ముఖ్యమంత్రి మార్పుకి రంగం సిద్దం అవుతోందా

 

బహుశః ఇంతవరకు రాష్ట్రాన్ని పాలించిన ఏ ముఖ్యమంత్రీ కూడా కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం ఎదుర్కొంటున్నంత అసమ్మతి ఎదుర్కోలేదేమో. అందుకు ప్రధాన కారణం ఆయన పార్టీలో, ప్రభుత్వంలో ఎవరినీ లెక్క చేయకపోవడమేనని మీడియాతో సహా అందరూ విడమరిచి చెపుతున్నపటికీ, ఆయన మాత్రం తన పద్దతీ మార్చుకోలేదు, తన దూకుడు తగ్గించుకోలేదు. బహుశః ఆయన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి నుండి ప్రేరణ పొంది, ఆవిధంగా ప్రవర్తిస్తున్నారనుకొన్నా, ఆయనలాగా అందరినీ కలుపుకుపోయే స్వభావం మాత్రం అలవరుచుకోలేక పోవడంతో అభాసుపాలవుతున్నారు. తత్ఫలితమే పార్టీలో నేడు ఈ అసమ్మతి, ఈ ముటా కుమ్ములాటలు.

 

డీయల్ రవీంద్ర రెడ్డిని పదవి నుండి అవమానకరంగా తొలగించడం, తెలంగాణా నేతలు పార్టీని వీడినప్పుడు వారిపట్ల చులకనగా మాట్లాడటం, ఉపముఖ్యమంత్రి దామోదర రాజానరసింహ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి అనేక అంశాలు పార్టీలో ఆయనకు వ్యతిరేఖ వర్గాన్ని తయారు చేసాయి. రాష్ట్ర పాలన సంగతి ఎలా ఉన్నా, ముందు డిల్లీలో ఈ పంచాయితీలకి హాజరవడానికే ఆయనకి సరిపోతోందిపుడు.

 

ఆయన డిల్లీ నుండి తిరిగి హైదరాబాద్ చేరుకోనేసరికి, ఉపముఖ్యమంత్రి దామోదర రాజానరసింహ డిల్లీ చేరుకొని, ఇప్పటికే అక్కడ తిష్ట వేసిన బొత్ససత్యనారాయణ, చిరంజీవి తదితరులతో కలిసి పార్టీ అధిష్టానానికి ముఖ్యమంత్రి పై పిర్యాదు చేయనున్నారు. ఈ అగ్నికి ఆజ్యం పోస్తునట్లు, మాజీ మంత్రి శంకర్రావు చిత్తూరు జిల్లాలో జరుగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్‌పై, దానిలో ముఖ్యమంత్రి సోదరుడి పాత్రను వివరిస్తూ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌లకు ఒక లేఖ వ్రాసారు. దీనిపై పార్టీ వెంటనే దృష్టిసారించకపోతే, ఆ తరువాత ఇదే 2జి కుంభకోణం వలె తయారయ్యి రాష్ట్రంలో పార్టీని బలి తీసుకొంటుందని ఆయన హెచ్చరించారు.

 

వీరందరూ ముఖ్యమంత్రి ని వ్యతిరేఖించడానికి ఎవరి కారణాలు వారికున్నపటికీ అందరు కలిసి ఆయన కుర్చీకి ఎసరు తెచ్చే అవకాశాలున్నాయి. అయితే, అధిష్టానం అండతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దైర్యంగా తన పద్దతిలోనే ముందుకు సాగుతుండటం విశేషం. సాదారణంగా కాంగ్రెస్ పార్టీలో చిన్నగా మొదలయ్యే ఇటువంటి అసమ్మతి వ్యవహారాలే చివరికి ముఖ్యమంత్రి మార్పుకు దారి తీస్తాయని చరిత్ర చెపుతోంది. మరి ముఖ్యమంత్రి చేజేతులా పరిస్థితిని అంతవరకు తెచ్చుకొంటారా లేక పద్ధతి మార్చుకొని అందరితో కలిసి ముందుకు సాగుతారో చూడాలి.