ముహూర్తం ఖరారు.. ఆర్టీసీపై తుది నిర్ణయం ప్రకటించనున్న ప్రభుత్వం

 

రవాణా శాఖ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఆర్టీసీ సమస్యల పై చర్చలు జరుపుతున్నారు. క్యాబినెట్ కు ముందే సమీక్ష నిర్వహించడంతో ఆర్టీసీ సమస్యకు కేసీఆర్ పుల్ స్టాప్ పెట్టే యోచనలో ఉన్నట్లు కనిపిస్తుంది. నవంబర్ 28 న ఆర్టీసీ ఏజెండాతో చేపట్టిన సమావేశం జరగబోతుంది. ఆ రోజు పూర్తి అవ్వకపోతే 29వ తేదిన కూడా సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి.. ఆర్టీసీ అధికారులు అదే విధంగా రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కూడా సమావేశమయ్యారు. త్వరలో జరిగే కేబినెట్ సమావేశం ముందు ఉంచే ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ నివేదికపై లోతుగా చర్చించారు. 

సమ్మె విరమిస్తున్నామని ప్రకటించిన ఆర్టీసీ కార్మికులు ఉదయం నుంచే డిపోల వద్దకు చేరుకున్నారు. 52 రోజుల పాటు సమ్మె కొనసాగించిన కార్మికులు జేఏసీ సూచనలతో డిపో వద్దకు వచ్చారు. అయితే కార్మికులెవరూ డిపోలకు రావద్దని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని ఆర్టీసీ ఎండీ నిన్నే స్పష్టం చేశారు. భారీగా డిపోలకు చేరుకుంటున్న కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ముందు జాగ్రత్త చర్యగా కార్మికులను అరెస్టు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల ముందు భారీగా బలగాల ను మోహరించారు. బ్యారికేడ్ లను ఏర్పాటు చేసి కార్మికులను అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం మేరకు ఆర్టీసీ కార్మికులే ఒక అడుగు వెనక్కు తగ్గారు. ఇంకా రెండు రోజుల గడువులో విషయం పూర్తిగా తెలుస్తుందని భావించి డిపోల వద్ద ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించారు. డిపోల వద్ద పరిస్థితి కూడా కుదుట పడింది. నవంబర్ 28, 29 తేదీలల్లో అసలు కార్మికులను మళ్ళీ విధుల్లోకి చేర్చుకుంటారా లేదా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనే విషయంపై చర్చలు జరుగుతున్నా.. కార్మికుల్లో మాత్రం ఆందోళన.. ఉత్కంఠత రెండు కనిపిస్తున్నాయి.