జగన్ కి బహిరంగ లేఖ.. అవినీతి నిజమే అనిపిస్తోంది!!

 

టీడీపీ నుంచి వైసీపీలో చేరిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌పై చీరాల వైసీపీ సమన్వయకర్త యడం బాలాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్‌కు బాలాజీ బహిరంగలేఖ రాశారు. ఈ లేఖలో ఆయన ఆమంచిపై పలు ఆరోపణలు చేశారు. జగన్ ఓదార్పు యాత్ర సమయంలో ఆమంచి ఆగడాలు తట్టుకోలేక తనను పార్టీలోకి ఆహ్వానించారని గుర్తు చేశారు. ఎన్‌ఆర్‌ఐగా ఉన్న తాను అన్నీ వదులుకుని 9ఏళ్లు పార్టీ కోసం పనిచేశానని, ఆమంచి లాంటి‌ రౌడీని పార్టీలో చేర్చుకోవద్దని చెప్పినా వినలేదని లేఖలో ఆరోపించారు. దుష్టశక్తులను పార్టీలో చేర్చుకున్నారంటే.. జగన్ అవినీతి కూడా నిజమనే భావన కలుగుతోందని, తన లేఖపై స్పందించకుంటే వైసీపీ ఓటమి లక్ష్యంగా పని చేస్తానని యడం‌ బాలాజీ స్పష్టం చేశారు. మరోవైపు యడం బాలాజీ టీడీపీలో చేరో యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన అనుచరులతో మంతనాలు కూడా ప్రారంభించారు. విశ్వసనీయ సమాచారం మేరకు విజయవాడకు చెందిన ఒకరిద్దరు టీడీపీ నాయకులు బాలాజీతో చర్చలు కూడా జరిపారు. ప్రస్తుతం యడం బాలాజీ రాసిన లేఖ చూస్తుంటే ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమనిపిస్తోంది. చూద్దాం మరి యడం బాలాజీ ఎలాంటి ట్విస్ట్ లు ఇస్తారో.