కేసీఆర్ దాచిన రెండు సీక్రెట్ పథకాలు...

తెలంగాణ అసెంబ్లీలో ఆదివారం ముఖ్యమంత్రి కె.సి.ఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా రెండు స్కీములు ఉన్నాయని, అవి పెడితే మీ పని ఖతమేనని, అవి అమలైతే గతంలో చెప్పినట్లుగా రెండు మూడు సార్లు గెలుస్తాం అంటూ ధీమాతో కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్. ఇప్పుడు ఆయన దాచిన ఆ రెండు అద్భుత పథకాలు ఏంటి, వాటిని అమలు చేస్తే కేసీఆర్ కు అధికారం మళ్లీ వస్తుందా, ఇంతకీ కేసీఆర్ దాచిన పథకాలు ఏంటని తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ బీజేపీ, కాంగ్రెస్ విమర్శల వర్షం గుప్పించారు.

అమావాస్య, పౌర్ణానికి వచ్చి లొల్లిచేసే బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవన్నారు. కాంగ్రెస్ అసలు తమకు పోటీనే కాదంటూ గడిచిన ఎన్నికలకు, ఈ ఎన్నికలకు ఎవరి బలం తగ్గిందో తెలుసుకోండని లెక్కలు చెప్పారు. కేసీఆర్ అంత ధీమాగా ఆ రెండు పథకాల గురించి చెప్పడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. కేసీఆర్ అమ్ముల పొదలోని అస్త్రాలు తెలంగాణ అంతటా ఉచిత వైద్యం, యువతకు ఉద్యోగాల కల్పన అనే చర్చ గులాబీ ముఖ్యుల వర్గాల్లో సాగుతోందని సమాచారం. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 3.5 కోట్ల మంది మొత్తం జనాభాకు అందరికీ ఉచిత వైద్యం అందిస్తే ఎంత లెక్క అవుతుందని కె.సి.ఆర్ ఆరా తీశారట.

పేదలకు ఉచితంగా ఉన్నత వర్గాలకు కొంత మొత్తం వసూలు చేసి హెల్త్ కార్డులు ఇచ్చి తెలంగాణ వ్యాప్తంగా ఉచిత వైద్యం అందించేందుకు కేసీఆర్ ఇప్పటికే దీనిపై నివేదికలు, అంచనాలూ, ఖర్చు లెక్కను తెప్పించుకున్నారట. వచ్చే 2024 ఎన్నికల ముందర ఈ అద్భుత పథకాన్ని ప్రవేశ పెట్టి మళ్లీ అధికారంలోకి వచ్చే స్కెచ్ గీసినట్టు తెలిసింది. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన, తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగుల లెక్కలు తీసి పరిశ్రమలతో కలిసి ప్రభుత్వం నడిపించే అన్నిట్లోనూ, ప్రైవేటు పరిశ్రమల్లోనూ ప్రభుత్వమే రిక్రూట్ చేసే కొత్త పథకాన్ని కేసీఆర్ రూపొందించారట.
వైన్ షాపులు, రేషన్ షాపులు ఇతర ప్రభుత్వ సేవలన్నింటినీ యువతకు అప్పగించేందుకు ప్లాన్ చేశారట. ఖాళీగా ఉండే వారికి నెలకు నిరుద్యోగ భృతి ఇస్తారట. ఈ రెండు పథకాలకు బడ్జెట్ కొరతతో కేసీఆర్ ప్రస్తుతానికి పక్కన పెట్టినప్పటికీ భవిష్యత్లో అధికారంలోకి రావటానికి ఇవే సోపానాలని భావిస్తున్నారట. కేసీఆర్ దాచిన రెండు సీక్రెట్ పథకాలు ఇవేనంటూ ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.