అమరావతి నిర్మాణం దండగ.. జగన్ కి కేసీఆర్ సూచన!!

 

ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా అమరావతి గురించే చర్చ జరుగుతోంది. ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజధానిని మారిస్తే ఊరుకునేది లేదని విపక్షాలు హెచ్చరిస్తుంటే.. అధికార పార్టీ మాత్రం రాజధానిగా అమరావతి ఎంపిక సరైన నిర్ణయం కాదని అంటోంది. అలా అని రాజధాని గురించి స్పష్టమైన ప్రకటన చేయలేదు. దీంతో రాజధాని సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏపీ రాజధాని అమరావతి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం దండగని, అదో 'డెడ్ ఇన్వెస్టిమెంట్' గా మిగిలిపోతుందని చంద్రబాబుకు అప్పుడే చెప్పా! ఇప్పుడేమయింది?. అంటూ..  కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో వ్యాఖ్యానించారు. కేసీఆర్ వ్యాఖ్యలు ఏపీలో హాట్ టాపిక్‌గా మారాయి. అసలే అమరావతి పనులు నిలిచిపోయాయి. దీంతో అనేక మంది అమరావతి నిలిపివేయడం ఓ చెడ్డ నిర్ణయంగా అభివర్ణిస్తుంటే.. కేసీఆర్ మాత్రం అమరావతి కట్టవద్దని అప్పుడే చెప్పానని, ఇప్పుడేమైందో చూడండి అనడం చర్చనీయాంశమైంది.

సీఎంలు కేసీఆర్, జగన్ కొంత కాలంగా బాగా సన్నిహితంగా ఉంటున్నారు. మరి చంద్రబాబుకే అమరావతి వద్దని చెప్పిన కేసీఆర్.. అంత సన్నిహితంగా ఉంటున్న జగన్ కి చెప్పకుండా ఉంటారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలు కేసీఆర్ సలహాలతోనే.. అమరావతి నిర్మాణాన్ని జగన్ నిలిపివేసి ఉంటారని కూడా ఇప్పటికే ఏపీలో చర్చ ప్రారంభమయింది. ఇప్పటికే అమరావతి విషయంలో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇప్పుడు కేసీఆర్ ప్రకటనతో ఆ ఆందోళన రెట్టింపు అయ్యే అవకాశముంది. మరి జగన్ ఈ వ్యవహారంపై ఎప్పుడు మౌనం వీడతారో? రాజధాని సస్పెన్స్ కి ఎప్పుడు తెర దించుతారో చూడాలి.