భూ వివాదంలో ఆయన పేరు పెడతారని విమర్శ లున్నాయి.