అవధానప్రక్రియకు విశేషప్రాచుర్యం కల్పించిన శతావధాని

నేడు కవి చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 150వ జయంతి

ఆంధ్రదేశంలో అవధాన విద్యకు విస్తృతమైన ప్రాచుర్యం తీసుకువచ్చి, రూపురేఖలు ఏర్పరచడంలో,  అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించిన తెలుగు కవి, అవధాని, నాటకకర్త చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి. తిరుపతి వేంకట కవులుగా విశేషప్రాచుర్యం పొందిన వారిలో ఒకరు.  తెలుగులో అవధాన విద్యకు రూపురేఖలు తీర్చిదిద్దిన ఆయన దివాకర్ల తిరుపతిశాస్త్రితో కలిసి తిరుపతి వేంకట కవుల జంటగా ప్రసిద్ధిచెందారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తొలి ఆస్థానకవిగా సాహిత్యసేవలందించిన ఆయన 150వ జయంతి నేడు.

 

తూర్పుగోదావరి జిల్లా కడియంలో 8 ఆగస్టు1870లో వేంకటశాస్త్రి జన్మించారు. ఆయన తల్లిదండ్రులు చంద్రమ్మ, కామయ్య. అతని ముత్తాత తమ్ముడు వేంకటేశ్వర విలాసము, యామినీ పూర్ణతిలక విలాసము అనే గ్రంథాలు రచించిన కవి. అతను సేకరించిన అమూల్య తాళపత్ర గ్రంథాలు వేంకటశాస్త్రికి అందుబాటులో ఉండేవి. తరువాత వారు కడియం నుంచి యానాంకు మకాం మార్చారు. కొంతవరకు కవి, పండిత నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆయన అసాధారణ ధారణశక్తితో తన ప్రతిభను నలుదిశగా చాటారు. ప్రముఖ పండితులు చర్ల బ్రహ్మయ్య శాస్త్రి వద్ద వ్యాకరణం నేర్చుకున్నారు. ఆ తర్వాత కాశీ వెళ్ళి అక్కడ పండితుల వద్ద వ్యాకరణ, తర్క శాస్త్రాలు, వేద భాగం, సంస్కృత కావ్యాలు, బ్రహ్మసూత్ర భాష్యం వంటివి అధ్యయనం చేశాడు. కాశీ నుంచి తిరిగి చర్ల బ్రహ్మయ్యశాస్త్రి వద్ద చేరారు. ఆ తర్వాత తన పాండిత్యానికి మెరుగులు దిద్దుకుంటూ అవధానాలు చేయాలని సంకల్పించి తన నిర్ణయాన్ని గురువుతో చెప్పారు. తన శిష్యుల్లో మరొకడైన దివాకర్ల తిరుపతిశాస్త్రిని జోడీగా స్వీకరించమని గురువు సూచించడంతో 1891లో కాకినాడలో జంటగా వారిద్దరి తొలి శతావధానం జరిగింది. తిరుపతి వేంకట కవుల పేరుతో చేసిన ఆ శతావధానంలో ప్రతిభ, పాండిత్యాలను ప్రదర్శించడంతో పాటు, యుక్తితో పండితులను గెలిచారు. అలా జంటకవుల్లో ఒకరుగా చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి విజయపరంపర ప్రారంభమైంది. ధారాశుద్ధితో కూడిన ధారణాశక్తి, ఆశుధారాపటిమ తో వారు చేసే అష్టావధానాలు, శతావధానాలకు ప్రజాదరణ, రాజాదరణ పెరిగింది. జంటగా వీరు మహాభారతం ఆధారంగా రాసిన పద్యనాటకాల్లో పాండవోద్యోగ విజయాలు విశేష  ప్రాచుర్యం పొందాయి. కావ్య రచనతో పాటు వివాద సాహిత్యాన్ని వెలువరించారు. దివాకర్ల తిరుపతిశాస్త్రి 1920లో మరణించిన తర్వాత చెళ్ళపిళ్ల చాలా వచన రచనలు, పద్య రచనలు చేశారు. అయితే తన రచనల్లో చాలావాటిని తిరుపతి వేంకటీయం అన్న జంట పేరు మీదే ప్రచురించిన ప్రతిభామూర్తి.

 

తిరుపతి వేంకట కవులకు ముఖ్యంగా చెళ్లపిళ్ల వేంకటశాస్త్రికి ఎందరో చిన్నా పెద్దా సాహిత్యవేత్తలు, కవులు, పండితులు వీరితో వివాదాలు, జగడాలు, వాదప్రతివాదాలు జరుగుతూ ఉండేవి.  ఆయా వివాదాలన్నీ సాహిత్యరూపం వచ్చాయి.   కొప్పరపు సోదరకవులతో జరిగిన వివాదాలను సవివరంగా "గుంటూరి సీమ" పేరుతో గ్రంథరూపంలో తీసుకువచ్చారు. ఇతరులతో ఉన్న వాదప్రతివాదాలతోనూ వందలాది పుటల సాహిత్యం వచ్చింది.

 

చెళ్లపిళ్ల తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేశాడు. అతని వద్ద శిష్యులుగా చదువుకున్నవారు చాలామంది ఆ తర్వాతి కాలంలో తెలుగు సాహిత్యరంగంలోను, భాషాశాస్త్రంలోనూ కవులుగా, పండితులుగా ప్రఖ్యాతి పొందారు.  పండితుకే కాదు అతి సామాన్యులకు కూడా అర్థం అయ్యేలా ఆయన సాహిత్యం ఉంటుంది. వేంకటశాస్త్రి పద్యరచనలతో పాటుగా వచనరచనలు చేయడం కూడా ప్రారంభించాడు. అలా రాసినవే అనంతర కాలంలో కథలు గాథలు గా, కాశీయాత్రగా ప్రచురితమయ్యాయి. వచనం కూడా గ్రాంథిక భాషలో ప్రారంభించి, తర్వాతి కాలంలో సరళ వ్యావహారికం లో రాయడం ప్రారంభించి సుదీర్ఘమైన రచనాజీవితంలో తన శైలిని ఎప్పటికప్పుడు దిద్దుకుంటూ మెరుగుపెడుతూనే సాహిత్యప్రియుల అభినందనలు వేంకటశాస్త్రి అందుకున్నారు. ఎన్నో కావ్యాలు, శతకాలు, అనువాదాలు, నాటకాలు రాశారు. అనేక సత్కారాలు, బిరుదులు అందుకున్నారు. 80ఏండ్ల వయసులో 1950లో ఆయన మరణించారు.