థాంక్యూ వెరీమచ్ చిరూ!

 

 

 

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చాక ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటైనా చేసిన దాఖలాలు లేవు. ఏదైనా వుందేమో మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఎంత ఆలోచించినా ఒక్కటి కూడా ఎంత షార్ప్ మైండ్‌కైనా దొరకదు. పార్టీ పెట్టడం, తుక్కుగా ఓడటం, పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి పదవులు సంపాదించుకోవడం మినహా ఆయన సాధించిందేమీ లేదు. ఈ విషయాన్ని చెప్పడానికి రాజకీయ పరిశీలకులు, విశ్లేషకుల అవసరమేమీ లేదు.

 

రాష్ట్రంలో చిన్నపిల్లాడిని కదిలించినా  పాయింట్ మీద చాలా క్లారిటీగా మాట్లాడతాడు. రాష్ట్రంలో రాజకీయంగా ఇంత ‘మంచి’ ఇమేజ్ వున్న చిరంజీవి రాష్ట్ర ప్రజల్ని ఇంకా బాధపెట్టడం దేనికని అనుకున్నాడో, అంతర్లీనంగా మరో కారణం ఏదైనా వుందేమోగానీ రాష్ట్ర ప్రజల నెత్తిన పాలు పోసే నిర్ణయం తీసుకున్నారు.  ఆయన తీసుకున్న సదరు నిర్ణయం ఆషామాషీ నిర్ణయం కాదు. తెలుగోళ్ళంతా ముక్తకంఠంతో ఆయనకి థాంక్స్ చెప్పి తీరాల్సిన నిర్ణయం. ఇంతకీ ఆ నిర్ణయమేంటంటే, చిరంజీవి గారికి తన మానస పుత్రిక అయిన ‘ప్రజారాజ్యం పార్టీ’ని పునరుద్ధరించే ఆలోచన ఎంతమాత్రం లేదట. హమ్మయ్య థాంక్ గాడ్ అనిపిస్తోంది కదూ?!



ఈమధ్య కాలంలో చిరంజీవి గారు కాలం చేసిన తన పార్టీని సమాధిలోంచి బయటకి తీసే అవకాశం వుందన్న రూమర్లు వినిపించాయి. ఈ రూమర్లని బయటివారు క్రియేట్ చేశారో లేక జనాల రెస్పాన్స్ ఎలా వుంటుందో చూద్దామని చిరంజీవి వర్గీయులే క్రియేట్ చేశారో తెలియదుగానీ మొత్తానికి రూమరైతే బాగా వ్యాపించింది. చిరంజీవిగానీ పొరపాటుగా ప్రజారాజ్యం పార్టీని పునరుద్ధరిస్తారేమోనని తెలుగు ప్రజలంతా తల్లడిల్లిపోయారు. ఆ పొరపాటు మళ్ళీ జరిగితే అది తెలుగువారి పాలిట మరోసారి గ్రహపాటుగా మారే ప్రమాదం వుందని విలవిలలాడిపోయారు. 



ఎందుకంటే, ఆరోజుల్లో చిరంజీవి పార్టీ పెట్టి ఓట్లు చీల్చడం వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగిందని, అప్పుడు అయ్యగారు పార్టీ పెట్టకుండా వుంటే తెలుగు జనాలు కాంగ్రెస్ పార్టీ బారిన పడి వుండేవారు కాదని తెలుగు ప్రజలు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజారాజ్యం పార్టీని బతికిస్తే వచ్చే ఎన్నికలలో ఇంకెన్ని దుష్పరిణామాలు జరుగుతాయోనని భయపడ్డారు. అయితే చిరంజీవి తన పార్టీకి మళ్ళీ అంత సీన్ లేదని అర్థం చేసుకున్నాడో లేక తెలుగు వారి మీద దయదలిచాడో గానీ తన పార్టీని పునరుద్ధరించే ఆలోచన లేదని స్పష్టం చేశాడు. అందుకే ప్రతి తెలుగువాడూ చిరంజీవికి రుణపడి వుండాలి. ఆయనకి మనస్పూర్తిగా థాంక్యూ వెరీమచ్ అని చెప్పాలి.