పిల్లలు తప్పులు ఒప్పుకోవాలంటే

తల్లిదండ్రులు తిడతారేమో అన్న అనుమానంతో ప్రోగ్రెస్‌ రిపోర్టు కార్డులలో దొంగ సంతకాలు చేసే పిల్లల సంగతి వినే ఉంటాము. ఏదన్నా వస్తువుని పాడుచేస్తే, తండ్రి చేతిలో దెబ్బలు తప్పవన్న భయంతో తనకేమీ తెలియనట్లు నటించే పిల్లల గురించీ మనకి తెలుసు. అంతదాకా ఎందుకు! మన బాల్యంలో కూడా తల్లిదండ్రుల దండననీ, చీవాట్లనీ తప్పించుకునేందుకు ఇలాంటి పనులేవో చేసే ఉంటాము.

 


పిల్లవాడు ఎప్పుడో ఒకసారి అబద్ధం చెప్పడం సహజమే కావచ్చు. కానీ ప్రతిసారీ ఇదే తీరు కనుక కొనసాగితే, అది పిల్లవాడి జీవితం మీదే ప్రభావం చూపక మానదు. అబద్ధం అనేది ఒక అలవాటుగానో, ఒక విషవలయంగానో మారిపోయి అతని భవిష్యత్తులనే నాశనం చేసే ప్రమాదం లేకపోలేదు. తప్పు చేసినప్పుడు నిజాయితీగా దానిని ఒప్పుకోవడమా, లేకపోతే తల్లిదండ్రుల దగ్గర వెల్లడించడమా అనే సంశయం ఏర్పడినప్పుడు పిల్లలో ఎలాంటి భావాలు కలుగుతాయి? అన్న సందేహం వచ్చింది ఓ ప్రొఫెసరుగారికి. దాంతో ఆయన చేసిన పరిశోధన ఇలాంటి పరిస్థితులలో తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలో ఒక సూచనను అందిస్తోంది.

 


పిల్లల అంతరాత్మ సంఘర్షణని తెలుసుకునే ఈ ప్రయోగం కోసం పరిశోధకులు 4 నుంచి 9 ఏళ్ల వయసు లోపల ఉన్న కొందరు పిల్లలను ఎంచుకున్నారు. వీరికి కొన్ని సందర్భాలను ఊహించుకోమని ప్రోత్సహించారు. అలాంటి సందర్భాలలో మీరు ఏదన్నా పొరపాటు చేస్తే, చేసిన తప్పు గురించి తల్లిదండ్రులకు చెబుతారా లేదా? ఒకవేళ చేసిన పొరపాటుని ఒప్పుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అదే పొరపాటుని ఒప్పుకోకుండా ఏదో అబద్ధంతో కప్పిపుచ్చుకుంటే మీ మనసుకి ఎలా తోస్తుంది? అంటూ రకరకాల ప్రశ్నలతో వారి భావాలను గ్రహించే ప్రయత్నం చేశారు.

 


పరిశోధనలో తేలిందేమిటంటే 4,5 ఏళ్ల పిల్లలు తమ తప్పుని కప్పిపుచ్చున్నప్పుడు పెద్దగా పశ్చాత్తాపపడలేదట. పైగా చేసిన తప్పుని ఒప్పుకునేందుకే వారు చాలా ఇబ్బంది పడ్డారట. దీనికి విరుద్ధంగా 7,8 ఏళ్ల పిల్లలు తాము చేసిన తప్పుని ఒప్పుకోవడంలోనే మనశ్శాంతిని పొందారు. ఆ తప్పుని కప్పిపుచ్చుకునేందుకు వారు చాలా ఇబ్బందిపడ్డారు. అలాగని 4,5 ఏళ్ల పిల్లలలో ఫలానా పని తప్పు అనే విచక్షణ లేకపోలేదు. కానీ బహుశా వారు పెద్దలు దండిస్తారనే భయంతో తప్పుని కప్పిపుచ్చుకునేందుకే ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చి ఉంటారు.

 


ఏతావాతా ఈ పరిశోధన తరువాత నిపుణులు చెబుతోందేమిటంటే- ‘పిల్లవాడు తప్పుచేయగానే ముందు విరుచుకుపడిపోవద్దు. అసలు అతను ఏం చెబుతున్నాడో వినండి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా తన వాదన వినేందుకు సిద్ధంగా ఉండండి. తద్వారా చేసిన తప్పుని ఒప్పుకోవడం అనే లక్షణం మీకు సంతోషాన్ని కలిగిస్తుందనే అభిప్రాయం అతనిలో కలిగేలా చేయండి. జరిగిన సంఘటననీ, దానికి అతను చెప్పిన మాటనీ విన్న తర్వాత ప్రశాంతంగా ఓ నిర్ణయానికి రండి. పిల్లవాడిలో ఇలాంటి భరోసా కలగడం వల్ల, అతను మున్ముందు ఎలాంటి పొరపాటు చేసినా మీకు సరిదిద్దే అవకాశం వస్తుంది. మద్యం మత్తులో మునిగిపోయినా, పొరపాటున డ్రగ్స్‌ అలవాటైనా కూడా అతను మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఉంటుంది.’ – నిజమే కదా!

- నిర్జర.