ఒకే ఒక్క అడుగు దూరంలో లక్ష్యం... ఇస్రోకి ఇదే అసలుసిసలు సవాలు...

 

వెయ్యి కోట్ల రూపాయలతో ప్రయోగించిన చంద్రయాన్-2 చివరి దశకు చేరుకుంది. చందమామను అందుకోవడానికి ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచింది ఇస్రో. చందమామ చివరి కక్ష్యలో పరిభ్రమిస్తోన్న ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్... మరికొన్ని గంటల్లో జాబిల్లిపై అడుగు పెట్టబోతున్నాయి. అయితే, ఇప్పటివరకు సాగిన చంద్రయాన్-2 ప్రయాణం ఒక ఎత్తయితే... చివరిగా జరగాల్సిన సాఫ్ట్ ల్యాండింగే అతిపెద్ద సవాలుగా మారింది... చంద్రుడి దక్షిణధృవం వైపు దూసుకెళ్తోన్న ల్యాండర్ విక్రమ్‌ను సజావుగా దిగేలా చేయడమే ఇప్పుడు ఇస్రో ముందున్న లక్ష్యం.

సెకనుకు కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్న ల్యాండర్ విక్రమ్‌ను చందమామ దక్షిణ ధృవంలో సురక్షితంగా దిగేలా చేయడం అత్యంత సంక్లిష్ట పని. చంద్రుడి ఉపరితలంపై ఎగుడు దిగుడు లేని ప్రదేశాన్ని ఎంచుకుని... విక్రమ్‌ను ల్యాండ్ చేయాల్సి ఉంటుంది‌. అయితే, వందల కిలోమీటర్ల వేగంతో పరిభ్రమిస్తోన్న ఈ ల్యాండర్ వేగాన్ని సకాలంలో నియంత్రిస్తూ ఉండాలి. అందులో, ఒక్క సెకను తేడా వచ్చినా సాఫ్ట్ ల్యాండింగ్ కుదరకపోవచ్చు. దాని వల్ల ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇస్రో తన లక్ష్యాన్నీ చేరుకోలేకపోవచ్చు.

అయితే, విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌కు అమర్చిన కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు అందే ఫొటోలను బేరీజు వేసుకుంటున్న ఇస్రో.... సాఫ్ట్ ల్యాండింగ్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా కొండ ప్రాంతాలు, అగాథాల్లేని ప్రాంతం కోసం వెదుకుతోంది. చదునుగా ఉంటే, ఉపరితలాన్ని ఎంచుకుని, సాఫ్ట్ ల్యాండింగ్ ప్రయత్నిస్తోంది. అయితే, ఇది క్షణాల్లో జరిగిపోయే ప్రక్రియ. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా... మొత్తం కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది.

7న అర్ధరాత్రి ఒకటిన్నర నుంచి రెండున్నర మధ్య విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కాలు మోపే అవకాశాలున్నాయి. అయితే, ఇప్పటివరకు సాగిన ప్రయాణంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకపోవడంతో ల్యాండింగ్ కూడా విజయవంతమవుతుందనే ధీమాతో ఉంది ఇస్రో. అత్యంత క్లిష్టమైన దశగా భావిస్తున్న సాఫ్ట్ ల్యాండింగ్‌ను  అధిగమిస్తే... అంతరిక్ష పరిశోధనల్లో అంతర్జాతీయంగా భారత్ పేరు మారుమోగడం ఖాయం.