తిరుమలలో అన్యమత ప్రచారం.. సీఎం జగన్ కు తెలుసా?

 

తిరుమల వెళ్లే బస్సు టికెట్ల వెనుక అన్యమత ప్రచార ప్రకటనలను ముద్రించడంపై బీజేపీ భగ్గుమంది. తిరుపతిలోని ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం ముందు బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. ఆర్టీసీ ఆర్ఎంకు ఓ వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని మండిపడ్డారు . కుట్రలో భాగంగానే తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోందని, ఇందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీకి చెందిన మరో నేత సౌమంచి శ్రీనివాస్ మాట్లాడుతూ.. అన్యమత ప్రచారాన్ని అడ్డుకునేలా గతంలోనూ ఉద్యమాలు చేశామని, ఈ ప్రచారం ఆగకపోతే తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

తిరుమలలో ఆర్టీసీ బస్సుల టిక్కెట్ల వెనుక అన్యమత ప్రచార ప్రకటనలపై దుమారం రేగుతోంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన క్షేత్రంలో ఇలా ఇతర మతాలకు సంబంధించిన ప్రచారం ఏంటని భక్తులు మండిపడుతున్నారు. రాంభగీచ బస్టాండ్‌లోని కౌంటర్‌లో గురువారం ఉదయం నుంచి ఇచ్చిన టిక్కెట్ల వెనుక భాగంలో హజ్, జేరుసలేం యాత్రల ప్రకటనలు ముద్రించి ఉన్నాయి. దీంతో కొందరు భక్తులు ఆర్టీసీ అధికారులను ప్రశ్నించారు. అయితే తిరుమలకు వచ్చే టిక్కెట్ రోల్‌పై ఎలాంటి ప్రకటనలు ఉండవని చెప్పిన డిపో మేనేజర్.. ప్రకటనలు ఉన్న ఐదు పేపర్లు పొరపాటున తిరుమలకు వచ్చాయని చెప్పారు.
 
ఇదే విషయమై టీటీడీ మాజీ సభ్యుడు ఏవీ రమణ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. బస్సు టిక్కెట్ వెనుక అన్యమత యాత్రల గురించి ప్రచారం చేయడం ఘోరమని అన్నారు. టీటీడీకి కొత్త ఛైర్మన్‌ను నియమించినప్పుడే భక్తులు ఆందోళన చెందారని, ఇప్పుడు వారి భయమే నిజమైందని విమర్శించారు. ఆలయ పవిత్రత, మనోభావాలను కాపాడాల్సిన వారే బాధ్యతారాహిత్యంగా ఉంటే ఎలా? అని రమణ ప్రశ్నించారు.

ఈ విషయంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. టీటీడీలో అన్యమత ప్రచారం జరుగుతోందని ఇంతకు ముందే ఒకసారి చెప్పామని.. మత విశ్వాసాలను గౌరవించాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఒక మతాన్ని ప్రచారం చేయడం సరికాదని కన్నా మండిపడ్డారు.

దీనిపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. టికెట్లపై అన్యమత ప్రచారం చేయడం సరికాదని, ఈ విషయం గురించి సీఎం జగన్ కు తెలుసా? అని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిపై జగన్ చర్యలు తీసుకోవాలని, అన్యమత ప్రచార విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.