ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యే "అనర్హుడ"వుతాడా..?

నంద్యాల ఉప ఎన్నిక ఫలితం తేలడంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి కాస్త తగ్గింది. అయితే ఆ వేడి ఇప్పుడు తెలంగాణకు షిఫ్ట్ అయ్యింది. వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు పౌరసత్వం చెల్లదంటూ భారత ప్రభుత్వం స్పష్టం చేయడంతో తెలంగాణలో అది హాట్ టాపిక్‌గా మారింది. రమేశ్ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి భారత పౌరసత్వం పొందారని నిర్థారణ అయితే ఎమ్మెల్యేగా అనర్హుడిగా మారడంతో పాటు రూ.50వేల జరిమానా, ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు. సీనియర్ రాజకీయ వేత్త చెన్నమనేని రాజేశ్వరరావు కుమారుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన రమేశ్ బాబు 2009లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.

 

ఆయన చేతిలో ఓడిపోయిన నాటి కాంగ్రెస్ అభ్యర్థి, నేటి బీజేపీ నేత ఆది శ్రీనివాస్ రమేశ్‌పై పంతం పట్టారో లేక మరేదైనా కారణమో కానీ..న్యాయపోరాటానికి దిగారు. అందుకు కారణం రమేశ్ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి మునుపు జర్మనీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు..ఆ దేశ పౌరసత్వం కూడా ఆయనకు ఉంది. అయితే ఉద్యోగాన్ని వదిలిపెట్టి తండ్రి అడుగుజాడల్లో రాజకీయరంగ ప్రవేశం చేశారు చెన్నమనేని. 2009లో ఎన్నికల్లో పోటి చేయడానికి కొద్దిరోజులు ముందు రమేశ్ భారత పౌరసత్వాన్ని తీసుకున్నారు. దీనిపై తనకు అనుమానాలున్నాయని శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. 1993లో భారత పౌరసత్వాన్ని రద్దు చేసుకుని తిరిగి 2008 మార్చి 31న మన దేశ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు రమేశ్.

 

కానీ భారత పౌరసత్వం లభించాలంటే దేశంలో వరుసగా 365 రోజులు స్థిర నివాసం ఉండాలని చట్టం చెబుతోంది. రమేశ్ వరుసగా అన్ని రోజులు ఇక్కడ లేరని, అందుకే ఆయన పొందిన పౌరసత్వం చెల్లదంటూ శ్రీనివాస్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిని స్వీకరించిన న్యాయస్థానం విచారణకు ఆదేశించింది. ఆ సమయంలో రమేశ్ కేవలం 96 రోజులు మాత్రమే భారత్‌లో ఉన్నట్లు తేలింది. దీంతో ఆయన తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పౌరసత్వం పొందారని 2013లో హైకోర్టు తీర్పునిచ్చింది. అంతేకాకుండా రమేశ్ ఎన్నిక చెల్లదని..ఓటర్ల జాబితాలోంచి కూడా ఆయన పేరును తొలగించాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ రమేశ్ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో 2010లో రమేశ్ బాబు ఎమ్మెల్యే పదవికి, తెలుగుదేశం పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసి 2010లో జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరపున బరిలో నిలిచారు. ఆ సమయంలో కూడా రమేశ్ ప్రత్యర్థి శ్రీనివాస్ కావడం గమనార్హం. ఆ ఎన్నికల్లోనూ విజయం రమేశ్‌బాబునే వరించింది.

 

అయితే సుప్రీం స్టేను సవాలు చేస్తూ శ్రీనివాస్ మరోసారి తన వాదనలు వినిపించడంతో పౌరసత్వం వివాదాన్ని తేల్చాలని కేంద్ర హోంశాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో రమేశ్ పౌరసత్వం చెల్లదని హోంశాఖ నివేదిక ఇచ్చింది. తాజా ప్రకటన టీఆర్ఎస్ శ్రేణులను కలవరానికి గురిచేసింది. తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని ఎంతో ఆశపడ్డ ఆ పార్టీ నాయకులు హోంశాఖ నిర్ణయంతో షాక్‌కు గురయ్యారు. ఇదంతా ఒక ఎత్తైతే ప్రస్తుతం అనర్హత భయం వారిని వెంటాడుతోంది. సుప్రీం మార్గదర్శకాల ప్రకారం పదవిలో ఉన్న ప్రజాప్రతినిధులపై నేరం రుజువైతే వారిపై అనర్హత వేటు పడుతుంది. అంటే వారు తమ పదవులను వదులుకోవడంతో పాటు ఐదు సంవత్సరాల వరకు ఎటువంటి ఎన్నికల్లో పోటీ చేయరాదు. అదే నిజమైతే రమేశ్ ఎమ్మెల్యే పదవిని కోల్పోయే పరిస్థితులున్నాయి. దాంతో వేములవాడ అసెంబ్లీ స్థానానికి ఖాళీ ఏర్పడి..అక్కడ ఉప ఎన్నిక అనివార్యమవుతుంది. అయితే ఆందోళన చెందాల్సిన పని లేదని మరోసారి రివ్యూ దరఖాస్తు చేసుకుంటానని రమేశ్ తన అనుచరులతో చెప్పినట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ కేంద్ర హోంశాఖ నివేదికను పరిగణలోనికి తీసుకుని సుప్రీం వెలువరించే తుది తీర్పుపై రమేశ్ భవితవ్యం ఆధారపడి ఉంది.