ఒకరిద్దరి వల్లే ప్రభుత్వానికి చెడ్డపేరు... క్లాస్‌ పీకిన చంద్రబాబు

 

మంత్రులు, అధికారులకు చంద్రబాబు క్లాస్ పీకారు. ప్రభుత్వం ఎంత బాగా పని చేస్తున్నా... ఒకరిద్దరి తప్పిదాలతో అందరికీ చెడ్డ పేరు వస్తోందని మండిపడ్డారు. ఒక లారీ డ్రైవర్ తప్పతాగి మూడు చెక్‌పోస్టులు దాటొచ్చి అంతమందిని బలిగొంటే... రవాణాశాఖ అధికారులు నిద్రమత్తులో జోగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక అక్రమార్కులపై ఇక నుంచి పీడీ యాక్ట్‌ పెట్టాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

 

ఉచిత ఇసుకను కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాలకు వాడకుంటున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఫైరయ్యారు. రోడ్డు ప్రమాదాలు జరగడంలో రవాణా శాఖాధికారుల తప్పిదం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఏర్పేడు ప్రమాదంలోనూ ఇదే జరిగిందన్నారు. మహబూబ్‌నగర్‌ నుంచి బయలుదేరిన లారీ మూడుకి పైగా చెక్‌పోస్టులను దాటి ఉంటుందని, ఏ చెక్‌పోస్టు దగ్గరైనా అధికారులు సరిగ్గా చెక్‌ చేసి ఉంటే, లారీ డ్రైవర్‌ తాగి ఉన్నాడన్న విషయంగానీ, లేదంటే క్లీనర్‌ బండి నడుపుతున్న విషయంగాని బయటపడేదన్నారు. ఏర్పేడు ఘటన పూర్తిగా రోడ్డు ప్రమాదమే అయినా ఇసుక మాఫియా అరాచకాల కారణంగానే అక్కడ జనం గుమిగూడి ఉన్నారన్న విషయం మర్చిపోరాదన్నారు. అక్రమ ఇసుక రవాణాని అరికట్టడంలో అధికారులు విఫలం కావడం వల్లనే ప్రజలు ఆందోళనలు చేయాల్సి వచ్చిందన్నారు చంద్రబాబు. అక్రమ ఇసుక రవాణాదారులపై పీడీ యాక్ట్‌ ప్రయోగించాలన్నారు. ఇసుక తవ్వకాలపై నేరుగా జిల్లా కలెక్టర్లే బాధ్యత వహించాలని...అలాగే ఉచిత ఇసుకను గనులు, రెవెన్యూ, హోంశాఖా మంత్రులు మగ్గురు కలిసి పర్యవేక్షించాలన్నారు.

 

ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినా, ఒకరిద్దరి తప్పిదాలతో అదంతా గాల్లో కలిసిపోతోందని చంద్రబాబు మండిపడ్డారు. చట్టాన్ని సక్రమంగా అమలు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా ఉండటం వల్లే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్నారు. అధికారుల పనితీరు మెరుగుపర్చడం, నైపుణ్యాల వృద్ధికి మాజీ సీఎస్‌ ఎస్పీ టక్కర్‌ సేవలు వినియోగించుకోనున్నట్లు చెప్పారు.