ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే టీడీపీకి 150 సీట్లు ఖాయం

 

ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లకు గాను.. మాకు 150 సీట్లు వస్తాయంటే, మాకు వస్తాయంటూ ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ పోటీపడి మరి చెప్తున్న విషయం తెలిసిందే. మరి ఈ రెండు పార్టీలకు ఎన్నెన్ని సీట్లొస్తాయో ఎన్నికలు జరిగి ఫలితాలు వస్తేనే కానీ స్పష్టత రాదు. అయితే కొందరు టీడీపీ నేతలు మాత్రం.. తమ పార్టీ నేత ఒకాయన ఎమ్మెల్యేగా గెలిస్తే తమకి 150 సీట్లు రావడం ఖాయమని భావిస్తున్నారట. ఇంతకీ ఆ నేత ఎవరంటే.. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి.

పోలంరెడ్డి మీద ఇటు స్థానిక కార్యకర్తలు, అటు నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమని స్థానిక నేతలు అంటున్నారు. ఒకవేళ అంత వ్యతిరేకత ఉన్న ఆయన గెలిస్తే.. ఏపీలో టీడీపీ 150 సీట్లు ఈజీగా గెలుస్తుందని ఆ నేతలు అభిప్రాయపడుతున్నారు. నియోజకవర్గంలో పోలంరెడ్డిపై ఉన్న వ్యతిరేకత తెలిసి కూడా ఆ సీటుని పోగొట్టేందుకే మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ రవిచంద్ర యాదవ్ లు పార్టీ అధినేత చంద్రబాబుని తప్పుదోవపట్టిస్తున్నారని నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. కోవూరు నియోజకవర్గంలో వైసీపీని గెలిపించేందుకు నారాయణ, రవిచంద్ర కుట్రపన్నుతున్నారని కొందరు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

టీడీపీ కంచుకోటల్లో కోవూరు నియోజకవర్గం ఒకటి. ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థులు అనేకసార్లు విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన పోలంరెడ్డి 2014 ఎన్నికల్లో కోవూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందినా ఆయనలో పాత కాంగ్రెస్ వాసన పోలేదు. కాంగ్రెస్ కార్యకర్తల్ని చేరదీసి పక్కన పెట్టుకున్నారు. వాళ్ళ పనులు చక్క పెడుతున్నారు. దీంతో ఎప్పటినుంచో టీడీపీ జెండా మోస్తూ.. పార్టీ కోసం కష్టపడిన స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తల్లో అసంతృప్తి మొదలైంది. దీంతో వారు బాహాటంగానే పోలంరెడ్డిపై విమర్శలు చేసారు. ఎవరేం అన్నా, ఎవరేం చేసినా మంత్రి సోమిరెడ్డి, నారాయణ, రవిచంద్ర వంటి నేతల ఆశీస్సులు ఉండటంతో పోలంరెడ్డి ఎలాగోలాగా బండి లాగిస్తున్నారు. అయితే ఇప్పుడు స్థానిక నేతలు, కార్యకర్తలు పొలంరెడ్డికి టికెట్ ఇవ్వొద్దని ముక్తకంఠంతో చెప్తున్నారు. అసలు ఇంత వ్యతిరేకత ఉన్న పోలంరెడ్డికి నారాయణ, రవిచంద్ర ఎందుకు మద్దతిస్తున్నారని నేతలు నిలదీస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పోలంరెడ్డికి టికెట్ ఇవ్వొద్దని అధిష్టానాన్ని కోరుతున్నారు. ఒకవేళ నారాయణ, రవిచంద్ర వంటి నేతల మాటలు నమ్మి పోలంరెడ్డికి టికెట్ ఇస్తే వైసీపీ గెలవడం ఖాయం అంటున్నారు. మరి స్థానిక నేతలు, కార్యకర్తలు ఇంతలా వ్యతిరేకిస్తున్న పోలంరెడ్డికి చంద్రబాబు టికెట్ ఇస్తారో లేదో చూడాలి.