కవిత సైలెన్స్ కి రీజనేంటి? కేసీఆర్ తీసుకున్న సంచలన నిర్ణయమేంటి?

 

ఈవీఎంలైనా, బ్యాలెట్ పేపరైనా తనకు తిరుగులేదని అసెంబ్లీ అండ్ లోకల్ ఎలక్షన్స్ లో రుజువు చేసుకుంది టీఆర్ఎస్. అయితే, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం గులాబీ పార్టీ లెక్క తప్పింది. ఎవరూ ఊహించనివిధంగా బీజేపీ ఏకంగా నాలుగు స్థానాలను కైవసం చేసుకుంటే, కాంగ్రెస్ కూడా మూడు సీట్లను గెలుచుకుని ఫర్వాలేదనిపించుకుంది. ఇక కారు-సారు(కేసీఆర్)-పదహారు అంటూ బరిలోకి దిగిన టీఆర్ఎస్... 9 సీట్ల దగ్గరే ఆగిపోయింది. ఆ తొమ్మింటిలోనూ రెండు స్థానాలను బొటాబోటీ మెజారిటీతో దక్కించుకుంది. ఇదంతా పక్కనబెడితే కేసీఆర్ కు అత్యంత ఆప్తుడైన వినోద్ కుమార్ కరీంనగర్ లో... కూతురు కవిత నిజామాబాద్ లో దారుణ పరాజయం పాలవడంతో గులాబీ బాస్ షాక్ తిన్నారు. అయితే, తన కూతురుపై ప్రజాగ్రహాన్ని ముందే గుర్తించిన కేసీఆర్... కవిత గెలుపు కోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. నిజామాబాద్ లో పట్టున్న మండవ లాంటి లీడర్లను అప్పటికప్పుడు పార్టీలోకి రప్పించి కవితను గట్టెక్కించేందుకు ప్రయత్నించారు. అయినాసరే నిజామాబాద్ ప్రజలు కేసీఆర్ అండ్ కవితకు తిరుగులేని షాకిచ్చారు. అయితే, ఓటమి తర్వాత సైలెంటైపోయిన కవిత భవిష్యత్ ఏంటనే చర్చ టీఆర్ఎస్ లో సాగుతోంది.

కవిత ఓటమిని కేసీఆర్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. జాతీయ స్థాయిలో మెరుపులా మెరిసి, ఇప్పుడు సైలెంటైపోవడంతో ఆమె అభిమానులకు మింగుడుపడటం లేదు. అయితే, కరీంనగర్ లో ఓడిపోయిన వినోద్ కుమార్ ను కేబినెట్ ర్యాంకున్న తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించిన కేసీఆర్.... కూతురు కవితకు కూడా కేబినెట్ ర్యాంక్ హోదా కలిగిన కీలక పదవిని అప్పగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కవితను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని, అలాగే పార్టీకి-ప్రభుత్వానికి మధ్య కో-ఆర్డినేషన్ బాధ్యతలు అప్పగిస్తారన్న చర్చ సాగుతోంది. 

అయితే, రాష్ట్ర రైతు సమన్వయ సమితి ఛైర్ పర్సన్ గా కవితను నియమిస్తారనే ప్రచారం ఎక్కువగా వినిపిస్తోంది. కేబినెట్‌ ర్యాంకున్న ఈ పదవిని, కవితకు ఇస్తే బాగుంటుందన్న చర్చ తెలంగాణ భవన్‌లో జరుగుతోంది. నిజామాబాద్‌లో కవిత ఓడిపోవడానికి రైతుల ఆందోళనే ముఖ్య కారణం. అందుకే, రైతులతో మరింత మమేకమయ్యేందుకు, ఈ పదవి ఉపకరిస్తుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు. మరి రాష్ట్ర మంత్రిగా కేబినెట్ లో వెళ్తారా? లేక పార్టీకి, ప్రభుత్వానికి కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తారా? లేదంటే రైతు సమన్వయ సమితి ఛైర్ పర్సన్ గా కొత్త బాధ్యతలు చేపడతారో చూడాలి.