అధికారులకు అదిరిపోతోంది

రాజావారు ఆదేశిస్తారు.. అధికారులు అమలు చేస్తారు. సాధారణంగా ఎక్కడైనా జరిగే పద్ధతి ఇదే. దేశాన్నో, రాష్ట్రాన్నో పరిపాలించేవారు తమకు తోచిన హామీలను ప్రజలకు ఇస్తూ వుంటారు. వాటిని అమలు చేసే బాధ్యతను మాత్రం అధికారుల నెత్తిన పెడతారు. ఏలినవారు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి, దానికి అవసరమైన డబ్బు తీసుకురావడానికి అధికారులు తంటాలు పడుతూ వుంటారు. సర్కారు వారి హామీలను అధికారులు అమల్లోకి తేలేకపోతే ముఖ్యమంత్రో, ప్రధానమంత్రో, ప్రజా ప్రతినిధో సదరు అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తారు. నలుగురిలో పట్టుకుని దులిపేస్తారు. వార్నింగులూ, సస్పెన్షన్లూ, ట్రాన్స్‌ఫర్లూ మామూలే. ఇప్పుడు ఇదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కూడా వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వాగ్దానాలను ఎలా అమలు చేయాలో తెలియక వివిధ శాఖల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సాక్షాత్తూ సీఎం పంపిన ఫైళ్ళను కూడా పెండింగ్‌లో పెట్టేశారు. చివరికి సీఎం చేత చీవాట్లు తింటున్నారు.

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాగ్దాన కర్ణుడు. హామీలు ఇవ్వడంలో ఆయన తర్వాతే ఎవరైనా. ఆయన అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నర ఏళ్ళలో వందలకొద్దీ వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలు కూడా అలా ఇలా వుండవు... వినేవాళ్ళ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే విధంగా వుంటాయి. అయితే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానాల్లో ఎన్ని అమలయ్యాయనేది మాత్రం అడక్కండి. కేసీఆర్ సారు రీసెంట్‌గా గిరిజనుల కోసం ధారాళంగా వాగ్దానాలు చేసేశారు. గిరిజనుల కరెంటు బకాయిల మాఫీ, విద్యుత్ కేసులు రద్దు, 125 రూపాయలకే ఇంటింటికీ విద్యుత్ కనెక్షన్, 60 యూనిట్ల లోపు విద్యుత్ ఛార్జీ మినహాయింపు.... ఇలా గిరిజనుల కోసం వరాలు ప్రకటించారు. ఇలాగే వివిధ శాఖల్లో ఉద్యోగాల నియామకాల విషయంలో కూడా వరాలు ఇచ్చేశారు. ఇంకా ఇలాంటి బోలెడన్ని వరాలు కేసీఆర్ ప్రకటించేసి వాటి అమలు బాధ్యతను మాత్రం అధికారుల భుజాల మీద పెట్టారు.

 

ఇప్పటికే ఏలినవారి వరాలను ఎలా నెరవేర్చాలా అని ఆలోచిస్తూ టెన్షన్ పడిపోతున్న అధికారులు ఎప్పటికప్పుడు తమీద వచ్చి పడుతున్న వరాల భారాన్ని తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. అంచేత సీఎం ఇచ్చిన అనేక వరాలు అమల్లోకి రాలేదు. సదరు వరాల ఫైళ్ళు పెండింగ్‌లో పడిపోయాయి. దాంతో సీఎం గారికి కోపం వచ్చేసింది. దేవుడు వరమిచ్చినా పూజారి పడనివ్వలేదన్నట్టుగా తాను వరాలు ఇచ్చినా అధికారులు వాటిని అమల్లోకి తేవడం లేదని ఫైరైపోయారు. చీఫ్ సెక్రటరీని పిలిచి క్లాస్ ఇచ్చారు. దాంతో బుర్ర వేడెక్కిపోయిన చీఫ్ సెక్రటరీ తన ఆగ్రహాన్ని వివిధ శాఖల సెక్రటరీల మీద వ్యక్తం చేశారు. సీఎం గారు ఇచ్చిన వాగ్దానాలను కూడా నెరవేర్చకపోతే ఎలాగంటూ వివిధ శాఖల సెక్రటరీలకు లేఖలు రాశారు. అర్జెంటుగా సదరు ఫైళ్ళని క్లియర్ చేసేయాలని హెచ్చరించేశారు. దాంతో సీఎం గారి హామీలను అమలు చేయడం ఎలారా భగవంతుడా అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.