టిక్కెట్ ఇవ్వకుంటే ఆత్మహత్యే.. కేసీఆర్ దే బాధ్యత.!!

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు స్వీయ గృహ నిర్బంధం విధించుకున్నారు.. ఇటీవల తెరాస ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు.. తన ఇంట్లోనే తాళం వేసుకుని నిరసన తెలుపుతున్నారు.. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా గృహనిర్బంధంలోనే ఉన్నారు.. తనకు టిక్కెట్‌ కేటాయింపుపై స్పష్టమైన హామీ ఇస్తేనే గానీ తాను గృహ నిర్బంధం నుంచి బయటకు రానని ఆయన చెబుతున్నారు.

 

 

తాను 2009 నుంచి ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని ఓదెలు పేర్కొన్నారు.. తాజా జాబితాలో సిట్టింగులు అందరికీ టిక్కెట్లు ఇచ్చిన తనకు ఇవ్వకపోవడం చాలా బాధించిందన్నారు.. తనకు ఇప్పటికీ కేసీఆరే దేవుడని, ఎంపీ బాల్క సుమన్‌ వల్లే తనకు టిక్కెట్‌ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ విషయంలో ఏదొకటి తేలేవరకు తాను గృహ నిర్బంధం నుంచి బయటకు వచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు.. మరోవైపు 24 గంటల్లో టిక్కెట్ పై హామీ రాకుంటే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని, తనకేదైనా జరిగితే కేసీఆర్ దే బాధ్యతని ఓదెలు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఈ విషయంపై తెరాస అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.