కడప టీడీపీ పంచాయితీ కొలిక్కి.. ఎంపీగా ఆది?

 

కడప జిల్లా టీడీపీ పంచాయితీ కొలిక్కి వచ్చింది. కడప పార్లమెంట్‌, జమ్మలమడుగు అసెంబ్లీ స్థానాల విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ఈ రెండు సీట్ల విషయంలో పోటీకి ఎవరిని నిలబెట్టాలన్నది సీఎం చంద్రబాబే నిర్ణయం తీసుకుంటారని నేతలు స్పష్టంచేశారు. సీట్ల విషయంలో చంద్రబాబుతో బుధవారం అమరావతిలో మంత్రి ఆదినారాయణరెడ్డి, విప్‌ రామసుబ్బారెడ్డి సమావేశమయ్యారు. 3 గంటల పాటు ఇద్దరు నేతలనూ దగ్గర పెట్టుకుని మాట్లాడినా ఎమ్మెల్యే టిక్కెట్‌ కోసమే వారు పట్టుబట్టారు. దీంతో టికెట్ల విషయంలో మరోసారి చంద్రబాబు గురువారం వీరితో చర్చించారు. ఈ భేటీ అనంతరం ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. వారం రోజుల్లో చంద్రబాబు తన నిర్ణయాన్ని చెబుతానని అన్నారని మీడియాకు వెల్లడించారు. అభ్యర్థి ఎంపిక అంశాన్ని అధినేతకే వదిలేశామని స్పష్టంచేశారు. ఎవరికి ఏ స్థానం కేటాయించినా కలిసి పనిచేస్తామని చెప్పారు. కడప జిల్లాలో అన్ని స్థానాలను కైవసం చేసుకుంటామని మంత్రి ఆదినారాయణరెడ్డి ధీమా వ్యక్తంచేశారు. ఇదిలా ఉంటే జమ్మలమడుగు ఎమ్మెల్యేగా రామసుబ్బారెడ్డిని, కడప ఎంపీగా ఆదినారాయణరెడ్డిని బరిలోకి దింపాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.