అధికారుల కాలర్లు పట్టుకోండి.. విద్యార్థులతో రాష్ట్ర మంత్రి

 

గొప్ప నాయకుడుగా పేరు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి?. నలుగురిని నడిపించాలి, మంచి పనులు చేయాలి, న్యాయం కోసం పోరాడాలి అబ్బో ఇలా రకరకాలుగా చెప్తుంటారు. అయితే ఇదంతా ఓల్డ్ ట్రెండ్. లేటెస్ట్ ట్రెండ్ ఏంటో తెలుసా.. ఐఏఎస్, ఐపిఎస్ ల కాలర్లు పట్టుకుంటే చాలు గొప్ప నాయకుడు అవుతారట. ఈ విషయాన్ని సాక్ష్యాత్తూ ఓ రాష్ట్ర మంత్రి గారే చెప్పారు. 

గొప్ప నాయకుడిగా ఎదగాలంటే అధికారుల కాలర్ పట్టుకోవాలని చత్తీస్ గఢ్ మంత్రి కవాసీ లఖ్మా విద్యార్థులకు హితబోధ చేశారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా.. సూక్మా జిల్లా పవారాస్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన మంత్రి విద్యార్థులతో ముచ్చటించారు. ఆ క్రమంలో 'మీరు గొప్ప నేతగా ఎదిగారు కదా.. ఇది మీకు ఎలా సాధ్యమైందంటూ' ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు మంత్రి గారు ఇచ్చిన సమాధానం చూసి అక్కడున్నవారు నివ్వెరపోయారు. పెద్ద నేతగా ఎదగాలంటే అధికారుల కాలర్ పట్టుకోవాలని మంత్రి సమాధానం ఇచ్చారు. కలెక్టర్, ఎస్పీ కాలర్ పట్టుకుంటే బడా లీడర్లుగా ఎదగొచ్చని ఆయన సూచించారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దుమారం రేగుతోంది. పిల్లలకు మంచి చెప్పాల్సింది పోయి ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఏంటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.