మహిళలు మన్నించకండి... క్షమించకండి...

ఈ దేశంలో ఆడ పిల్లలుగా పుడుతున్నందుకు.... మృగాళ్ల  చేతుల్లో నలిగిపోతున్నందుకు.... దేశంలో మహిళల్లారా ఇక్కడి మగవాళ్లని మన్నించకండి. జన్మనిచ్చిన అమ్మని కూడా వదలని రాక్షస దేశంలా మారుతున్నందుకు క్షమించకండి. అన్నెం... పున్నెం ఎరుగని... ఆటలు... పాటలు... చదువు తప్ప తెలియని పసి మొగ్గలను కూడా చిదిమేస్తున్న మగ మ్రగాలు నానాటికి పెరిగిపోతున్న కాలం. ముదుసలి వయసులో కన్నూమిన్నూ కానక మగవాళ్లు చేస్తున్న దారుణాలు దేశ ప్రజలని కలవరపెడుతున్నాయి. వయసుతో సంబంధం లేదు.... ప్రదేశంతో పని లేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒకటే పరిస్థితి. ఆ రాష్ట్రం... ఈ రాష్ట్రం అని బేధం లేదు. దేశ రాజధాని నుంచి ప్రతి చోటా మహిళలపై.... చిన్నారులపై అనాగరిక చర్చలే. చెన్నైలో పన్నెండేళ్ల చిన్నారిపై ఏడు నెలలుగా 24 మంది కామాంధులు పాశవికంగా జరిపిన అత్యాచారం దేశంలో ప్రతి ఒక్కరూ సిగ్గుపడే చర్య. బాధితురాలు వినికిడి లోపంతో బాధ పడుతోంది.

 

 

చెన్నైలోని అయనావరం కున్నూరు హైరోడ్డులోని సయానీ కాంప్లెక్స్‌ ప్రాంతంలో 14 అంతస్థుల సన్నివేల్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఉంది. ఆ అపార్ట్‌మెంట్‌లో చాలా ఫ్లాట్లు ఖాళీవే. అక్కడే లిప్ట్ ఆపరేటర్‌గా పని చేస్తున్న 66 ఏళ్ల ముదుసలి రవికుమార్ ఈ చిన్నారిపై కన్ను వేశాడు. నిత్యం పాఠశాలకు వెళ్లేందకు ఆ చిన్నారిని లిప్ట్‌లో కిందికి దిగి బస్పులో వెళ్తుంది. ఏడు నెలల క్రితం ఆ చిన్నారికి మాయమాటలు చెప్పి అత్యాచారం చేసాడు. ఈ విషయం బయట పెడితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆ చిన్నారిది మూగరోదనగానే మిగిలింది. ఆ తర్వాత మరికొందరితో కలిసి ప్రతి రోజూ ఆ చిన్నారికి నరకం చూపించారు. మత్తు ఇంజక్షన్లు ఇచ్చి... చిన్నారిపై అత్యాచారం చేసి వాటిని సెల్‌ఫొన్లలో చిత్రీకరించారు. ఎవరికైనా చెబితే ఆ వీడియోలను అందరికీ చూపిస్తామని బెదిరించారు. ఇలా చిన్నారిని చిదిమేసిన వాళ్లు 24 మంది. ఊరి నుంచి వచ్చిన తన అక్కకు విషయం తెలియడంతో  వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ అనాగరిక చర్యకు పాల్పడిన వారిలో లిప్ట్ ఆపరేటర్‌తో పాటు మరో 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

 

 

దేశంలో నిర్భయ చట్టం ఉంది. దేశంలో దోషులకు కఠిన శిక్షలు వేసే చట్టాలూ ఉన్నాయి. అయినా మహిళలపై దారుణాలు మాత్రం ఆగడం లేదు. పైగా అవి నానాటికి పెరుగుతున్నాయి. దీనికి కారణం చట్టాలున్నా అవి పటిష్టంగా లేకపోవడం. తప్పు చేసిన వారిని అరెస్టు చేసినా రెండు రోజుల్లో బయటకు వచ్చేస్తామనే భరోసా ఉంది. వారి తరఫున తిమ్మిని బమ్మిని చేస్తూ వాదించే న్యాయవాదులున్నారు. ఇదే కారణం. ఇదే భరోసా. ఇదే దీమా. అందుకే దేశంలో ఇలాంటి అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి దారుణాలకు పాల్పడిన వారికి శిక్షలు వేయాలి తప్ప అవి మరణ శిక్షలు కాకూడదనే మానవ సంఘాలూ ఉన్నాయి. అలా వాదించే వారికి ఏడు నెలలుగా ఆ చిన్నారి అనుభవించిన నరకం గుర్తుకు రాదు. అలా సమర్ధించే వారికి ఆ చిన్నారి మనోవేదన పట్టింపునకు రాదు.

 

 

ఇదీ మన వ్యవస్ధ. ఇదీ మన దౌర్భాగ్యం. ఇదీ మన దుస్థితి. ఈ స్థితిలో మార్పు రావాలంటే మనిషిలో మార్పు రావాలి. ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండాలంటే చట్టాలు కఠినంగా ఉండాలి. వాటిని పటిష్టంగా అమలు చేసే వ్యవస్ధ కావాలి. ఇందుకోసం పాలకులు కఠినంగా వ్యవహరించాలి. ప్రజలు కూడా బాధ్యత గుర్తెరిగి వ్యవహరించాలి. నిందితులను కోర్టులో హాజరు పరిచే సమయంలో అక్కడి న్యాయవాదులు వారిపై విరుచుకుపడ్డారు. వారిని మెట్లపై నుంచి కొట్టుకుంటూ కిందకు తీసుకువచ్చారు.  చెన్నై సంఘటనలో ఓ చిన్న ఆశాజనకమైన అంశం... అక్కడి న్యాయవాడులెవరూ నిందితులకు అనుకూలంగా వాదించమని చెప్పడం. ఈ కేసును ఎవరూ చేపట్టమని ప్రకటించడం.