నలుగురు జడ్జిలను పక్కన పెట్టిన చీఫ్ జస్టిస్...


చరిత్రలో మొట్టమొదటిసారిగా నలుగురు సుప్రీంకోర్టు జడ్జిలు ప్రెస్ మీటింగ్ పెట్టి.. చీఫ్ జస్టిస్ పై సంచలన ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే కదా. కీలక కేసులను విచారించేందుకు బెంచ్ ఏర్పాటు విషయంలో చీఫ్ జస్టిస్ సరైన రీతిలో వ్యవహరించడం లేదని వారు ఆరోపించారు. దాని తరువాత  చీఫ్ జస్టిస్ కు, నలుగురు జడ్జిలకు మధ్య తలెత్తిన వివాదం సమసిపోయిందనే వార్తలు వచ్చాయి. అయితే ఇందులో వాస్తవం లేదని అర్ధమయిపోయింది. అత్యంత కీలకమైన రాజ్యాంగ ధర్మాసనం నుంచి జస్టిన్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ లను చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా పక్కనబెట్టారు. ఈ నేపథ్యంలో, నిన్న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని చీఫ్ జస్టిస్ ప్రకటించారు. ఈ బెంచ్ లో చీఫ్ జస్టిస్ తో పాటు జస్టిస్ ఏకే శిక్రీ, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్ లు ఉన్నారు. నిరసన వ్యక్తం చేసిన నలుగురు జడ్జిలకు బెంచ్ లో చోటు లేకపోవడం... ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది.