విజయనిర్మల.. అంత‌టి ప్రతిభావంతురాలిని ఇప్పట్లో చూడ‌లేం!!

 

ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల బుధవారం అర్ధరాత్రి (73) గుండెపోటుతో మరణించారు. ఆమె మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

చిరంజీవి:
"మ‌న తెలుగు ప‌రిశ్ర‌మ‌లో భానుమ‌తిగారి త‌ర్వాత గ‌ర్వించ‌ద‌గిన బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి విజ‌య‌నిర్మ‌ల గారు. తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. బాలనటిగా, కథానాయికగా, దర్శకురాలిగా, నిర్మాతగా తన ప్రతిభాపాటవాలను చాటారు. అంత‌టి ప్రతిభావంతురాలిని మ‌నం ఇప్ప‌ట్లో ఇంకెవ‌రినీ చూడ‌లేం. కృష్ణ‌గారికి జీవిత భాగ‌స్వామినిగా ఎప్పుడూ ఆయ‌న ప‌క్క‌న నిల‌బ‌డి ఆయ‌న‌కు చేదోడు వాదోడుగా ఉంటూ త‌న ధ‌ర్మాన్ని నెర‌వేరుస్తూ వ‌చ్చారు. ఆమె లేని లోటు కృష్ణ గారికి ఆ కుటుంబానికే కాదు యావ‌త్ తెలుగు చిత్ర పరిశ్రమకి తీర‌ని లోటు. వారి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కృష్ణగారి కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాల‌ని కోరుకుంటున్నా."

బాలకృష్ణ:
‘‘న‌టిగా, ద‌ర్శ‌కురాలిగా, నిర్మాత‌గా త‌న‌దైన ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్న విజ‌య‌నిర్మ‌ల‌ గారు క‌న్నుమూయ‌డం ఎంతో బాధాక‌రం. సినీ రంగ పరిశ్ర‌మ‌లో మ‌హిళా సాధికార‌త‌ను చాటిన అతి కొద్ది మంది మ‌హిళ‌ల్లో విజ‌య‌నిర్మ‌ల‌గారు ఒక‌రు. బాలన‌టి నుంచి హీరోయిన్‌గా కూడా ఎన్నో గొప్ప చిత్రాల్లో న‌టించారు. అలాగే ద‌ర్శ‌కురాలిగా 44 చిత్రాల‌ను డైరెక్ట్ చేయ‌డం చాలా గొప్ప విష‌యం. ద‌ర్శ‌కురాలిగా గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించి ఎంతో మంది మ‌హిళ‌ల‌కు ఆద‌ర్శంగా నిలిచారు. ఆమె మృతి చిత్ర‌సీమ‌కు తీర‌నిలోటు. ఆమె ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ఆ భ‌గ‌వంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.’’

జీవితా రాజశేఖర్: 
"నటిగా, దర్శక నిర్మాతగా విజయనిర్మల గారు ఎన్నో విజయాలను సాధించారు. వ్యక్తిగానూ ఆమె ఎంతోమందికి సహాయ సహకారాలను అందించారు. ఆమెతో ఎవరినీ పోల్చలేం. మాకు తెలిసిన దగ్గర నుంచి ఒక ఆడపులిగానే ఆమెను చూస్తూ వచ్చాము. అలాంటిది ఈ మధ్య నడవడానికి ఆమె ఇబ్బంది పడుతుండటం చూసి బాధ కలిగింది. ఆమె మరణం చిత్రపరిశ్రమకి తీరని లోటు. ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము."

జూ.ఎన్టీఆర్‌: 
"విజయ నిర్మల జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం. ఆమె ఇక లేరన్న వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యా. కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాల‌ని కోరుకుంటున్నా."

మంచు మనోజ్‌: 
"మీరు ఇండస్ట్రీకి వచ్చి చరిత్ర సృష్టించారు. మీరు సాధించినంతగా మున్ముందు తరాల వారూ సాధించలేరేమో. ఇప్పుడు మీరు వెళ్లిపోయారు. మిమ్మల్ని మిస్సవుతాం అమ్మమ్మ. మీ సినిమాలు మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి."