నేను, నా తమ్ముడు చేసిన తప్పు.. ర‌జ‌నీ, కమల్ చేయొద్దు: చిరంజీవి

 

జీవితంలో అనుభవం నేర్పిన పాఠాలు ఎవరూ నేర్పలేరంటారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తన అనుభవంతో మిగతా స్టార్ హీరోలకు పాఠాలు చెబుతున్నారు. ఆ పాఠాలు సినిమాలకు సంబంధించినవి అనుకుంటే పొరపాటే, రాజకీయాలకు సంబంధించినవి. చిరంజీవి సినిమాల్లో మెగాస్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్న టైంలో 2008 లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. 2009 ఎన్నికల్లో బరిలోకి దిగారు. అయితే ఆ ఎన్నికల్లో చిరంజీవి ఆశించిన ఫలితం మాత్రం రాలేదు. రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన చిరంజీవి.. తన సొంత నియోజకవర్గం పాలకొల్లులో ఓడిపోయారు. ఇక పార్టీ కూడా 18 స్థానాలతో సరిపెట్టుకుంది. తర్వాత కొందరి సలహాతో 2011 లో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసారు. రాజ్యసభకు ఎంపికై కేంద్ర కేబినెట్ లో పనిచేసారు. ఓ రకంగా చిరంజీవి రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో రాణించలేదనే చెప్పాలి. దీంతో చిరంజీవి మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నారు.

ఇక చిరంజీవి సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా 2014 లో జనసేన పార్టీని స్థాపించారు. అయితే 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్డీయే కూటమికి మద్దతు తెలిపారు. 2019 ఎన్నికల్లో మాత్రం ప్రత్యక్ష పోరుకి దిగారు. కానీ చిరంజీవి కంటే దారుణమైన ఫలితాన్ని చవిచూశారు. పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. పార్టీ కేవలం ఒకే ఒక్క అసెంబ్లీ స్థానంతో సరిపెట్టుకుంది. అయినా పవన్ తన పోరాటం ఆగదంటున్నారు. అయితే చిరంజీవి మాత్రం ప్రజారాజ్యం, జనసేన పార్టీలను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా, మరియు రాజకీయాల్లో తనకున్న ప్రత్యక్ష అనుభవంతో.. సినిమా స్టార్లు రాజకీయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచింది అంటున్నారు.

ప్రస్తుతం చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తాజాగా త‌మిళ మేగ‌జైన్ ఆనంద విక‌ట‌న్‌కు ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో చిరంజీవి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్యలు చేసారు. ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్‌లను రాజ‌కీయాల్లోకి రావ‌ద్దంటూ స‌ల‌హా ఇచ్చారు.  "నేను సినిమాల్లో నెంబ‌ర్ వ‌న్ స్టార్‌గా రాణిస్తున్న స‌మ‌యంలో రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను. అయితే ప్ర‌త్య‌ర్థులు కోట్లు కుమ్మ‌రించ‌డంతో సొంత నియోజ‌క వ‌ర్గంలోనే ఓడిపోయాను. నా సోద‌రుడు ప‌వ‌న్‌ కళ్యాణ్ విష‌యంలోనూ అదే జ‌రిగింది" అని అన్నారు. ప్ర‌స్తుతం రాజకీయాలు పూర్తిగా డ‌బ్బుమ‌య‌మైయ్యాయ‌ని, సౌమ్యుల‌కు రాజ‌కీయాలు అంత సుల‌భ‌మైతే కాదని, నిజాయ‌తీగా ప్ర‌జ‌ల‌కు ఏదైనా చేయాల‌నుకున్నా ఏమీ చేయ‌లేర‌ని ఆయ‌న తెలిపారు. న‌న్న‌డిగితే ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్‌లు రాజ‌కీయాల్లోకి రావొద్ద‌నే స‌ల‌హా ఇస్తాను అని చిరంజీవి స్పష్టం చేసారు.

మొత్తానికి చిరంజీవికి అనుభవంతో తత్త్వం బోధ పడింది. రాజకీయాలకు దూరం పాటించాలని సలహాలు ఇస్తున్నారు. మరి ఇప్ప‌టికే మ‌క్క‌ల్ నీది మ‌య్యం పార్టీతో క‌మ‌ల్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసారు. ర‌జ‌నీ కూడా త్వ‌ర‌లోనే రాజ‌కీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించారు. మరి వీరిద్దరూ చిరంజీవి సలహాతో ఆలోచనలో పడతారో, లేక అనుభవమే పాఠాలు నేర్పుతుంది అంటూ ముందుకి సాగుతారో చూడాలి.