కేసీఆర్ ని టెన్షన్ పెట్టిస్తున్న ఖమ్మం.. తుమ్మల, పొంగులేటి.. ఇద్దరిలో ఎవరో ఒక్కరే!!

 

తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రత్యేక స్థానముంది. ఇక్కడ రాజకీయాలు, ఎన్నికల ఫలితాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాలు గెలుచుకొని ఘన విజయం సాధించింది. అయితే  ఖమ్మం జిల్లాలో మాత్రం మొత్తం 10 అసెంబ్లీ సీట్లు ఉంటే.. టీఆర్ఎస్ కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. రాష్ట్రమంతా కారు టాప్ గేరులో దూసుకుపోతే.. ఖమ్మంలో మాత్రం ఫస్ట్ గేర్ లోనే బ్రేకులు పడ్డాయి. దీంతో కేసీఆర్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే అనూహ్యంగా లోక్ సభ ఎన్నికల్లో ఖమ్మం ఖిల్లాపై గులాబీ జెండా ఎగిరింది. 'సారు కారు పదహారు' అంటూ లోక్ సభ పోరుకి హుషారుగా దూసుకెళ్లిన టీఆర్ఎస్ కు.. బీజేపీ 4 స్థానాల్లో, కాంగ్రెస్ 3 స్థానాల్లో షాకిచ్చాయి. కానీ ఖమ్మంలో మాత్రం టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. దీంతో ఖమ్మం ఫలితాలు గులాబీ బాస్ కి ఎప్పటికీ అంతుబట్టని ఓ ప్రశ్నలా మిగిలిపోయాయి. ఖమ్మం జిల్లా ఫలితాలే కాదు, రాజకీయాలు కూడా కేసీఆర్ కి అంత ఈజీగా అర్థంకావట్లేదని అంటున్నారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఒక్క ఎమ్మెల్యే సీటే గెలిచినప్పటికీ.. తరువాత ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికతో బలపడింది. ఆ బలం ఎంపీ సీటు గెలవడానికి ఉపయోగపడింది. అయితే ఇప్పుడు ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ లో వర్గపోరు ఆ పార్టీ అధిష్టానాన్ని కలవరపెడుతోంది. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలలో ఎవరో ఒకరు టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.

2014 లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ తరఫున ఖమ్మం ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాస్.. తరువాత టీఆర్ఎస్ లో చేరి జిల్లాలో బలమైన నేతగా ఎదిగారు. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ సీటు ఆశించి భంగపడ్డారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో.. జిల్లాలో కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసి వారి ఓటమికి కారణమయ్యారని ఆరోపణలున్నాయి. దీంతో కేసీఆర్ ఆయనకు టికెట్ ఇవ్వకుండా.. ఎన్నిక‌ల ముందు టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన నామా నాగేశ్వ‌ర‌రావుకి టికెట్ ఇచ్చారు. దీంతో పొంగులేటి టీఆర్ఎస్ ని వీడరతారని అప్పట్లోనే ప్రచారం జరిగింది. అయితే ఆయనకు రాజ్యసభ ఇస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇవ్వడంతో పార్టీని వీడే ఆలోచనను అప్పుడు పొంగులేటి పక్కన పెట్టారని వార్తలొచ్చాయి.

మరోవైపు సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ జిల్లాలో ప‌ట్టు నిలుపుకుంటున్నారు. దశాబ్దాల రాజకీయ అనుభవం, మాజీ మంత్రి, జిల్లాలో సీనియర్ నేతగా మంచి పట్టు, తనున్న పార్టీ అధికారంలో ఉండటం.. అయితే ఇన్నున్నా తనకి ప్రస్తుతం ఏ పదవి లేకపోవడంతో తుమ్మల అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో తనకి మళ్లీ మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీని చేస్తారనుకున్నారట. కానీ కేసీఆర్ మాత్రం.. ఖమ్మం జిల్లాలో కారు గుర్తుపై గెలిచిన ఏకైక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కి మంత్రిగా అవకాశమిచ్చారు. దీంతో తుమ్మల తీవ్ర అసంతృప్తికి గురయ్యారట. మరోవైపు తుమ్మలకి కూడా రాజ్యసభ ఇస్తామని హామీ ఇచ్చినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అయితే తుమ్మల మొదటినుండి కేంద్ర రాజకీయాలపై ఆసక్తి కనబరిచేవారు కాదు. హిందీ, ఇంగ్లీష్ మాట్లాడి మేనేజ్ చేయడం కష్టం అనేవాళ్ళు. మరి అలాంటి తుమ్మలను.. ఇప్పుడు రాజ్యసభకు పంపుతానంటే అంగీకరిస్తారా అంటే అనుమానమే.

ప్రస్తుతం తుమ్మల, పొంగులేటి ఇద్దరిది ఇంచుమించు ఒకటే పరిస్థితి. జిల్లాలో పట్టుంది కానీ పదవి లేదు. ఒకవేళ భవిష్యత్తులో పదవి దక్కినా ఇద్దరిలో ఎవరో ఒక్కరికే దక్కే అవకాశముంది. దీనికితోడు జిల్లాలో వీరిద్దరి మధ్య వర్గపోరు కూడా నడుస్తుందని అంటున్నారు. పరిస్థితి చూస్తుంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు టీఆర్ఎస్ ని వీడి బీజేపీ గూటికి చేరే అవకాశముందని అంటున్నారు. తుమ్మలకు ఆయన అనుచరులు పార్టీ మారమని సూచిస్తున్నారట. ఇప్పటికే తుమ్మల సమీప బంధువు గరికపాటి రామ్మోహన్ బీజేపీలో చేరడంతో.. ఆయన ద్వారా సంప్రదింపులు జరిపి బీజేపీలో చేరే అవకాశముందని కూడా వార్తలొస్తున్నాయి. మరోవైపు పొంగులేటి అనుచరులు కూడా పార్టీ మారాలని ఆయన మీద తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారట. దీంతో పొంగులేటి బీజేపీలో చేరే ఆలోచనలో పడ్డారట. వచ్చే ఏడాది ఏప్రిల్ లో తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఆ రెండు స్థానాలకు అధికార పార్టీలో తీవ్ర పోటీ నెలకొనే అవకాశముంది. మరి ఆ పోటీలో పొంగులేటికి అవకాశం దక్కుతుందా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. దీంతో పొంగులేటి తన రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా బీజేపీలో చేరడం కరెక్ట్ అని భావిస్తున్నారట. మరి తుమ్మల, పొంగులేటి ఇద్దరిలో ఎవరో ఒకరు బీజేపీలో చేరతారో లేక ఇలాగే టీఆర్ఎస్ లో కొనసాగుతారో చూడాలి. మొత్తానికి ఖమ్మం రాజకీయాలు గులాబీ బాస్ ని తెగ కలవరపెడుతున్నాయట.