పళ్లు తినక జనం చనిపోతున్నారు..

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ వార్త నిజమేనంటున్నారు ఆక్స్‌ఫర్డుకి చెందిన పరిశోధకులు. Chinese Academy of Medical Sciences అనే సంస్థతో కలిసి వీరు సాగించిన ఓ దీర్ఘకాలిక పరిశోధన ఇప్పుడు చైనాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.


పళ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే! ఆ విషయాన్ని ఎవరూ కాదనలేరు. కానీ పళ్లు తినడానికీ, దీర్ఘకాలం బతకడానికీ మధ్య ఉన్న సంబంధాన్ని శాస్త్రీయంగా నిరూపించే ప్రయత్నం చేశారు కొందరు పరిశోధకులు. ఇందుకోసం అయిదు లక్షలమంది చైనీయుల జీవితాలను పరిశీలించారు. వీరందరూ కూడా చైనాలోని పది వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు. 30 నుంచి 79 ఏళ్ల లోపు వయసు కలిగినవారు. వీరి ఆరోగ్యాన్ని ఒకటి రెండేళ్లు కాదు... ఏకంగా ఏడేళ్లపాటు నిశితంగా గమనించారు. పరిశోధన మొదలుపెట్టిన సమయంలో ఈ అయిదు లక్షలమందిలోనూ రక్తపోటు, గుండెజబ్బులు లేనేలేవు. మరి ఈ సుదీర్ఘ పరిశోధనలో తేలిందేమిటంటే...

 

- అయిదు లక్షలమందిలో 18.8 శాతం మందికి తరచూ పళ్లు తినే అలవాటు ఉంది. 6.4 శాతం మందేమో పళ్లని చాలా తక్కువగా తీసుకోవడమో లేకపోతే వాటి జోలికే పోకపోవడమో చేస్తుంటారు.


- డయాబెటిస్ ఉన్నవారు, లేనిపోని సమస్యలు వస్తాయేమో అన్న భయంతో అసలు పళ్ల జోలికి పోవడమే మానేస్తున్నారట.


- పరిశోధన మొదలవకముందు డయాబెటిస్‌ లేనివారిలో పళ్లు తినే అలవాటు ఉంటేకనుక... అలాంటివారిలో డయాబెటిస్ వచ్చే ప్రమాదం 12 శాతం తక్కువగా ఉండటాన్ని గమనించారు. ఇక పరిశోధన మొదలయ్యే సమయానికే డయాబెటిస్‌ ఉన్నవారిలో పళ్లు తినే అలవాటు ఉంటే... వారిలో డయాబెటిస్‌కి సంబంధించిన సమస్యలు దాదాపు 28 శాతం వరకూ తలెత్తకపోవడాన్ని గమనించారు. అంటే కళ్లు దెబ్బతినడం, కిడ్నీలు పాడవడం, శరీర భాగాలకి రక్తప్రసారం సరిగా జరగకపోవడం... వంటి తీవ్రమైన సమస్యలు వీరి దరిచేరడం లేదన్నమాట.


- తరచూ పళ్లు తినే అలవాటు ఉన్నవారు గుండెజబ్బులతో చనిపోవడం దాదాపు మూడోవంతు తక్కువగా కనిపించింది.


- పళ్లని తీసుకుంటే, ఒక్క చైనాలోనే దాదాపు అయిదు లక్షల మందిని గుండెపోటు నుంచి కాపాడవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

 

పళ్లలో మన శరీరానికి కావల్సిన పోషకాలు ఉంటాయి. ఒంట్లో చెత్తాచెదారాన్ని బయటకు పంపే పీచుపదార్థం ఉంటుంది. రోగనిరోధకశక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. గుండెకు మేలుచేసేలా తక్కువ సోడియం, ఎక్కువ పొటాషియం నిష్పత్తి కనిపిస్తుంది. చక్కెర పదార్థాలు ఉన్నా అవి రక్తంలో నిదానంగా, సహజంగా కరిగేలా ఉంటాయి. పళ్లతో ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి కాబట్టే అవి మందులు పనిచేసినంత ప్రభావవంతంగా పనిచేస్తాయి. కానీ చిరుతిళ్లలా రుచిగా ఉండవనో, క్రమం తప్పకుండా కొనేందుకూ తినేందుకూ బద్ధకించో.... చాలామంది వాటి జోలికే పోరు. ఇక షుగర్ వ్యాధి ఉన్నవారైతే ఏఏ పండ్లను తీసుకోవాలో, ఎంత మోతాదులో తీసుకోవాలో తెలియని అయోమయంలో అసలు వాటిని ముట్టుకోరు. ఫలితం! మన ఆరోగ్యాన్ని మనమే చేజేతులారా పాడుచేసుకుంటున్నాం. క్రమంగా మృత్యుముఖంలోకి అడుగులు వేస్తున్నాం.


- నిర్జర.