గండం నుంచి గట్టెక్కేందుకా.. కేటీఆర్ కోసమా? ఫిబ్రవరిలో కేసీఆర్ మరో యాగం?

తెలంగాణ ప్రభుత్వంలో ప్రక్షాళన జరగబోతుందని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి పగ్గాలను కేటీఆర్ కు అప్పగించేందుకు కేసీఆర్ సిద్దమవుతున్నారని కొందరు... సీఎం మార్పు ఉండదు కాని ప్రస్తుత మంత్రివర్గంలో కొందరిని తొలగించి కొత్తవారిని తీసుకుంటారని మరికొందరు చెబుతున్నారు. ఇటీవల పాలనలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు అధికార పార్టీకి వ్యతిరేకంగా మారాయి. దుబ్బాక అసెంబ్లీ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు రావడానికి ఇవే కారణమనే చర్చ కూడా టీఆర్ఎస్ లో జరుగుతోంది. మార్చిలోపు కేటీఆర్ సీఎం ఖావడం ఖాయమని డిసెంబర్ లో పెద్ద ఎత్తున చర్చ జరిగినా.. మళ్లీ అంతా సైలెంట్ అయ్యారు. సీఎం మార్పుపై కేసీఆర్ యూ టర్న్ తీసుకున్నారని ప్రచారం జరిగింది. అయితే తాజాగా సీఎం కేసీఆర్ మరో యాగం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారనే సమాచారం వస్తోంది. దీంతో యాగం తర్వాత కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకోవచ్చనే చర్చ మళ్లీ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. 

కేసీఆర్ ఆధ్యాత్మిక అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు. భక్త విశ్వాసాలను పాటిస్తూ యాగాలు, హోమాలు ఎక్కువగా చేస్తారు. అందుకే యాదాద్రి పునర్ నిర్మాణానికి ఆయన శ్రీకారం చుట్టారు.  కేసీఆర్ కలలుగన్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఫిబ్రవరి లేదా మార్చిలో ఆలయాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. త్వరలోనే ఆలయ ప్రారంభోత్సవ తేదీలను ఖరారు చేయనున్నారు. యాదాద్రి ఆలయం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీలతో పాటు దేశంలోని ప్రముఖులను ఆహ్వానించే యోచనలో కేసీఆర్ ఉన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా సుదర్శన యాగంతో పాటు చండీయాగం, రాజశ్యామలయాగం చేసే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. ఈ క్రతువు ముగిసిన తర్వాత తన కుమారుడు కేటీఆర్ కి సీఎంగా పట్టాభిషేకం చేసి, ఆ బాధ్యతల నుంచి కేసీఆర్ వైదొలగుతారని విశ్వసనీయంగా తెలుస్తోంది. జనవరి మొదటి వారంలోనే కేటీఆర్ కు సీఎం బాధ్యతలను అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఇచ్చే కేసీఆర్.. యాదాద్రి అలయాన్ని ప్రారంభించడంతో పాటు యాగం చేసిన తర్వాత కేటీఆర్ ను సీఎం చేయడం మంచిదని భావించినట్టు చెబుతున్నారు. 

కేసీఆర్ మరో యాగం చేయాలని నిర్ణయంచడంపై ఇంకో ప్రచారం కూడా జరుగుతోంది.  మొదటి నుంచి కేసీఆర్‌ ఏ పని తలపెట్టినా పండితుల సలహాలు తీసుకుంటారు. ఆలయాల సందర్శన తర్వాతనే ముందడుగు వేస్తారు. తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొన్ని రోజులకే  2015లో ఎర్రవల్లిలోని తన సొంత ఫామ్ హౌజ్‌లో ఆయుత చండీయాగాన్ని నిర్వహించారు. ఆ తర్వాత 2018లో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళేముందు అధికారంలోకి మళ్లీ రావాలంటూ రాజశ్యామల యాగాన్ని జరిపించారు. గెలిచిన తర్వాత 2019 జనవరిలోనూ అదే తరహా యాగాన్ని నిర్వహించారు. అయితే  ఆ యాగ సమయంలో చేసిన తప్పిదం వల్లే కేసీఆర్ కు గతంలో ఎప్పుడు లేనంతగా సమస్యలు వచ్చాయని పండితులు పక్కాగా చెబుతున్నారు. మళ్ళీ యాగం చేసి పరిహారం సమర్పించుకుంటే తప్ప కేసీఆర్ కు మంచి రోజులు రావని చెప్పారట. అందుకే కేసీఆర్ మరో యాగం చేయడానికి సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. 

 2019 జనవరి 21 నుంచి కేసీఆర్ మూడో సారి  యాగాన్ని నిర్వహించారు. అయితే జనవరి 22వ తేదీన కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కుమారుడు మయాంక్ పెళ్ళి రిసెప్షన్ కార్యక్రమానికి ఢిల్లీకి వెళ్ళారు. ఆ సమయానికి చండీయాగం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీక్ష తీసుకున్న తర్వాత పూర్తిచేయకుండా మధ్యలో ఢిల్లీ వెళ్ళిడం వల్లే ఆయనకు చెడు జరుగుతుందని కొందరు పండితుల మాట. యాగం మొదలుపెట్టిన తర్వాత అది పూర్తిగా ముగిసేంత వరకు ఆ పరిధి దాటి బైటకు వెళ్ళరాదన్నది నియమం. కానీ కేసీఆర్ ఢిల్లీ వరకు విమానంలో వెళ్ళి  వచ్చారు. ఇది యాగ సంప్రదాయానికి విరుద్ధమంటున్నారు. అప్పటి నుంచే కేసీఆర్ కు  కలిసి రావడం లేదని,  2019 జనవరి 21వ తేదీన తలపెట్టిన చండీయాగం నుంచే ఆయనకు  వరుస దెబ్బలు తగులుతున్నాయని చెబుతున్నారు. దుబ్బాక అసెంబ్లీ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, ఎల్ఆర్ఎస్, ధరణి పోర్టల్ అమలులో బ్యాక్ స్టెప్ వంటి ఘటనలకు వారు ఇందుకు ఉదహరిస్తున్నారు. పండితుల సూచనల మేరకే ఈ గండం నుంచి గట్టెక్కేందుకే తెలంగాణ ముఖ్యమంత్రి మరో యాగం చేయబోతున్నారని చెబుతున్నారు.