లాక్‌డౌన్‌ను మ‌రో రెండు వారాలు పెంచండి!

15వ తేదీ త‌రువాత కూడా లాక్‌డౌన్‌ను కొన‌సాగించాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌ధాన‌మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు. మ‌రో రెండు వారాలు లాక్‌డౌన్ పెంచ‌మ‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. దేశంలో క‌రోనా కంట్రోల్‌లో వుందంటే లాక్‌డౌన్ వ‌ల్లే సాధ్యం అయింది ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. లాక్‌డౌన్‌తోనే దేశాన్ని ర‌క్షించుకున్నాం. లాక్‌డౌన్ పెంచితే ముఖ్య‌మంత్రిగా నా మ‌ద్ద‌తు వుంటుందని కేసీఆర్‌ అన్నారు. లాక్‌డౌన్ తో తెలంగాణా 2 వేల 500 కోట్ల ఆదాయం కోల్పోయింది. అయినా వేరే మార్గం లేదు. ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడ‌డం ముఖ్యం. లాక్‌డౌన్ ఎంత గ‌ట్టిగా పాటిస్తే అంత లాభం వుంటుంద‌ని ముఖ్య‌మంత్రి అన్నారు.

నిజాముద్దీన్ వెళ్లిన వ‌చ్చిన‌వారు ఇంకెవ‌రైనా మిలిగి వుంటే వెంట‌నే మీ స‌మాచారం వైద్య అధికారుల‌కు ఇవ్వ‌మ‌ని ముఖ్య‌మంత్రి మ‌రో సారి విజ్ఞ‌ప్తి చేశారు.

ఈ యుద్దంలో త‌మ ప్రాణాల్ని లెక్క చేయ‌కుండా వైద్య సిబ్బంది ప‌నిచేస్తోంది. మెడిక‌ల్ స్టాఫ్ ప్ర‌తి ఒక్క‌రికి స్వీప‌ర్ నుంచి డైరెక్ట‌ర్ వ‌ర‌కు రాష్ట్ర ప్ర‌జ‌ల త‌ర‌ఫున పాద‌భివంద‌నం చేస్తున్నాన‌ని సి.ఎం. వైద్య సిబ్బంది సేవ‌ల్ని ప్ర‌శంసించారు.

దేశంలో మందుల కొర‌త ఎక్క‌డా లేదు. గాంధీ ఆసుప‌త్రిలో క‌రోనా పాజిటివ్‌తో 308 మంది చికిత్స పొందుతున్నారని సి.ఎం. చెప్పారు. జూన్ 3వ తేదీ వ‌ర‌కు క‌రోనా పాజిటివ్‌ల సంఖ్య భార‌త్‌లో కీల‌క‌ద‌శ‌కు చేరుతుంద‌ని స‌ర్వేలు హెచ్చ‌రిస్తున్నాయ‌ని ముఖ్య‌మంత్రి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా ఆరోగ్య‌శాఖ 18 వేల బెడ్స్ సిద్ధం చేసింది. ఎవ‌రికైతే పాజిటివ్ వ‌చ్చిందో వారు గాంధీ ఆసుప‌త్రిలో ఉండాల్సిందే. డ‌బ్బున్న‌వారైనా, పేద‌వారైనా మిన‌హాయింపులేదు. ఐసొలేష‌న్ బెడ్స్‌ను రాష్ట్రంలో గుర్తించిన ఎనిమిది ఆసుప‌త్రుల్లో ఏర్పాటు చేసిన‌ట్లు ముఖ్య‌మంత్రి చెప్పారు.

వైద్య‌శాఖ‌లో ప‌నిచేస్తున్న వారి మూల‌వేత‌నంలో 10 శాతం అద‌నంగా సి.ఎం. గిఫ్ట్ గా అద‌న‌పు వేత‌నాన్ని సి.ఎం. ప్ర‌క‌టించారు. ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక ప్రోత్స‌హం కింద 7 వేల 500 రూపాయ‌లు జిహెచ్ ఎంసి, హెచ్ ఎండిఏ, మున్సిపాల్టీల్లో ప‌నిచేసే పారిశుద్ధ కార్మికుల‌కు 5 వేల రూపాయ‌లు ప్ర‌క‌టించారు.

వైద్యం, స్వ‌యంనియంత్ర‌ణ‌, పారిశుద్ధ్యం చాలా ముఖ్యం. క‌రోనా బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడ‌డంలో సైన్యంలా ప‌నిచేస్తున్నారు. ఈ సేవ‌ను అలాగే కొన‌సాగించాలి. ప్ర‌జ‌లను కాపాడాలి. ఖ‌ర్చు ఎంత అయినా ఈ రోజూ రిలీజ్ చేసి అందిస్తార‌ని సి.ఎం. తెలిపారు.

చిల్ల‌ర గాళ్లు చేసే పిచ్చి ప్ర‌చారాలు, కొన్ని ప‌త్రిక‌లు పిచ్చి రాత‌లు రాస్తున్నారు. క‌నీసం సంస్కారం లేకుండా రాస్తున్నారు. ఈ స‌మ‌యంలో మ‌నోధైర్యం క‌ల్పించాల్సింది పోయి వెకిలి రాత‌లు రాస్తున్నారు. వీరు దేశాన్ని కాపాడుతారా? దుర్మార్గం, అలాంటి వారికి శిక్ష త‌ప్ప‌దు. అబ‌ద్దాల్ని ఎందుకురాస్తావు. ఎన్ని సార్లు విజ్ఞ‌ప్తి చేసినా త‌ప్పుడు రాత‌లు రాస్తున్నారు. నిద్ర‌లేని రాత్రులు గ‌డుపుతున్నాం. వ‌క్ర‌బుద్ధి వున్న‌వారికి క‌రోనా త‌గ‌లాలి అని ముఖ్య‌మంత్రి శాప‌నార్థాలు పెట్టారు. ఇంకా స‌మ‌యం వుంది. ఎన్నిక‌ల‌ప్పుడు చూసుకుందాం. ఇప్పుడు రాజ‌కీయాలొద్దు. ప్ర‌పంచ‌మాన‌వాళికి ప్ర‌త్యేక ప‌రిస్థితి ఇది. లోకం ఆగ‌మ‌వుతుంటే శ‌వాల మీద పేలాలు వెతుక్కుంటున్నారు. ఈ దుర్మార్గుల‌ను వ‌దిలి పెట్ట‌ను. దేశ ద్రోహులు వీరు. ఇప్ప‌ట్టికైనా ఆగాలి. లేక‌పోతే శిక్ష ఖ‌త‌ర్‌నాక్ వుంటుందని సి.ఎం. హెచ్చ‌రించారు. అవ‌గాహ‌న రాహిత్యంతో త‌ప్పుడు రాత‌లు రాసేవారికే నేను విడిచిపెట్ట‌న‌ని సి.ఎం. హెచ్చ‌రించారు.

సోష‌ల్ మీడియా లో కొంత మంది వింత చేష్ట‌లు చేస్తున్నారు. ఇదేం సంస్కారం. ప్ర‌ధాని దీపం వెలిగించ‌మ‌న్నారు. దీనికి కూడా రాజ‌కీయం చేయ‌డం దారుణం. జాతి ఐక్య‌త‌ను చాట‌డానికి ఇలాంటి చ‌ర్య‌లు ఉప‌యోగ‌ప‌డుతాయి. అంద‌రూ క‌లిసి స‌మైక్యంగా ఉద్య‌మించ‌డానికి పి.ఎం. పిలుపునిచ్చారు. దీపంతో దేశ ప్ర‌యోజ‌నం వుంది. అలాంటి వారిని స‌మాజం క్ష‌మించ‌దని సి.ఎం. కేసీఆర్ మండిప‌డ్డారు.