కేసీఆర్ కి కోపం తెప్పించిన శ్రీధర్‌బాబు

 

తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడితే చాలా బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఆర్థిక సర్వేను సభలో ప్రవేశపెట్టలేకపోయారని విమర్శించారు. మన ఆర్థిక పరిస్థితులు రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే దిక్సూచి ఆర్థిక సర్వే అని చెప్పారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురాలేకపోయారని విమర్శించారు. హామీలను సాధించలేకపోయారన్నారు. నాలుగేళ్లలో రూ.90వేల కోట్లు అప్పులు చేశారని, రాష్ట్రంలో ఉన్న విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలన్నీ కాంగ్రెస్‌ హయాంలో ప్రారంభించినవేనని పేర్కొన్నారు. విద్యుదుత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఇంకా ఆచరణలోకి రాలేదన్నారు. 14వ ఆర్థిక సంఘం నుంచి పంచాయతీలకు నిధులు వస్తే.. విద్యుత్‌ బకాయిలకు తిరిగి తీసుకున్నారని ఆరోపించారు. రైతులకు నాలుగు దఫాలుగా రుణమాఫీ చేశారని.. ఎర్రజొన్న, పసుపు రైతులు ఆందోళన చేస్తున్నారని అన్నారు. రైతు బంధు పథకాన్ని కౌలు రైతులకు అమలు చేయాలని కోరారు. ఉద్యోగులకు ఐఆర్‌ ఇవ్వలేదని విమర్శించారు.

దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్‌ శ్రీధర్ బాబుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పంచాయతీల నుంచి ఎలాంటి నిధులు తీసుకోలేదని స్పష్టం చేశారు. స్థానిక సంస్థలను అద్భుతంగా, కీలకంగా తీర్చిదిద్దే బాధ్యత తమదేనన్నారు. కాంగ్రెస్‌ హయాంలో రాష్ట్రంలో సౌర విద్యుత్‌ ఉందా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3600 మెగావాట్ల సౌరవిద్యుత్‌ ఉత్పాదన జరుగుతోందని వెల్లడించారు. తలసరి విద్యుత్‌ వినియోగంలో దేశంలోనే తెలంగాణ ప్రథమస్థానంలో ఉందని గుర్తు చేశారు. స్థానిక సంస్థల బకాయిలు కాంగ్రెస్‌ హయాంలోనివేనని, వాటిని కూడా త్వరలో తీర్చేస్తామని చెప్పారు. శ్రీధర్‌బాబు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. గతంలో కొనసాగిన అరాచకాల్ని వందకు వంద శాతం కొనసాగించబోమని చెప్పారు.