కేసీఆర్ వ్యూహం.. టీఆర్ఎస్‌లోకి దానం, ముఖేశ్..?

రాబోయే ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు రెడీ చేస్తున్నారు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటికే సామ,దాన,భేద, దండోపాయాలతో ప్రతిపక్షాన్ని బలహీనం చేసిన గులాబీ బాస్. ఆ దిశలో అక్కడక్కడా మిగిలి ఉన్న కీలకనేతలకు గాలం వేస్తున్నారు. రాష్ట్రం మొత్తం టీఆర్ఎస్ బలంగా ఉన్నప్పటికీ... రాజధాని హైదరాబాద్‌లో మాత్రం బలహీనంగానే ఉంది. గత ఎన్నికల్లో గ్రేటర్‌లో పోలైన ఓట్లలో కారుపై సైకిల్‌ పైచేయి సాధించింది. ఆ లోటును పూడ్చటానికి ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని ఇతర పార్టీలకు చెందిన కీలకనేతలను కారులోకి ఎక్కించుకున్నారు కేసీఆర్.

 

అయితే కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రులు దానం నాగేందర్, ముఖేశ్ గౌడ్‌లకు ఇప్పటికే భారీ అనుచరగణం, కిందిస్థాయిలో అభిమానులు ఉన్నారు.. వారిని టీఆర్ఎస్ వైపుకి లాగితే.. రాజధానిలో ఇక తిరుగుండదని సీఎం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే వారితో అధికారపార్టీలోని కీలకనేతలు చర్చలు జరుపుతున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. కేసీఆర్ వ్యూహం ఫలిస్తే గనుక పాతబస్తీ మినహా మిగిలిన గ్రేటర్ ఏరియా మొత్తం టీఆర్ఎస్ కంట్రోల్‌లోకి వచ్చినట్లేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.