పిల్లలు వివక్షను పసిగట్టేస్తారు

 


మనం పిల్లల ముందు చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నాం అనుకుంటాం. అసభ్యపదజాలం వాడకుండా, గొడవలు పడకుండా వీలైనంత సహనాన్ని పాటించే ప్రయత్నం చేస్తుంటాం. కానీ అక్కడే మనం పిల్లల్ని తక్కువగా అంచనా వేస్తున్నాం అంటున్నారు పరిశోధకులు. మన మాటలో తేడాని బట్టి, ప్రవర్తనలో మార్పులని బట్టి వారు మనలోని వివక్షని పసిగట్టేస్తారని హెచ్చరిస్తున్నారు.

 

ఒకే సన్నివేశం- రెండు వీడియోలు

పిల్లలు మనల్ని ఎంతవరకు అంచనా వేయగలరో తెలుసుకునేందుకు వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఓ ప్రయోగాన్ని చేశారు. ఇందుకోసం వారు 4 లేదా 5 ఏళ్ల వయసు ఉన్న ఓ 67 మంది పిల్లలను ఎంచుకున్నారు. వారిలో ప్రతి ఒక్కరికీ రెండు వీడియోలు చూపించారు. మొదటి వీడియోలోనూ, రెండో వీడియోలోనూ ఒకటేతరహా దృశ్యం ఉంది. ఒకావిడి మరొకావిడకి ఏదో వస్తువు అందించడమే ఆ వీడియోలలోని సారం. కాకపోతే ఒక వీడియోలోని వ్యక్తి వస్తువుని నవ్వుతూ, ఆవిడ వైపుగా చేయిని చాస్తూ సంతోషంగా ఇస్తే... మరో వీడియోలోని వ్యక్తి చిరాకుగా, వస్తువుని ఇవ్వడం ఇష్టం లేనట్లుగా ప్రవర్తిస్తుంది.

 

తేలిపోయింది

రెండు వీడియోలలోని సారం ఒకటే అయినా అందులోని వ్యక్తుల హావభావాలను బట్టి పిల్లలు ఓ అభిప్రాయానికి వచ్చేసినట్లు గ్రహించారు. తమకు సానుకూలంగా ప్రవర్తించిన మనిషి నచ్చిందనీ, వారితో బొమ్మలు పంచుకోవడం ఇష్టమనీ కుండబద్దలు కొట్టేశారు. ఏకంగా 67 శాతం మంది పిల్లలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అంటే పిల్లలు తమపట్ల సానుకూలంగా ప్రవర్తించేవారిని గుర్తించడమే కాకుండా, వారితో మున్ముందు ఎలా ఉండాలన్న అభిప్రాయాన్ని కూడా చేరుకుంటారన్నమాట.

 

మరికాస్త ముందుకి

ప్రయోగం ఇక్కడితో ఆగిపోలేదు. ఈసారి ఇవే వీడియోలను మరో 81 మంది పిల్లలకు చూపించారు. వీరు కూడా 4 లేదా 5 ఏళ్ల వయసువారే! అయితే ఈసారి వీడియోలను చూపించిన తరువాత, ఆ వీడియోలలో ఉన్న వ్యక్తుల తాలూకు స్నేహితులు అంటూ కొందరిని పరిచయం చేశారు. వారిలో మీకు ఎవరు నచ్చారో చెప్పమన్నారు. ఆశ్చర్యంగా... వీడియోలో స్నేహపూర్వకంగా మెలిగినవారి స్నేహితులు తమకి ఎక్కువగా నచ్చారని పేర్కొన్నారు పిల్లలు. అంటే సానుకూలంగా ప్రవర్తించేవారే కాదు, వారికి సన్నిహితంగా ఎవరైతే ఉంటారో వారి పట్ల కూడా పిల్లలు మంచి అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్నారన్నమాట.

 

సమాజంలో తమకు కనిపించే వివక్షను పిల్లలు ఎలా స్వీకరిస్తారో ఈ ప్రయోగంతో తేలిపోయిందంటున్నారు నిపుణులు. ఓ వర్గానికి చెందిన వ్యక్తులు తమతో ప్రతికూలంగా ప్రవర్తిస్తే, దానిని గ్రహించి మనసులో నిలుపుకుంటారని హెచ్చరిస్తున్నారు. అవడానికి ఇది అమెరికాలో జరిగిన పరిశోధనే అయినా... భిన్న కులాలు, వర్గాలుగా విడిపోయిన మన భారతీయ సమాజానికి కూడా ఈ ఫలితాలు అన్వయిస్తాయేమో!

 

- నిర్జర.