కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి దూరం

 

చిరంజీవి..తెలుగు చిత్ర సీమలో ఓ వెలుగు వెలిగి మెగా స్టార్ గా ప్రేక్షకాదరణ పొందిన నటుడు.నటుడుగా తనదైన ముద్ర వేసిన చిరంజీవి రాజకీయాలవైపు అడుగులు వేశాడు.2008 లో ప్రజా రాజ్యం పార్టీ స్థాపించారు.2009 ఎన్నికల్లో ప్రజా రాజ్యం పార్టీ బరిలోకి దిగగా అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోని 294 అసెంబ్లీ స్థానాలకు గాను 18 స్థానాలను మాత్రమే పార్టీ గెలుచుకోగలిగింది.తిరుపతి,పాలకొల్లు అసెంబ్లీ స్థానాల నుంచి చిరంజీవి పోటీ చేయగా సొంత నియోజక వర్గం అయిన పాలకొల్లులో పరాజయం చవి చూశారు.తిరుపతి స్థానం లో గెలుపొందారు.రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించాలి అనుకున్న చిరంజీవికి ఈ ఫలితాలు నిరాశనే మిగిల్చాయి.ఆశించిన స్థాయిలో ఫలితం లేకపోవటంతో కొంత కాలానికి పార్టీని 2011 లో  కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.కాంగ్రెస్ పార్టీ లో చేరటంతో 2012 ఏప్రిల్ లో ఆ పార్టీ రాజ్య సభ పదవి కట్టబెట్టింది.అదే సంవత్సరం అక్టోబర్ లో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

2014 లో పరిస్థితులు తారుమారు అయ్యాయి.అప్పటికే తెలంగాణ ఉద్యమం ఉపందుకోవటంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించింది.చిరంజీవికి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో ప్రచార కమీటీ చైర్మన్ గా భాద్యతలు అప్పగించింది.కానీ చిరంజీవి ప్రచారంలో పాల్గొన్నప్పటికీ అది నామమాత్రమే అని చెప్పుకోవాలి.ఎందుకంటే రాష్ట్రము విడిపోవటం తో ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ విజయం కాయం అని అందరు ఉహిచిందే.దీనికితోడు చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి టీడీపీ కి మద్దతు ఇవ్వటం,కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయటం చిరంజీవిని విస్మయానికి గురిచేశాయి.2018 ఏప్రిల్ లో చిరంజీవి రాజ్య సభ సభ్యత్వం ముగిసింది.మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరుపున ఏదైనా పదవి వచ్చే పరిస్థితులు ప్రస్తుతం లేవు.దీంతో గత కొంత కాలంగా క్రీయాశీల రాజకీయాలకు చిరంజీవి దూరంగా ఉంటున్నారు.

ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యే పరిణామాలే కనిపిస్తున్నాయి.తాజాగా చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ కాలపరిమితి ముగియగా దాన్ని పునరుద్ధరించుకోలేదు.దీంతో ఆయన ఆ పార్టీకి దూరమైనట్లేనని తెలుస్తోంది.సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీలో క్రియాశీలకంగా ఉండాలని ఇటీవల రాహుల్‌గాంధీ చిరంజీవిని కోరినట్లు తెలుస్తోంది. దీనికి ఆయన నుంచి స్పందన లేనట్లు సమాచారం.దీంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీకి ఇక దూరమైనట్లేనని భావిస్తున్నారు.అంతేకాకుండా పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటం కూడా చిరంజీవి పార్టీకి దూరం అవ్వటానికి కారణంగా తెలుస్తోంది.గత ఎన్నికల్లో టీడీపీ కి మద్దతు ఇచ్చిన పవన్ రానున్న ఎన్నికల్లో స్వతహాగా పోటీ చేస్తున్నది తెలిసిందే.అయితే ప్రస్తుతం కాంగ్రెస్,టీడీపీ పార్టీలు కాస్త సాన్నిహిత్యంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం చేయవలిసి వస్తే తమ్ముడు పవన్ పై విమర్శలు గుప్పించక తప్పదు.అది ఇష్టపడని చిరంజీవి యాక్టీవ్ పాలిటిక్స్ కి దూరంగా ఉంటున్నారని సమాచారం.

రాజకీయాలకు దూరం అవుతూవస్తున్న చిరంజీవి ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు.150వ చిత్రం ‘ఖైదీ నం.150’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిరంజీవి ప్రస్తుతం స్వాతంత్ర్య సమరయోధుడు సైరా నరసింహారెడ్డి బయోపిక్‌ ‘సైరా’లో నటిస్తున్నారు. ఆ తర్వాత కూడా ఆయన మరిన్ని సినిమాల్లో నటించనున్నట్లు తెలుస్తోంది.