ఆదాయమైన వదులుకుంటా, జనం ప్రాణాలు నాకు ముఖ్యం

* సఫాయన్న సేవకు చేతులెత్తి నమస్కరిస్తాడు 
* బతుకుంటే బలుసాకైనా తినొచ్చంటడు 

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద రెండు రోజుల పాటు నిరంతరాయంగా సోషల్ మీడియా లో చర్చ..ఆయన నిరాఘాట, నిరుపమాన శబ్ద ప్రకటన మీద అన్ని సోషల్ మీడియా వేదికలు విస్మయం వ్యక్తం చేయటం... ఈ మధ్య కాలం లో ఎక్కడా చూడలేదు, వినలేదు కూడా.. సోషల్ మీడియా ను మోడీ మ్యానియా కమ్మేసిన వేళ, వాస్తవాల ప్రకటన తో, విస్తుపోయే నిజాలతో ఆయన విసిరిన మాటల మంత్రదండం ముందు చాలా మంది నాయకుల వాక్పటిమ వెలవెలపోయింది. ఎందుకంటే, ఆయన మాటల్లో నిజాయితీ ఉంది కాబట్టి, నిజముంది కాబట్టి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులలో -టంగుటూరి ప్రకాశం పంతులు, ఎన్ టీ రామారావు ల తర్వాత, సామాన్యుడిని ఆకట్టుకునే నాయకత్వ పటిమను సాంతం సొంతం చేసుకున్న ముఖ్యమంత్రిగా కె సి ఆర్ చరిత్ర సృష్టించారు. ఇది పొగడ్త కాదు, ప్రశంసా కాదు... సోషల్ మీడియా ఎనాలిసిస్. 

సిబ్బందిని మోటివేట్ చేయడంలో, ప్రత్యర్థులకు వార్నింగ్ ఇవ్వడంలో, వినేవాళ్ళకి విసుగు రాకుండా మాట్లాడటంలో ఆయనకు పోటీ లేదు.... ఎదురు ఒక్క పేపర్ ఉండదు.., ఒక్క నోట్ ఉండదు.... తడబాటు ఉండదు... చెప్పాల్సింది సూటిగా, సుత్తి లేకుండా....జనానికి అర్థం అయ్యేలా....భరోసా ఇచ్చేలా....ఇంగ్లీష్, హిందీ, తెలుగు అన్ని భాషల్లో.... ఇంకో బైట్ అని అడిగే పని కూడా ఉండదు. అది ఆయన గొప్పతనం.. అది ఆయన దక్షత. ఇదేదో ఆయన్ను పొగిడే ప్రహసనం కాదు. కరోనా లాక్ డౌన్ విషయం లో మరో రెండు వారాలు కొనసాగించాలని కుండబద్దలు కొట్టిన కె సి ఆర్, బతికుంటే బలుసాకు తిందామంటూ చెప్పుకొచ్చిన తీరు, ఈ పదిహేను రోజుల్లో తెలంగాణ 435 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయిందని చెపుతూనే, ప్రజల ప్రాణాల కాన ఆర్ధిక మాంద్యం తనకు లెక్క కాదని తేల్చిపారేశారు. ఈ 15 రోజుల్లో తెలంగాణ కు కేవలం రెండు కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందనీ, అయినా కూడా జనాన్ని బతికుంచుకోవటమే తనకు ముఖ్యమని స్పష్టం చేసిన ఆయన నాయకత్వం దేశాన్ని ఆకట్టుకుంది. నరేంద్ర మోడీ వారాంతపు కార్యక్రమాలలో ఒవైసీ కి కనిపించిన ఎంటర్టైన్మెంట్, కె సి ఆర్ అనర్గళ ఉపన్యాసం లో కనిపించకపోవటానికి కారణం ఏమిటంటే, ఈయన జనం బాగు కోరుకుని లాక్ డౌన్ కొనసాగించాలని చెప్పటం. తాను మాట్లాడుతున్న అంశం మీద విపరీతమైన అధారిటీ, కాగితాలు చూసి చదివే అలవాటు ఏ మాత్రం లేని క్షుణ్ణమైన పరిజ్ఞానం, ఎదుటివాడు ప్రశ్నించటానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వని కూలంకుష పరిశోధన కె సి ఆర్ కు పెట్టని ఆభరణాలు.

ప్రజలను మానసికంగా సిద్ధం చేయటానికి ఆయన వారి మీద ఎలాంటి ఒత్తిడీ చేయలేదు. ఉన్న వాస్తవాలను మాత్రమే అందరిముందూ పరిచారు. సామాన్యుడికి అర్ధమయ్యే భాషలో చెప్పారు.. ఈ సాహసోపేత కార్యక్రమంలో సేవలందిస్తున్న డాక్టర్లందరికీ, నర్సులు, పారిశుధ్య కార్మికులు అందరికీ మొక్కుతున్నానంటూ ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి కె సి ఆర్. కష్ట కాలంలో ప్రజలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని కె సి ఆర్ మోటివేట్ చేసిన తీరు తో దేశం యావత్తూ చకితమై చూసింది. 

సోషల్ మీడియా అనలిటిక్స్ అంతా కూడా కె సి ఆర్ లోని వినూత్న కోణాన్ని తమకర్ధమైన భాషలో అనువదించే పనిలో బిజీ అయిపొయింది. ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక నవీన్ పట్నాయక్, ఒక మమతా  బెనర్జీ, ఒక అరవింద్ కేజ్రీ వాల్, ఒక  నితీష్ కుమార్..మీరందరూ కూడా అద్భుతంగా శ్రమిస్తూ ఉండవచ్చు గాక.. కానీ, ఒక కె సి ఆర్ దగ్గరున్న మోటివేషన్ టెక్నాలజీ మాత్రం మీ దగ్గర లేదనేది సోషల్ మీడియా ఎనాలిసిస్. అంతే కాదు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మీద సోషల్ మీడియా వేసిన సెటైర్ల పైన కూడా కె సి ఆర్ విరుచుకుపడటాన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ విస్తారంగా చర్చించాయి. సంక్షోభ సమయం లో దేశ ప్రధాని కి దన్నుగా నిలబడటం ద్వారా కె సి ఆర్, సరైన రాజకీయ స్ఫూర్తిని ప్రదర్శించారని, సఫాయన్న నీకు సలామన్నా అంటూ వినమ్రపూర్వక విజ్ఞప్తి చేయటం ద్వారా జన హృదయాన్ని చూరగొన్నారని కూడా సోషల్ మీడియా వేదికలు ప్రశంసించాయి. భేష్ కె సి ఆర్.. మీ స్ఫూర్తి మా గుండెలకు ఊపిరినిచ్చింది. రేపటి మీద ఆశ చిగురింప చేసింది.