ఆ మెగాజీవికే అంత ప్రాదాన్యం ఎందుకు

 

‘చిరంజీవితో సోనియా గాంధీ మంతనాలు’ అంటూ ఇప్పటికీ మీడియా ఊహించవలసినదంతా ఊహించి, చెప్పదలచుకొన్నదంతా చెప్పేసింది. పనిలో పనిగా చిరంజీవికి కూడా మీడియా బాగానే కవరేజ్ దొరికింది. చిరంజీవి తన వీరభక్తుడు రామచంద్రయ్యపై వేటు పడకుండా మెగా చక్రం అడ్డు వేయడానికే సోనియమ్మను కలిసాడని కొందరు విశ్లేషిస్తే, కిరణ్ కుమారుడిపై తన అసంతృప్తి వెళ్ళగక్కేందుకే కలిసాడని మరో విశ్లేషణ సాగింది. అదేమి కాదు మరో రాజశేఖరెడ్డి లక్షణాలు కనబరుస్తున్న కిరణ్ రెడ్డికి చెక్ పెట్టేందుకే, ఆయనని వ్యతిరేఖిస్తున్నజీవులందరితో సోనియమ్మ మంతనాలు చేస్తోందని మరికొందరు కనిపెట్టారు. మొత్తం మీద చిరంజీవి-సోనియా సమావేశం ద్వారా జనానికి కూడా కొంత రాజకీయ పరిజ్ఞానం పెరగడం ఇక్కడ నాలుగో పాయింటుగా అనుకోవచ్చును.

 

అయితే, కాంగ్రెస్ అధిష్టానం పార్టీలో ఉన్నఅనేక సీనియర్లని, సోనియా-రాహుల్ భజనమండలి అధ్యక్షులు, కేంద్ర రాష్ట్ర మంత్రి పదవులు దక్కని జనాలు, అసంతృప్త తెలంగాణావాదులు వంటి భిన్నజాతులని కాదని కేవలం చిరంజీవికే ఎందుకు ప్రాధాన్యం ఇస్తోంది? ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లు ముప్పై ఏళ్లబట్టి పార్టీలో పనిచేసిన తెలంగాణా యంపీలు, రెండు రోజులు పార్లమెంటు మెట్ల మీద పడిగాపులు కాసినా దొరకని సోనియమ్మ దర్శనం, కేవలం ఈ ఒక్క జీవికే ఎందుకు అంత అవలీలగా దొరుకుతోంది?

 

పార్టీలో అంతమంది అతిరధ మహారధుల వంటి నేతలుండగా నిన్నగాక మొన్న రాజకీయాలలోకి, పార్టీలోకి వచ్చిన ఈ సరికొత్త జీవి ద్వారానే రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఎందుకు ఆరా తీస్తున్నట్లు? వంటి అనేక భేతాళ ప్రశ్నలకి సమాధానాలు వెతికితే, ప్రజారాజ్యం కండువాపైన కాంగ్రెస్ కండువా కప్పుకొని ఆయన వెనక తిరుగుతున్న17 మంది శాసనసభ్యులు ఇప్పటికీ ప్రజారాజ్యం కండువాను పదిలంగానే ఉంచుకొన్నట్లు, వారందరూ కూడా రామచంద్రయ్యలాగ దైర్యంగా చిరంజీవి భజనలో పాల్గొనలేకపోతున్నపటికీ, రానున్న ఎన్నికలలో టికెట్స్ కోసం చిరంజీవి నిప్పుల్లో దూకమన్నా దూకేందుకు సిద్దంగా ఉన్నారని తన పెంపుడు చిలకల ద్వారా సోనియమ్మ గ్రహించింది. రాష్ట్రంలో ప్రభుత్వం మనుగడకు ఆ 17 మంది వీరభక్తుల మద్దతు ఎంత అవసరమో ఆమెకు తెలియంది కాదు. గనుక, చిరంజీవితో కాసేపు మాట మంతికి, తద్వారా ఆయనకి దక్కే ఆ మాత్రం మీడియా కవరేజ్ వల్ల ఆమెకు, పార్టీకి లాభమే తప్ప వచ్చే నష్టం ఏమీ లేదు.

 

ఇక, కిరణ్ కుమార్ రెడ్డి పోరుపడలేక ఒకవేళ రామచంద్రయ్యను పీకదలిస్తే అదేదో ముందుగానే మెగాజీవి చెవిలో వేసి, శాస్త్రప్రకారం పీకితే అప్పుడు ఆయనే పార్టీ నిర్ణయాన్ని వెనకేసుకొనే బాధ్యత తీసుకోవచ్చు కూడా. లేదా, కిరణ్ మొత్తుకొన్నారామచంద్రయ్యను పీకడం లేదనే ఓ చల్లని మాట చెప్పి ఆ జీవిని సంతోషపెట్టవచ్చు కూడా.

 

సినీరంగంలో స్వయంకృషితో పైకి వచ్చిన ఈ జీవి పార్టీలో చేరి గట్టిగా ఏడాది కూడా తిరుగక ముందే కాంగ్రెస్ పార్టీ నీళ్ళు బాగానే ఒంట బట్టించుకొంటున్నాడు గనుక రానున్నఎన్నికలలో ఆయన రెడ్డి రాజ్యాన్ని ఒక ‘కాపు’ కాస్తాడనే అడియాస కూడా లేకపోలేదు.