కఠినమైన పెంపకంతో... చదువు పాడైపోతుంది


పిల్లల పెంపకానికి సంబంధించి ఎన్ని పరిశోధనలు జరిగినా, ఏదో ఒక కొత్త విషయం బయటపడుతూనే ఉంటుంది. పిల్లలకి సంస్కారం నేర్పడమే ముఖ్యమైన ధ్యేయంగా ఉండాలనీ, దండనతో పిల్లలు మొద్దిబారిపోతారనీ... ఇలా రకరకాల విషయాలని నిపుణుల ద్వారా వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా కఠినమైన శిక్షణలో పెరిగే పిల్లలు, చదువులో వెనకబడిపోతారని తేల్చారు.

 

పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు, పిల్లల చదువు మీద వారి పెంపకపు ప్రభావాన్ని గమనించే ప్రయోగం చేశారు. ఇందుకోసం వారు 1,482 మంది పిల్లలను ఎన్నుకొన్నారు. వీరంతా కూడా ఏడో తరగతి చదివేవారే. వీరందరినీ ఓ తొమ్మిదేళ్లపాటు నిశితంగా గమనించారు. వీరంతా రకరకాల ప్రాంతాల నుంచి వచ్చినవారు. ఆర్థికంగానూ, సామాజికంగానూ భిన్నమైన నేపథ్యాలు కలిగినవారు.

 

ప్రయోగం కోసం ఎన్నుకొన్న విద్యార్థుల నుంచి తరచూ అనేక వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు పరిశోధకులు. వారితో తల్లిదండ్రుల ప్రవర్తన ఎలా ఉంది? తరచూ తిట్లు, తన్నులతో తల్లిదండ్రుల కఠినత్వం శృతి మించుతోందా? తోటి విద్యార్థులతో వీరి ప్రవర్తన ఎలా ఉంది? వారిలో లైంగిక ఆసక్తులూ, నేరపూరిత స్వభావాలూ ఏమేరకు ఉన్నాయి? వంటి అనేక విషయాలను సేకరించారు.

 

కఠినమైన పెంపకపు పద్ధతుల మధ్య పెరిగినవారు తొమ్మిదో తరగతికి వచ్చేసరికి తమ స్నేహితులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కనిపించింది. ఆడపిల్లలలో లైంగిక చర్యల పట్ల ఆసక్తి పెరగడాన్నీ, మగపిల్లలలో నేరప్రవృత్తి హద్దు మీరడాన్నీ గమనించారు. సహజంగానే ఇది వారి చదువు మీద ప్రభావం చూపింది. ఏకంగా కాలేజీ నుంచి నిష్క్రమించే స్థాయిలో వీరు చదువులో వెనకబడిపోయారు.

 

చిన్నతనంలో తల్లిదండ్రుల నుంచీ తగినంత ప్రేమని పొందనివారు, క్రమేపీ ఆ లోటుని స్నేహితుల దగ్గర భర్తీ చేసుకునే ప్రయత్నం చేస్తారట. అలా స్నేహితులకి అధిక ప్రాధాన్యతని ఇచ్చే క్రమంలో తనదైన వ్యక్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పుకొస్తున్నారు పరిశోధకులు. నేరప్రవృత్తి, లైంగిక విశృంఖలత వంటి తాత్కాలిక లక్ష్యాలకి ప్రాధాన్యతని ఇస్తూ దీర్ఘకాలిక లక్ష్యాలైన చదువు, వ్యక్తిత్వం వంటి ప్రాధాన్యతలను వారు విస్మరించే ప్రమాదం ఉందంటున్నారు. ఇలాంటి పిల్లల్ని ముందుగానే గమనించడం వల్ల వారిని తిరిగి సరైన దారికి తీసుకువచ్చేలా తగిన కౌన్సిలింగ్ను అందించవచ్చని సూచిస్తున్నారు. అయినా చేతులు కాలేదాకా చూసుకుని కౌన్సిలింగ్ ఇచ్చేకంటే, తల్లిదండ్రులే కాస్త జాగ్రత్తగా తమ పిల్లలను పెంచుకుంటే సరిపోతుంది కదా!

- నిర్జర.