చిట్టి పొట్టి పిడుగులే.. చిన్నారి డిజైనర్లు!

 

దాదాపు పది సంవత్సరాలలోపు పిల్లలందరిని ఒకే చోట చేర్చి వారికిచ్చిన కాగితాలపై రకరకాల బొమ్మలు, వాళ్ళకి ఏం నచ్చేతే అది వేస్తారు. వాటికి రంగులు కూడా నింపుతారు. ఇక ఆ తర్వాత ఆ డిజైన్ ల ఆధారంగా రకరకాల దుప్పట్లు, దిండ్లు, కవర్లు ఇంకా ఇతర గృహోపకరణ, గృహాలంకరణ వస్తువులు, బొమ్మలు తయారవుతాయి. అవి మన భారతదేశంలోనే కాక విదేశాలకు కూడా ఎగుమతి అవుతాయి. లండన్, న్యూజెర్సీ, ఫ్రాన్స్, బెల్జియం, కాలిఫోర్నియా వంటి దేశాలలో ఈ వస్తువులకి మంచి ఆదరణ లభిస్తుంది కూడా! అంటే ఈ చిట్టి పొట్టి పిడుగులే చిన్నారి డిజైనర్లన్నమాట. ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే వారెవరో, ఎక్కడి వారో తెలుసుకుందామా....!

 

          

 

ఆ పిల్లలంతా కూడా గుజరాత్ లోని కచ్ ప్రాంతానికి చెందినవారు. ఆస్ట్రేలియాకి చెందిన కాస్ట్యూమ్స్ డిజైనర్ జోడి ఓ డాన్స్ షో కోసం ఇండియా వచ్చింది. ఆ సమయంలో గుజరాత్ లో భూకంపం రావటంతో వారికి సాయపడే ఉద్దేశ్యంతో కచ్ ఎడారి ప్రాంతంలోని గ్రామాలకు వెళ్ళింది. అక్కడ మహాత్మాగాంధీ ఆశ్రమం తరపున సేవలందిస్తున్న వారితో కలిసి పునరావాస కార్యకలాపాలలో తనవంతు సేవలందించింది. అక్కడే చాలారోజులు వుండటంతో అక్కడి ప్రజలతో ఓ అనుబంధం ఏర్పడి వారికోసం ఇంకా ఏమన్నా చేయాలని ఆలోచించింది ఆ జోడి.

 

 

అక్కడి మహిళలు చేతి కట్టుతో సృష్టించే అద్భుత కళని చూసిన ఈ జోడిలోని ఒక డిజైనర్ వారి కళతోనే వారికి మంచి ఉపాధి కల్పించాలనుకుంది. గృహాలంకరణ వస్తువులు, దుప్పట్లపై వారితో గుజరాతీ ఎంబ్రాయిడరీ చేయించింది. అయితే వాటికి అంతగా ఆదరణ లభించలేదు. అప్పుడు జోడిని ఓ విషయం ఆకర్షించింది. అదే అక్కడి పిల్లలు గీసే బొమ్మలు. చేతికందిన సుద్దతో రకరకాల ఆకారాలతో చిత్రవిచిత్రమైన బొమ్మలు గీసేవారు ఆ పిల్లలు. ఆ బొమ్మల ఆధారంగా డిజైన్లు రూపొందించి ఎంబ్రాయిడరీ చేయించింది. వారి ఊహలలోని బొమ్మలకి ఒక రూపునిచ్చింది. అంతే... అద్భుతం. ఆ వస్తువులకి, బొమ్మలకి ఎక్కడలేని డిమాండ్. పిల్లల ఆలోచనలోంచి పుట్టడం వల్లనేనేమో వాటిలో తెలియని స్వచ్చత, అమాయకత్వం కనిపించేవి. వారి విజయానికి లభించిన గుర్తింపు అంతా ఇంతా కాదు.


 
 

భారతదేశంలోని ఓ మారుమూల ప్రాంతంలోని పిల్లలు వేసిన డిజైన్లు దేశ విదేశాలలోని ఎందర్నో అమితంగా ఆకర్షించాయి. ఫలితంగా వాటి ఆధారంగా తయారయిన వస్తువులకి బోలెడు డిమాండ్. వారు చేసిన డిజైన్లకుగాను వారికి మంచి ప్రతిఫలితం కూడా దక్కుతుంది. దాంతో మంచి చదువు దొరుకుతుంది. అంతే కాకుండా వారి సంపాదనతో ఆ పిల్లలు వారి ఊరికి ఓ బడిని కూడా కట్టించుకున్నారు. సాంప్రదాయ చేతి వృత్తులకు పిల్లల సృజన తోడై అద్భుతమైన విజయం సాధించింది ఈ జోడి. తన కళ సాకారమైందని ఎంతో సంతోషిస్తూ ఇదంతా కేవలం పిల్లల వల్లే సాధ్యమని చెబుతుంది. ఆ వచ్చే డబ్బును ఎన్నో సామజిక కార్యకలాపాలకి వినియోగిస్తుంది కూడా. ఇది చిన్నారుల ఘన విజయం.

 
 

దీనివల్ల మన అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే...ప్రతిభకి, సృజనకి వయసుతో సంబంధం లేదు. ఎవరిలో ఎంత టాలెంట్ ఉందో ఎవరికి తెలియదు. మనం చేయవలసింది ఒక్కటే... కేవలం వారికి అవకాశం ఇచ్చి ప్రోత్సహించడమే. ఆ అవకాశాన్ని వినియోగించుకుంటూ వారు ముందుకు దూసుకుపోయే నేర్పు, పట్టుదల ఈతరం చిన్నారులకి వెన్నతో పెట్టిన విద్య. మరి మీ పిల్లలలో ఏమేం టాలెంట్ ఉన్నాయో గమనించండి.

-రమాదేవి