భారత్ ని, సిక్కుల్ని… జాత్యహంకారంతో అవమానిస్తోన్న చైనా!

 

చైనాకి ఇండియా మీద మొదట్లో చులకన భావం వుండేది. తరువాత ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇప్పుడు ఇక చేసేది ఏం లేక విసుగు, అసహనం మొదలైనట్టు కనిపిస్తున్నాయి! దీనికి కారణం ప్రస్తుతం కొనసాగుతున్న డోక్లామ్ టెన్షనే! ఏదో ఎప్పటిలా బెదిరిస్తే భారత్ భయపడి వెనక్కి తగ్గుతుందని భావించిన డ్రాగన్ ఇప్పుడు పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తోంది. తాను హెచ్చరించినట్టు యుద్ధం చేసేయలేక, అలాగని తన సైన్యాన్ని వెనక్కి పిలిపించుకోలేక సతమతం అవుతోంది! ఆ ఫ్రస్ట్రేషన్ లో తన అధికారిక మీడియాను కూడా ఇష్టానుసారం వాడేసుకుంటోంది! చివరకు , నవ్వుల పాలు అవుతోంది…

 

జిన్ హువా అనేది కమ్యూనిస్టు చైనా వారి ప్రభుత్వ మీడియా సంస్థ! దాని ఆధ్వర్యంలో ఓ ఇంగ్లీష్ చాట్ షో నడుస్తోంది. అందులో జాతీయ, అంతర్జాతీయ అంశాలపై కామెడీ చేస్తూ కామెంట్లు చేస్తారు. ఇది సీరియస్ ప్రోగ్రామ్ కాదు. కాకపోతే, వివిధ అంశాలపై చైనా అభిప్రాయాన్ని సదరు షో ద్వారా తెలుసుకోవచ్చు. దాని పేరు ది స్పార్క్!

 

ది స్పార్క్ షోలో తాజాగా ఓ వీడియోని రిలీజ్ చేసింది చైనీస్ అధికారిక మీడియా. అందులో చైనీస్ యాంకర్ డోక్లామ్ విషయంలో ఇండియా చేసిన ఏడు పాపాలు అంటూ లిస్ట్ చెప్పింది! అవన్నీ పాత ముచ్చట్లే! ఇండియా అక్రమంగా తన భూభాగంలోకి వచ్చిదంటూ దొంగ ఏడుపు కంటిన్యూ చేసింది. అయితే, అక్కడితో ఆగకుండా కామెడీ కోసం ఇండియన్స్ ని జాతి వివక్షతో అవమానించింది! తలపైన పాగాతో వున్న ఓ సిక్కు వేషం వేసుకున్న చైనీస్ యాక్టర్ తో ఛండాలమైన ఇంగ్లీష్ యాస మాట్లాడించింది! అంతే కాదు, భూటాన్ దేశం వ్యక్తిగా చూపిన ఓ వ్యక్తికి సదరు సిక్కు వేషం వేసుకున్న నటుడితో కత్తెర చూపించింది! దీని ద్వారా భూటాన్ని భారత్ బెదిరించి లొంగదీసుకుంటోందని సంకేతాలిచ్చింది…

 

ఇండియాని, మరీ ముఖ్యంగా, అడ్డదిడ్డంగా అమర్చిన గడ్డంతో, తలపాగాతో మన సిక్కుల్నీ అవమానించిన చైనీస్ షో… ట్విట్టర్ లో, యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. ట్విట్టర్, యూట్యూబ్ లాంటివన్నీ చైనాలో బ్యానే! కాబట్టి ఇండియాని జాత్యహంకారంతో అవమానిస్తోన్న ఆ వీడియో టార్గెట్ లోకల్ చైనా ప్రజలు కాదనే చెప్పాలి. అంతర్జాతీయ ఆడియన్స్ కోసం ఇంగ్లీష్ లో తయారు చేసిన వీడియో నవ్వుకన్నా ఎక్కువ సెటైర్లు పుట్టించింది. చూసిన వారు చైనా మీడియా చేసిన పిచ్చి ప్రయత్నాన్ని కామెంట్లతో, షేరింగ్ లతో వెటకారం చేస్తున్నారు!

 

వేల మైళ్ల సుదీర్ఘ సరిహధ్దు వెంట చైనా రోజుకో చోట గొడవకి దిగుతోంది. అది చాలదన్నట్టు తన మీడియా ద్వారా జాత్యహంకార దోరణికి తెర తీస్తోంది. పోనీ ఇప్పటికిప్పుడు యుద్ధం ప్రకటిద్దామా అంటే అలాంటి దుస్సాహసం బీజింగ్ చేయలేకపోతోంది. డోక్లామ్ విషయంలో వెనక్కి తగ్గినా, ముందు పోయినా చైనా తీవ్ర నష్టం ఎదుర్కొనే స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఆ ఫ్రస్ట్రేషనే ఇలా అన్ ప్రొఫెషనల్ వీడియోలుగా బయటకు వస్తోందిని చాలా మంది అంటున్నారు. చైనా పాలకులు ఇప్పటికైనా చర్చలకు ముందుకొచ్చి పరువు కాపాడుకుంటే మంచిది! ఆఫ్ట్రాల్… ఆసియాలో చైనా దాదాగిరి ఇక మీద నడవదని ఇప్పటికే భారత్ స్పష్టంగా తేల్చేసింది కాబట్టి!